Friday, April 26, 2024
Friday, April 26, 2024

అవినీతికి మోదీ కొత్త భాష్యం

దివారాత్రాలు పని చేసేది ప్రధానమంత్రి మోదీ ఒక్కరే కారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలైన, సీబీఐ, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ తో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా నిరంతరం పని చేస్తూనే ఉంది. ఈ సంస్థలు ఏం పని చేయాలో మోదీ సర్కారు చాలా స్పష్టంగా గిరిగీసి చూపించి నట్టుంది. ఈ సంస్థలకు ప్రతిపక్ష నాయకులలోనే అవినీతి కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పలుకుబడిగల ఏ  రాజకీయ పార్టీకి చెందిన నాయకులూ ఈ కేంద్ర సంస్థల కోరలనుంచి తప్పించుకునే అవకాశం లేదు. అందరి జాతకాలూ తన దగ్గర ఉన్నాయని మోదీ 2017లోనే ప్రకటించారు. ఈ సంస్థల దాడి నుంచి తప్పించుకోవడానికీ, ఆత్మ రక్షణకు బీజేపీలో చేరిన నేతలకు మాత్రమే రక్షణ ఉంది. అలాంటి వారి మీద అంతకు ముందు ఎన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చినా వారు బీజేపీలో చేరడంతోనే పునీతులైపోతున్నారు. అధికారాన్ని పదిల పరచుకోవడానికి బీజేపీ సర్కారు కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రమే వినియోగించుకోవడం లేదు. తమ అధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలన్నింటినీ రంగంలోకి దింపింది. ఈ సంస్థలన్నీ మోదీ సర్కారు అధికారాన్ని పదిలపరచవలసిన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని దర్యాప్తు సంస్థలను వినియోగించి ప్రతిపక్ష నాయకులందరినీ అవినీతిపరులని ప్రచారం చేసి లబ్ధి పొందడమే బీజేపీ లక్ష్యంగా మారింది. ఎక్కడైనా ఎన్నికలు జరగవలసినప్పుడే ఈ సంస్థలను రంగంలోకి దింపడం అనే ఆనవాయితీ కూడా మారిపోయింది. ఆ సంస్థల అధికారులు నిద్రాహారాలు మాని దాడులు కొనసాగించవలసిన స్థితిలో ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి మాత్రమే మోదీ సర్కారు పరిమితం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సకల వ్యవస్థలనూ వినియోగించి ప్రతిపక్ష నాయకులందరూ అవినీతి పరులేనని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. అలాగని ఈ దాడులకు గురవుతున్న నాయకులందరూ కడిగిన ముత్యాల్లాంటి వారని వాదించడం కాదు. బీజేపీ నాయకులు, లేదా ఆరోపణల దెబ్బకు తాళలేక బీజేపీలో చేరిన నేతలు తప్ప మిగతా వారందరూ కళంకితులేనని మోదీ సర్కారు నిరూపించదలచుకుంది. అంటే బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర వ్యవస్థలను ప్రతిపక్షాలను అణచి వేయడానికి పదునైన ఆయుధాలుగా వినియోగించుకుంటోంది. 2016 లోనే ప్రతిపక్షాలకు నిధులు అందకుండా మోదీ కట్టుదిట్టం చేశారు. అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు నిత్యకృత్యమైపోయాయి. ఎన్నికల్లో గెలవడానికి ఈ వ్యవస్థలను మోదీ వాటంగా ఉపయోగించుకుంటున్నారు. ధన దుర్వినియోగ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు ప్రతిపక్ష నాయకుల మీద మోపు తున్నారు. గత దశాబ్ద కాలంలో ఈ చట్టం కింద 1569 కేసులు మోపితే కేవలం తొమ్మిది సందర్భాలలో మాత్రమే ఆరోపణలు ఎదుర్కున్న వారికి శిక్ష పడిరది. అంటే ఎక్కువ భాగం కక్ష సాధించడానికే దాడులు జరిగాయి. 

కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మీద వ్యక్తి గత అవినీతి ఆరోపణలు లేకపోయినా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నిధులను దిర్వినియోగం చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థలు గంటల తరబడి ప్రశ్నించాయి. అయితే వీరి మీద ఇప్పటిదాకా ఒక్క కేసైనా దాఖలు చేయలేదు. అవసరమైనప్పుడు ఇదివరకు మూసేసిన కేసులను మళ్లీ తెరుస్తున్నారు. లాలూ ప్రసాద్‌ మీద దాడి ఇలాంటిదే. లాలూ కుటుంబం మొత్తం దర్యాప్తు సంస్థల దాడులను ఎదుర్కుంటూనే ఉంది. లాలూ సతీమణి రబ్డీ దేవి, కొడుకు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, లాలూ కూతుర్లు కూడా ఈ దాడులకు గురయ్యారు. ఇంకా గురవుతూనే ఉన్నారు. తాజాగా రబ్డీ దేవి మీద, దిల్లీలోని తేజస్వి ఇంటి మీద దాడులు జరిగాయి. తేజస్వి మీద మొదటి సారి దాడి జరిగినప్పుడే ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థల వారు మళ్లీ వస్తారు అని జోస్యం చెప్పారు. ఆ జోస్యం నిజమైంది. తాము భయానకమైన ఎమర్జెన్సీ రోజులను చూసిన వాళ్లం అని తీవ్ర అనారోగ్యంతో తీసుకుంటున్న లాలూ సవాలు విసురుతున్నారు. తన భార్య, కూతుళ్లు, కొడుకుల మీద దాడులు కొనసాగించినా భయపడేది లేదని లాలూ ప్రతిజ్ఞ చేశారు. బీజేపీతో తనది సైద్ధాంతిక పోరాటం అని అది కొనసాగుతూనే ఉంటుందని లాలూ స్పష్టం చేశారు. లాలూ కుటుంబాన్ని వేధిస్తు న్నందుకు ఆర్‌.జె.డి. కార్యకర్తలలో ఆగ్రహం కుతకుత ఉడుకుతోంది. వారు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాలూతో బీజేపీ వైరం ఈ నాటిది కాదు. అడ్వాణీ రథ యాత్ర బిహార్‌ లో ప్రవేశించగానే ఆ రథ యాత్రను అడ్డుకున్న చరిత్ర లాలూకు ఉంది. అంతకు ముందు అడ్వాణీ రథ యాత్ర కొనసాగిన చోటల్లా మతకలహాలు జరిగి కనీసం 3,000 ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇంతవరకు బీజేపీతో ఏ దశలోనూ చేయి కలపకుండా ఉన్నది ఆర్‌.జె.డి.ఒక్కటే . తమ తండ్రికి ఏమైనా అయితే ఒక్కరినీ వదిలి పెట్టబోనని లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య అంటున్నారు. వెయ్యి సార్లు దాడి చేసినా తాము లొంగేది, భయపడేది లేదని రబ్డీ దేవి చెప్పారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్‌ కొన్ని నెలలుగా జైలులోనే ఉన్నారు. ఆయనకు బెయిలు కూడా రావడం లేదు. తాజాగా దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేశారు. ఆయన మీద కేసుల మీద కేసులు మోపుతున్నారు. దిల్లీ మద్యం విధానం కుంభకోణంలోనే భారత రాష్ట్ర సమితి (మునుపటి టి.ఆర్‌.ఎస్‌.) నాయకురాలు కవితను దిల్లీ పిలిపించి విచారి స్తున్నారు. అవినీతిని నిర్మూలించడమే తన అంతిమ లక్ష్యం అని ప్రకటించిన మోదీకి బీజేపీ నాయకుల మీద, తన ప్రభుత్వం మీద వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రం కనిపించవు. పైగా ఆర్థిక నేరస్థులను వెనకేసుకురావడమే ఆయన లక్ష్యంలా ఉంది. ఉదాహరణకు 2014లో సుప్రీంకోర్టు 204 బొగ్గు గనుల కేటాయిం పులను రద్దు చేసింది. అందులో అదానీకి చెందిన పి.ఇ.కె.బి., పర్సా సంస్థలూ ఉన్నాయి. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలు మార్చి మళ్లీ ఆ రెండు సంస్థలకు బొగ్గు గనులు కట్టబెట్టి తాను ఎవరి అవినీతిని సహిస్తారో మోదీ రుజువు చేసుకున్నారు. మేఘాలయలో ఇప్పుడు వరసగా రెండో సారి విజయం సాధించిన కోన్రాడ్‌ సంగ్మా ప్రభుత్వం అంత అవినీతికరమైంది దేశంలోనే లేదు అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మోదీ అక్కడ తమ పార్టీకి దక్కింది రెండు స్థానాలే అయినా అధికారంలో వాటా కోసం కోన్రాడ్‌ సంగ్మా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు హాజరు కావడం మోదీ పెట్టిన కొత్త ఒరవడి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img