Friday, April 26, 2024
Friday, April 26, 2024

కెనడా నుంచి ఖాలిస్థానీ సెగ

బాబ్రీ మసీదును పడగొట్టడం లాంటి దుర్ఘటనలు జరిగిన తరవాత ఆ గాయాలు అంత త్వరగా మానవు. ఈ విధ్వంసాన్ని వ్యతిరేకించే వారు ఇప్పటికీ బాబ్రీ మసీదును కూల్చిన రోజైన డెసెంబర్‌ ఆరున ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. నిజానికి ఇది శోకదినం పాటించడమే. మహాత్మా గాంధీ హత్యను మనం ప్రతి సంవత్సరం జనవరి 30న గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ప్రస్తుత రాజకీయ వాతావరణం గాంధీ హంతకులకు అనుకూలంగా ఉన్నందువల్ల హంతకుడైన గాడ్సేకు నివాళులు అర్పించేవారూ తయారయ్యారు. వీరి ఉన్మాదం గాడ్సేకు గుళ్లుకట్టే దాకా వెళ్లింది. సాక్షాత్తు పార్లమెంటు సభ్యురాలైన ఒక బీజేపీ నాయకురాలు జనవరి 30న మహాత్మా గాంధీ దిష్టి బొమ్మ ఏర్పాటుచేసి దాన్ని తుపాకితో కాల్చిన దృశ్యాలను ఎలా మరిచిపోగలం. దుర్ఘటనను గుర్తు చేసుకుని రెండు కన్నీటి బొట్లు రాల్చడం ఒక ఎత్తు అయితే ఆ దుర్ఘటనకు బాధ్యులైన వారిని సమర్థించేవారు సంబరాలు చేసుకోవడం మతోన్మాదానికి పరాకాష్ఠ. గత నాల్గవ తేదీన కెనడాలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. కెనడాలో సిక్కుల సంఖ్య ఎక్కువ. వారందరూ ఖాలిస్థానీయులేననడం కాదు గానీ స్వర్ణ దేవాలయంపై 1984లో సైనిక చర్యకు నిరసనగా ప్రతి ఏటా కెనడాలో ఒక ఉత్సవం లాంటిది నిర్వహిస్తారు.
ఈ సారి బ్రంప్టన్‌ నగరంలో అందులో ఇందిరా గాంధీని హత మార్చినందుకు సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఒక శకటాన్ని ఊరేగించారు. ఆ శకటంపై ప్రదర్శించిన ఓ పోస్టర్‌లో ఇది ‘‘ప్రతీకారం’’ అని కూడా రాశారు. ఎంచుకున్న సందర్భం అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం మీద సైనిక చర్యను నిరసించడమే. కానీ వారు తయారుచేసి ఊరేగించిన శకటం ఇందిరా గాంధీని హతమార్చగలిగినందుకు సంబరాలు చేసుకోవడానికి ఉద్దేశించింది. వారు ఖాలిస్థానీలు అంటున్నారు. కెనడాలో దాదాపు ఎనిమిది లక్షలమంది సిక్కులున్నారంటారు. పంజాబ్‌ వేర్పాటు వాద ఉద్యమ సందర్భంలో కెనడాలోని ఖాలిస్థానీ సానుభూతి పరులు సకల విధ సహాయమూ చేశారు. ఆయుధాలు కూడా సమ కూర్చారు. అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం మీద చర్య తీసుకున్నందుకే ఇందిరాగాంధీని 1984 అక్టోబర్‌ 31 హతమార్చి ప్రతీకారం తీర్చుకున్నా మనేది వారి వాదన. భారత సైన్యాధిపతి జనరల్‌ అరుణ్‌ వైద్యను కూడా హతమార్చారు. ఇదీ ప్రతీకారంలో భాగమే. ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పేర అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం మీద సైనికదాడి జరిగి 39 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ తీవ్రవాద, వేర్పాటువాద భావాలున్న సిక్కుల ఆగ్రహ జ్వాలలు చల్లారనేలేదు. అందుకే ప్రతి ఏటా ఇందిరా గాంధీ హత్యను సంబరంగా పరిగణిస్తున్నారు. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం మీద చర్య సరైందేనా కాదా అన్న చర్చ మొదటినుంచీ సాగుతూనే ఉంది. పంజాబ్‌లో తీవ్రవాదం పెచ్చరిల్లి పరిస్థితి చేయి దాటిపోతున్న దశలో సైనికచర్య అనివార్యం అని ఇందిరా గాంధీ భావించి ఉండొచ్చు. ఈ నిర్ణయం మంచి చెడ్డలను ఎంత కాలమైనా సాగదీయొచ్చు. కానీ ఒక హత్యను సంబరంగా మార్చడం తక్కువ దుర్మార్గం ఏమీ కాదు. కెనడాలో జరిగిన సంఘటన అక్కడున్న తీవ్రవాద సిక్కుల్లో గూడుకట్టుకున్న భారత వ్యతిరేకతకు సంకేతం. ఖాలీస్థానీల నిరసన ఏదో ఒక స్థాయిలో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌, యూరప్‌ లోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుగుతూనే ఉన్నాయి.
ఇందిరా గాంధీని హతమార్చినందుకు సంబరాలు చేసుకోవడం సహజంగానే మన దేశంలో అలజడికి దారి తీస్తుంది. అనేక రాజకీయ పార్టీలు, కెనడా క్షమాపణ చెప్పాలంటున్నాయి. ఇలాంటి ఉదంతాలు కొనసాగుతూనే ఉంటే కెనడాలో వేర్పాటువాద శక్తులు బలం పుంజు కుంటాయి. గతానుభవాన్నిబట్టి చూస్తే ఇది మనదేశంలో కూడా ఖాలిస్థానీ ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుంది. ఇటీవలే అమృత్‌ పాల్‌ సింగ్‌ సంధు అనే సిక్కు మతగురువు మళ్లీ ఖాలిస్థానీ నినాదాల సాయంతో నానా అల్లకల్లోలం సృష్టించాడు. ఆయనను పట్టుకోవడానికి నానా అగచాట్లూ పడవలసి వచ్చింది. ఆయనను పంజాబ్‌ వారసుల అధ్యక్షుడిగా కూడా నియమించారు. సార్వభౌమాధికారం గల సిక్కు రాజ్యం (ఖాలిస్థాన్‌) కావాలని ఆయన కోరారు. ఆయనకు పాక్‌ గూఢచార సంస్థ ఐ.ఎస్‌.ఐ. మద్దతు ఉందంటున్నారు. ఆయుధాలు పోగేయడంతో పాటు ఆనంద్‌ పూర్‌ ఖాల్సా ఫౌజ్‌ అని సాయుధ దళాన్ని కూడా ఏర్పాటు చేశారు. అచ్చు మరో బింద్రన్‌ వాలేలా వ్యవహరించారు. అమృత్‌ పాల్‌ సింగ్‌ అనుచరులు రెండు గురుద్వారాల మీద దాడి చేశారు. ఆయన అనుచరుడిని పోలీసులు అరెస్టుచేస్తే పోలీస్‌ స్టేషన్‌ మీద అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. అమృత్‌పాల్‌ మోగాలోని ఓ గురుద్వారాలో తలదాచుకున్నాడు. చివరకు పోలీసులు చుట్టుముడితే గత ఏప్రిల్‌ 23న లొంగి పోయాడు. ఇలాంటి వ్యక్తులు, సంస్థలు మళ్లీ ఖాలిస్థానీ ఉద్యమాన్ని రగుల్కొల్పడానికి ప్రయత్నించడం కొనసాగుతూనే ఉంది. కెనడాలో జరిగిన సంఘటనలు ఇలాంటి వారికి ప్రేరణ కలిగిస్తాయి. అదీ కాక రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోతాయి. కెనడాలో జరిగిన సంఘటన లాంటివి మనకే కాదు కెనడాకు కూడా తలనొప్పిగా పరిణమిస్తాయి.
విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ బ్రంప్టన్‌ సంఘటనపై కెనడా ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. అయితే ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే కెనడా ప్రభుత్వం ఖాలిస్థానీలను వెనకేసుకొస్తోందని శివశంకర్‌ వ్యాఖ్యానించడం హ్రస్వదృష్టే కాక అవాస్తవం కూడా. అయితే కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఉన్న సిక్కులు భారత్‌కు వ్యతిరేకంగా ఆగడాలకు పాల్పడితే ఎన్నడూ కఠినమైన చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఏ ప్రయోజనం కోసమైనా తీవ్రవాదులను వెనకేసుకొస్తే వారికే అంతిమంగా ప్రమాదం. భారత్‌కు తీరని నష్టం ఎటూ తప్పదు. 1985లో ఈ తీవ్రవాదులు ఏర్‌ఇండియా విమానాన్ని కూల్చేశారు. భారత-కెనడా దేశాల మధ్య ఇటీవలి కాలంలో సఖ్యత అంతంత మాత్రమే. 2020లో మన దేశంలో దిల్లీ పొలిమేరల్లో రైతులు సుదీర్ఘ కాలం ఉద్యమించినప్పుడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల కెనడాతో మనకు కొన్ని నెలలపాటు లాంఛన ప్రాయమైన సంబంధాలు కూడా లేకుండా పోయాయి. ప్రస్తుత వివాదం సామరస్యంగా పరిష్కారం కాకపోతే పరిస్థితి మరింత క్షీణించ వచ్చు. ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుంది.
భావ ప్రకటనా స్వేచ్ఛను కెనడా ఎంత గౌరవించినా ఇందిరా గాంధీని హతమార్చినందుకు సంబరాలు చేసుకునే వారిని చూసీ చూడనట్టు వదిలేయడం రెండు దేశాల దౌత్య సంబంధాలకు విఘాతం కల్గిస్తుంది. మోదీ ప్రభుత్వం దౌత్య మార్గాలలో ఈ బెడద లేకుండా చేయడానికి ఉపకరించే వ్యూహ రచన చేయాలి. జి-20 సమావేశానికి హాజరు కావడానికి వచ్చే సెప్టెంబర్‌లో అనేక దేశాల నాయకులు దిల్లీ రావాల్సి ఉంది. అప్పుడు వీరందరితో ఈ ఉదంతాన్ని ప్రస్తావించి పునరావృతం కాకుండా ఉండే మార్గం ఏమిటో ఆలోచించాలి. కెనడాలో ఖాలిస్థానీ ఛాయలు ఇప్పటికీ బలంగా ఉండడం ఓ హెచ్చరిక.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img