Friday, April 26, 2024
Friday, April 26, 2024

తిరుగుబాటు దిశలో లాలూ మద్దతుదార్లు

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆదాయపు పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, సీబీఐ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయడం మోదీ పెట్టిన ఒరవడి ఏమీ కాదు. గిట్టనివారిపై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సీబీఐ లాంటి సంస్థలను వినియోగించింది. అయితే కాంగ్రెస్‌ తమ పార్టీ వారి మీదే ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగించేది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే అదే పార్టీ సీనియర్‌ నాయకులైన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి ఏ.ఆర్‌.అంతులే, మూడుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథ్‌ మిశ్రా, గిరిజన నాయకులలో తలమానికం అయిన జార్ఖండ్‌ నాయకుడు శిబూ సొరేన్‌ లాంటి వారు దర్యాప్తు సంస్థల దాడిని ఎదుర్కొన్నవారే. ఇందిరా గాంధీ హయాంలో ఎంత జనాదరణ ఉన్న ముఖ్యమంత్రులనైనా సీబీఐ చిట్టావిప్పి నోరు మెదపకుండా చేసేవారంటారు. ఇందిరాగాంధీ హయాంలో అమలుచేసిన ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ బీజేపీ నాయకులు గొంతు చించుకుంటూనే ఉంటారు. కానీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఎంత సమర్థనీయం కాదనుకున్నా ఆమె చట్టవ్యతిరేకంగా ఆ పని చేయలేదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నియంతలా వ్యవహరించిన మాట కూడా నిజమే. కానీ తాను కొనసాగించిన నియంతృత్వాన్ని తానే రద్డుచేసిన చరిత్ర మరే నియంతకూలేని మాటా అంగీకరించవలసిందే. ఎమర్జెన్సీ విధించ కుండానే ఎమర్జెన్సీ కన్నా ఘోరమైన రీతిలో మోదీ పాలనఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను తన సొంత పార్టీ వారి మీదే ప్రయోగించేంతటి అమాయకత్వం మోదీకిలేదు. కాంగ్రెస్‌ముక్త్‌ భారత్‌ తన లక్ష్యమని ప్రకటించిన మోదీ ప్రస్తుతం ప్రతిపక్ష ముక్త్‌ భారత్‌కోసం సకల విధాలుగా ప్రయత్నాలూ చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ లేదా దాని మిత్రపక్షాల జోలికెళ్లవు. వాటి దృష్టి ఎప్పుడూ ప్రతిపక్ష నాయకుల మీదే ఉంటుంది. ప్రతిపక్ష నాయకులను వేధించడంలో మోదీ సమవర్తి (యమధర్మరాజు)లా ఉంటారు. జవసత్వాలు ఉడిగిన ప్రతిపక్ష నాయకులను కూడా మోదీ సహించరు. ప్రతిపక్ష ఐక్యత అన్నమాట ఏ పార్టీ నాయకుడి నోటివెంట వచ్చినా వారినీ మోదీ వదలరు. ప్రతిపక్షాలు అనుకునే పార్టీలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి లాంటివి పార్లమెంటులో ప్రజావ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా మోదీ సర్కారునే సమర్థించినా మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించకుండా ఉండరు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీ కాలాన్ని మోదీ సర్కారు నిష్కారణంగా పొడిగించలేదు. చెప్పినట్టల్లావినే ఉన్నతాధి కారులపై మోదీకి అభిమానం, ఆప్యాయత జాస్తి. తమ ఆధిపత్యానికి సవాలుగా మారతారు అనుకునే నాయకులు తమ పార్టీవారే అయి నప్పటికీ కాంగ్రెస్‌ దర్యాప్తు సంస్థలను ప్రయోగించేది. కొంతమంది నాయకులకు శిక్షలూ పడ్డాయి. అప్పుడు కొందరు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ దాడి ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అలాంటి వారి సంఖ్య అత్యల్పం. ఇప్పుడు మోదీ ఏ ప్రతిపక్ష పార్టీని వదిలిపెట్టడం లేదు.
మోదీ దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఒక్కోసారి గురి ఒకరి మీద అయితే దాడి వారి కుటుంబసభ్యుల మీదో, సన్నిహితులమీదో ఉంటుంది. ఒకవేళ ఏ నాయకుడి కుటుంబమైనా రాజకీయ ప్రాబల్యం ఉన్నదనుకుంటే వారిమీద మోదీ సర్కారు ప్రత్యేకంగా గురి పెడ్తుంది. అనారోగ్యంతో కునారిల్లిపోతున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అందుకే తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ భార్య గర్భవతి. ఆమె జ్వరంతో బాధపడ్తున్నా 15 గంటలపాటు దర్యాప్తు సంస్థలవారు ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల బారి నుంచి తప్పించుకున్న లాలూ కుటుంబ సభ్యులు ఎవరూ ఉన్నట్టులేరు. ఈ విషయంలో లాలూ గతంలోనూ దర్యాప్తు ఎదుర్కున్నారు. జైలుశిక్ష అనుభవించారు. జైలుశిక్ష అనుభవించిన ఆ స్థాయి నాయకుడు మరెవరూలేరు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడి నప్పుడు జనతాదళ్‌నాయకుడు దేవెగౌడ ప్రధానమంత్రి కావడంలో లాలూ పాత్ర కీలకమైంది. అప్పుడు జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూనే. కానీ దేవెగౌడ హయాంలోనే లాలూ మీద దాణా కుంభకోణ వ్యవహారంలో చార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆ తరవాత జైలుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రులుగా ఉన్న వారికి లాలూ మీద అభిమానం లేక కాదు. లాలూ కూడా తనవంతుగా దర్యాప్తు సంస్థలకు, కోర్టుల్లో విచారణకు సహకరించారు. కానీ అప్పటి ప్రధానమంత్రులు తమ పరిమితిదాటి తమ భాగస్వామ్య పక్షాల నాయకులను వెనకేసుకు రాలేదు. లాలూప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని పార్టీ మహాఘట్బంధన్‌ లో భాగస్వామిగా ఉన్నప్పుడల్లా ఆయనమీద దాడి ముమ్మరం అవుతోంది.
2017లో ఇలాగే లాలూ కుటుంబంమీద దాడి జరిగింది. కానీ నితీశ్‌కుమార్‌ లాలూ పార్టీ చేయివదిలి బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నప్పుడు లాలూ మీద దర్యాప్తుసంస్థల దాడులు జరగలేదు. ఇప్పుడు లాలూ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీతో కలిసి నితీశ్‌పార్టీ బిహార్‌లో అధికారంలో ఉంది కనక లాలూ కుటుంబం మీద దాడులు ముమ్మరమైనాయి. 2జి కుంభకోణంలో డి.ఎం.కె. నాయకుడు ఎ.రాజా లాంటి అధికార పక్షంలో భాగస్వాములైనా మంత్రి పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇప్పటికీ అప్పటికీ ఒక్కటే తేడా. అప్పుడు దర్యాప్తు సంస్థలు వాటిపనిఅవి చేసుకుపోయేవి. మోదీ హయాంలో ఎలా వ్యవహరించాలో, ఎవరి మీద ఎంత తీవ్రమైన కేసులు మోపాలో మోదీ సర్కారు నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేస్తుంది. అందుకే బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిమీద ఎన్ని ఆరోపణలు వచ్చినా దర్యాప్తు సంస్థలు మూడు కోతుల కథలోలాగా వినము, కనము, మాట్లాడము అన్న రీతిలో నడుచుకోక తప్పదు. ఈ మర్మం తెలిసిన అధికారులు బుద్ధిమంతుల్లా చెప్పిన పని చేసుకుపోతారు. ఏ ప్రతిపక్ష నాయకుల మీద దాడిజరిగినా ఆ పార్టీలన్నీ కేంద్రంపై విమర్శలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ లాలూ మీద దాడిని బిహార్‌ ప్రజలు అంత తేలికగా తీసుకుంటున్నట్టు లేరు. దిల్లీలో తేజస్వీ నివాసంపై దాడిజరిగిన సమయంలో గంగానది ఒడ్డున ఉన్న నక్తా దాయరా చుట్టుపక్కల గ్రామాలలో ఆర్‌.జె.డి. కార్యకర్తలు నిరసనకు దిగారు. లాలూను వేధిస్తే సహించబోం, అయింది చాలు అని హెచ్చరించారు. బిహార్‌ ప్రజలు తిరగబడితే పరిణామాలు ఎలా ఉంటాయో గ్రహించక పోతే నష్టం మోదీకే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img