Friday, April 26, 2024
Friday, April 26, 2024

వంట నూనె ధర రూ.15 తగ్గింపు?

మరిన్ని కంపెనీలు ధరలు తగ్గిస్తాయి : కేంద్రం

న్యూదిల్లీ : అంతర్జాతీయ సరుకు ధరల తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మరిన్ని కంపెనీలు వంట నూనెల గరిష్ఠ రిటైల్‌ ధరలను లీటరుకి రూ.15 వరకు తగ్గించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దేశీయ విపణిలో వంట నూనెల ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ధరలను తగ్గిం చాలని ప్రభుత్వం బుధవారం ఆహార నూనెల కంపెనీలను ఆదేశిం చింది. ఈ ఆదేశాలను అనుసరించి, మదర్‌ డెయిరీ గురువారం సోయాబీన్‌, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ధరలను లీటరుకు రూ.14 వరకు తగ్గించింది. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఎంఆర్‌పీ తగ్గుతుందని అంచనా వేస్తోంది. దిల్లీ`ఎన్‌సీఆర్‌లో ప్రముఖ పాల సరఫరాదారుల్లో ఒకటైన మదర్‌ డెయిరీ, ధారా బ్రాండ్‌తో వంట నూనెలను విక్రయిస్తోంది. భారతదేశం తన ఆహార నూనెల అవసరాలలో 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. కాగా ‘తమ ధరలను తగ్గించని, ఇతర బ్రాండ్‌ల కంటే ఎంఆర్‌పీ (గరిష్ఠ రిటైల్‌ ధర) ఎక్కువగా ఉన్న కొన్ని కంపెనీలకు కూడా వాటి ధరలను

తగ్గించాలని సూచించాం’ అని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట నూనెల ధరలు, లభ్యతను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్న మంత్రిత్వ శాఖ, వంట నూనెలపై తగ్గిన సుంకం, అంతర్జాతీయ ధరల నిరంతర గణనీయమైన తగ్గుదల ప్రయోజనాలను అంతిమ వినియోగదారులకు తక్షణమే బదిలీ అవుతుందని తెలిపింది. ‘వినియోగదారులు తమ వంటగది బడ్జెట్‌లో కొంత అదనపు డబ్బును ఆదా చేసేందుకు ఎదురుచూడ వచ్చు’ అని పేర్కొంది. జులై 6న జరిగిన సమావేశంలో దిగుమతి చేసుకున్న వంట నూనెల అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం ‘చాలా సానుకూల పరిణామం’ అని తయారీదారులు, శుద్ధి కంపెనీలకు సమాచారం అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘అందువల్ల దేశీయ మార్కెట్‌లో ధరలు కూడా తగ్గుముఖం పట్టేలా దేశీయ ఆహార నూనెల పరిశ్రమ నిర్ధారించుకోవాలి. ఈ ధర తగ్గింపును వినియోగదారులకు త్వరితగతిన అందించాలి’ అని కోరింది. బుధవారం జరిగిన సమావేశం లో ధరల వివరాల సేకరణ, వంట నూనెలపై నియంత్రణ క్రమం, ప్యాకేజీ వంటి అంశాలపైనా చర్చించారు.
గత ఒక నెలలో వివిధ వంట నూనెల ప్రపంచ ధరలు టన్నుకు 300 నుంచి 450 డాలర్లకు పడిపోయాయని పరిశ్రమ తెలియజేసింది. అయితే రిటైల్‌ మార్కెట్లలో ప్రతిబింబించడానికి సమయం పడుతుందని, రాబోయే రోజుల్లో రిటైల్‌ ధరలు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఆ ప్రకటన వివరించింది. మే నెలలో ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, కాచి ఘనీ ఆయిల్‌ గరిష్ఠ రిటైల్‌ ధరను లీటరుకు రూ.10 తగ్గించింది. కాగా దిగుమతి సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో వంట నూనెల ధరలను తగ్గించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు అనూహ్యంగా పతనమవుతున్నాయని, అయితే, ధరలు క్రమంగా తగ్గుతున్నందున దేశీయ మార్కెట్‌లో పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img