Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

రాజధాని అమరావతిలోనే ఉంటుంది… అంగుళం కూడా కదిలించలేరు

ఇది త్యాగధనుల భూమి…
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు
ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు పోరు
సీపీఐ గుంటూరు జిల్లా మహాసభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు

తుళ్ళూరు : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ఇక్కడ నుంచి రాజధానిని అంగుళం కూడా తరలించలేరని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. తుళ్ళూరులో శనివారం జరిగిన సీపీఐ గుంటూరు జిల్లా మహాసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ముప్పాళ్ల మాట్లాడారు. సభకు సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. సభలో ముప్పాళ్ల మాట్లాడుతూ ఒక వైపు ధర్మాన్ని కాపాడే న్యాయస్థానాలు మరొవైపు ప్రజా పోరాటాలు కలిసి అమరావతి రాజధానిని శాశ్వతంగా ఇక్కడే ఉండే విధంగా కాపాడుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో తుళ్ళూరు ప్రాంతం త్యాగధనుల భూమిగా నిలచిపోతుందని, అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా భూములిచ్చిన అనేక మంది రైతులు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. ఆది నుంచి సీపీఐ అమరావతి రాజధానికి అనుకూలంగా ఉందని, ఢల్లీి నుంచి తుళ్ళూరు వరకు సీపీఐ నాయకత్వం ఒకే మాటపై నిలబడిరదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంట్‌ సాక్షిగా వెంకయ్యనాయుడు ప్రకటించారని, బీజేపీ అధికారం చేపట్టి 8 ఏళ్ళు గడిచిన ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ తదితర విభజన హామీలను అమలు చేయలేదన్నారు. అయినప్పటికి జగన్‌మోహన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి అడగకుండానే మద్దతు ప్రకటించారన్నారు. కేసుల నుంచి విముక్తి పొందడానికే జగన్‌మోహన్‌ రెడ్డి మద్దతు ప్రకటించారే గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీ దళితులు, మైనారిటీల పార్టీ అంటూ ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో దళితులపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 10 వేల పోస్టులను ప్రకటించి వాటిని భర్తీ చేయలేదని, పోలీసు నియామకాలు నేటికి చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, ప్రజా హక్కులను హరించే ఇటువంటి పాలనను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ దుర్మార్గాలను భరించే స్థితిలో ఇక ప్రజలు లేరని, ఎన్నికలు ఎప్పుడొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఏకైక రాజధాని అమరావతిని ప్రకటించే వరకు సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని ఉద్ఘాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వలన నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని గుర్తుచేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీ అంశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. ఆగస్టులో విశాఖలో జరిగే సీపీఐ రాష్ట్ర స్థాయి మహాసభలను, అక్టోబర్‌లో విజయవాడలో జరిగే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ముస్లిం, మైనారిటీ వర్గాలు, దళితులపై దాడులు పెరిగాయన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజులలో రాజధాని సమస్యలపై సీపీఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తొలుత సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పచ్చల సాంబశివరావు అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సీపీఐ కార్యదర్శి మారుతివరప్రసాద్‌, బాపట్ల జిల్లా కార్యదర్శి నాగాంజనేయులు, రాష్ట్ర నాయకులు వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన ఆంజనేయులు, పల్నాడు జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, గుంటూరు జిల్లా సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, సింగరయ్య, పుప్పాల సత్యనారాయణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు గని, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి భైరాపట్నం రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆరేటి రామారావు, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ ఎం.హనుమంతరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బందెల నాసర్‌ జీ, ఏఐవైఎఫ్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి సుభాని, తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముపాళ్ల శివశంకరరావు, తుళ్ళూరు మండల కార్యదర్శి గుంటుపల్లి వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ రాజధాని ప్రాంత కార్యదర్శి జీవీ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు గుర్రంకొండ సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img