Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏపీలో ప్రారంభానికి సిద్ధమైన సోలార్ మాడ్యూల్ ప్లాంట్.. రూ.25వేల కోట్ల పెట్టుబడితో ..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులతో మరో సంస్థ ప్రారంభానికి సిద్ధమైంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ఇఎల్‌) అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ నెల్లూరు జిల్లా రామాయపట్నంలో అత్యాధునిక సోలార్‌ మాడ్యూల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నుంచి ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. జనవరి 2024లో కేటాయించిన సుమారు 30 ఎకరాల భూమిలో ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేశామని కంపెనీ సీఈవో శరత్ చంద్ర తెలిపారు. మార్చి 31 నుంచి తాము 500 మెగావాట్ల సోలార్‌ పివి మాడ్యూల్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది అత్యాధునిక పూర్తి ఆటోమెటిక్‌ మాడ్యూల్‌ లైన్‌.. దేశంలోనే తొలి గ్లాస్‌-గ్లాస్‌, బ్యాక్‌ షీట్‌ కాంబినేషన్‌తో పెర్క్‌, టాప్‌కాన్‌, హెచ్‌జెటి మాడ్యూల్‌లను తయారు చేస్తామన్నారు. తొలి దశలో రూ.15,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నామన్నారు శరత్ చంద్ర. మరో ఏడాదిన్నరలో రెండో దశ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మొత్తంగా రూ.25వేల కోట్ల పెట్టుబడి వ్యయాన్ని అంచనా వేశామన్నారు. పూర్తి స్థాయిలో నిర్వహణలోకి తీసుకురావడం ద్వారా 23వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. తాము ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తొలి దశలో కేంద్ర పిఎల్‌ఐ స్కీం కింద రూ.1870 కోట్లు, రెండో దశలో రూ.3,300 కోట్ల చొప్పున ప్రోత్సాహకాలు అందనున్నాయన్నారు. భవిష్యత్తు పునరుత్పాదన ఇంధన రంగానికి భారీ డిమాండ్‌ ఉంటుందని.. కడపలోని తమ ఎస్‌ఎస్‌ఇఎల్‌ ప్లాంట్‌లో రోజుకు 500కి పైగా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తయారవుతున్నాయని తెలిపారు. మొదటి ఫేజ్ 2025 చివరినాటికి పూర్తి చేస్తామని.. రెండో ఫేజ్ 2026 చివరినాటికి పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img