Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణం: నారా లోకేశ్

ఏపీ వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని వ్యాఖ్యానించారు. నేడు కర్నూలు జిల్లా కె.మార్కాపురంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా గ్రామస్తులు ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇళ్లకు ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామంలో ఈ నాలుగేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కల్తీ విత్తనాలు, పురుగు మందులతో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులపై స్పందించిన లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులకు ఉద్వాసన పలుకుతామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.8600 కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామని, సామాన్యుడికి ఇసుకను అందుబాటులోకి తెచ్చి నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img