Monday, May 6, 2024
Monday, May 6, 2024

సుప్రీంపై జగన్‌కు గౌరవమేది?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : విశాఖ రాజధాని కాబోతున్నదని, తానూ విశాఖ నుంచే పాలన సాగించనున్నానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం సుప్రీంకోర్టుపై ఆయనకున్న అగౌరవ భావానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అమరావతినే రాజధానిగా గుర్తించి, అభివృద్ధిపరచాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిందని మంగళవారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. మూడు రాజధానుల బిల్లును వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా…ఏపీకి విశాఖ రాజధాని కాబోతున్నదని జగన్‌ పేర్కొనడం ఆయన నిరంకుశ వైఖరికి పరాకాష్ఠ. ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా ఇలాంటి ప్రకటనలు చేయడం జగన్‌కు తగదు. సుప్రీంకోర్టును గౌరవించలేని సీఎంగా జగన్‌ చరిత్రకెక్కారని మండిపడ్డారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్‌ పాలన సాగుతోందని విమర్శించారు. దేశ చరిత్రలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందని వివరించారు. జగన్‌ అహంకారపూరిత స్వభావాన్ని విడనాడాలని, అమరావతినే రాజధానిగా గుర్తించి, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని రామకృష్ణ హితవు పలికారు.
జగన్‌ ప్రకటన మోసపూరితం: సీపీఎం
రాజధానిని, సీఎం నివాసాన్ని విశాఖకు మారుస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. మూడు రాజధానులపై చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. హైకోర్టు తీర్పును ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించిందని, కేసు సుప్రీంకోర్టులో ఉండగా రాజధానిపై సీఎం ప్రకటన చేయడం కోర్టు ధిక్కరణేనని పేర్కొన్నారు. సీఎం నివాసం మారినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండబోదని, ఉత్తరాంధ్ర ప్రజలను తప్పుదారి పట్టించడానికి, రియల్‌ ఎస్టేట్‌లో స్పెక్యులేషన్‌ పెంచడానికి ఇది తోడ్పడుతుందని విమర్శించారు. విశాఖఉక్కును ప్రైవేట్‌పరం చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ రాజధాని పేరుతో మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img