Friday, April 26, 2024
Friday, April 26, 2024

చక్రవ్యూహంలో యోగీ ఆదిత్యనాథ్‌

కాళ్ల కింది నేల క్రమంగా జారిపోతున్నప్పుడు ఏ చిన్న ఆధారం దొరికినా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయడం సహజం. ఉత్తరప్రదేశ్‌లో రెండు దశల పోలింగ్‌ సరళి అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారుకు ఆశాజనకంగా ఉన్నట్టు లేదు. అందుకే ఆయన మాత్రమే కాకుండా ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వారికి బాగా అలవాటైన మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి సకల విధ ప్రయత్నాలూ చేస్తున్నారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడంలో అగ్రేసరులు అనిపించుకుంటున్న ఈ ముగ్గురు నేతలూ నానా యాతన పడ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మొదట విడత పోలింగ్‌ ప్రచారం ముగిసే సమయంలో యోగీ ఆదిత్యనాథ్‌ మళ్లీ బీజేపీకి అధికారం ఇవ్వకపోతే ఆ రాష్ట్రం కూడా కేరళ, బెంగాల్‌, కశ్మీర్‌లా తయారవుతుందని హెచ్చరించారు. ఈ హెచ్చరికకు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పవచ్చు. కానీ యోగీ ఆదిత్యనాథ్‌ ఉద్దేశం మాత్రం ఉత్తర ప్రదేశ్‌ కూడా ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే రాష్ట్రంగా తయారవుతుందనే. ఈ మూడు రాష్ట్రాలలోనూ ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ బెదిరింపులకు దిగారు. ఉత్తరప్రదేశ్‌కు పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో సోమవారం పోలింగ్‌ పూర్తి అయింది. అక్కడ ఆఖరి విడత ప్రచారంలో యోగీ ఆదిత్య నాథ్‌ పాల్గొన్నారు. ఆయనకంటే రెండాకులు ఎక్కువ చదివానని నిరూపించుకోవడానికా అన్నట్టు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి వివాహ చట్టం అమలు చేస్తామని మతవిద్వేష అమ్ముల పొదిలోంచి మరో బాణం వదిలారు. కాంగ్రెస్‌ కనక అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్‌లో ముస్లిం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందన్న దుష్ప్రచారాన్ని మరో మారు తెరమీదకు తెచ్చారు. ప్రధానమంత్రి మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో ముస్లిం విశ్వవిద్యాలయం ప్రస్తావన తేవడం మరిచిపోలేదు. ‘‘హిందువు అంటే నిర్వచనం ఏమిటో తెలియని పార్టీకి అధికారంలో ఉండే హక్కే లేదు’’ అని యోగీ ఆదిత్యనాథ్‌ హుంకరించారు. హరిద్వార్‌లో ఇటీవల జరిగిన ధర్మ సన్సద్‌లో ముస్లింలను ఊచకోత కోయాలని సంఫ్‌ు పరివార్‌ మైలారభటులు ఆడిన వీరంగం వల్ల పుట్టించిన వేడి ఉద్దేశం కూడా అయిదురాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అని విస్మరించలేం. ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్‌ పాల్గొన్నది ఒక్క రోజే అయినా హిందుత్వ కుంపటి రాజుకుంటూ ఉండడానికి చేయాల్సిదంతా చేశారు. తన మూలాలు ఉత్తఖండ్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు.
ఉత్తరాఖండ్‌లో ప్రచారం ఆఖరి రోజైన గత శనివారం ఆదిత్య నాథ్‌, నరేంద్ర మోదీ, అమిత్‌ షా సుడిగాలి పర్యటనలు జరిపారు. అందరిదీ ఒకే పాట. అందరు ఎత్తుకున్నదీ హిందుత్వ రాగమే. పర్వత ప్రాంతాలైన తెహ్రీ, కోట్ద్వార్‌ సభల్లో ప్రసంగించిన ఆదిత్యనాథ్‌ ఉత్తరాఖండ్‌లో బీజేపీకి అధికారం ఇవ్వకపోతే తాను ఉత్తరప్రదేశ్‌ నుంచి తరిమేస్తున్న నేరస్థులు ఉత్తరాఖండ్‌లో తిష్ఠ వేస్తారని కూడా హెచ్చరించారు. అయితే తాను నేరస్థులకు పలాయనం చిత్తగించే అవకాశం ఇవ్వబోనని, తప్పించుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్లు ఉత్తరాఖండ్‌ చేరుకుంటారన్నారు. ఉత్తరాఖండ్‌ ఉత్తరప్రదేశ్‌కు పొరుగురాష్ట్రమే కాక సరిహద్దురాష్ట్రం కూడా అయినందు వల్ల బీజేపీకి అధికారం దక్కకపోవడం దేశ భద్రతకు ఎంత ముప్పో కూడా విప్పి చెప్పారు. పనిలో పనిగా కాంగ్రెస్‌ మీద విమర్శలు గుప్పిస్తూ అది నాయకుడు లేని పార్టీ అని దెప్పి పొడిచారు. ఎన్నికలు జరిగిన చోటల్లా కాంగ్రెస్‌ ప్రతి ఏడాది అధికారం కోల్పోతుందని ఆదిత్య నాథ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఏమైనా మిగిలి ఉంటే రాహుల్‌, ప్రియాంక మధ్య వైరంతో పూర్తిగా అడుగంటుందని కూడా శపించారు. ముతకగా మాట్లాడడంలో తనకు తానే సాటి అయిన అమిత్‌ షా అయితే ప్రతిపక్షాలు రొహింగ్యాలను ఉత్తరాఖండ్‌లో స్థిరపడేట్టు చేస్తున్నారనీ, ప్రధానమంత్రి చార్‌ధాంను అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు రొహింగ్యాలకు రేషన్‌ కార్డులు, గుర్తింపు కార్డులు ఇప్పించడానికి తంటాలు పడుతుంటారని అన్నారు. ఈ ఎన్నికలు 80 శాతం మందికి 20 శాతం మందికి మధ్యన జరుగుతున్నవని ఆదిత్యనాథ్‌ చెప్పడంలో ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆ ఇరవై శాతం మంది ఆయన దృష్టిలో ముస్లింలు. ముస్లింల మీద దాడి చేయడం తప్ప బీజేపీకి, ముఖ్యంగా ఆదిత్యనాథ్‌కు మరే అంశమూ కనిపించడం లేదు. ఓటమి భయం బీజేపీలో ముస్లింల మీద ఉన్న ఉక్రోషం కట్టలు తెగేలా చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేసే వారందరూ జిన్నా మద్దతుదార్లేనని ఆదిత్యనాథ్‌ పదేపదే చెప్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ ఎంత బింకంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఆయనను ఓటమి భయం పీడిరచడానికి అయిదేళ్ల పాటు ఆయన నిష్క్రియాపరత్వం ఒక్కటే కారణం కాదు. సుప్రీంకోర్టుకూడా ఇటీవల ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. 2019లో పౌరసత్వ సవరణచట్టానికి వ్యతిరేకంగా నిరసనగా ప్రదర్శనలు జరిగినప్పుడు కలిగిన ఆస్తి నష్టానికి కారకులైన వారి ఆస్తులు జప్తు చేసే పని ఆదిత్యనాథ్‌ ప్రారంభించారు. ఇప్పటి వరకు యోగీ ప్రభుత్వం 274 మందికి నోటీసులు జారీచేసింది. 236మందినుంచి వారి ఆస్తులు జప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని ఈ ఆదేశాలువచ్చే 18వతేదీలోగా ఉపసంహరించు కోవాలని లేకపోతే తామే ఆ పనిచేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డి.వై. చంద్రచూడ్‌, సూర్యకాంత్‌తో కూడిన బెంచి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎన్నికలు జరుగుతుండగా వెలువడడం యోగీకి సంకట స్థితే. ఉత్తరప్రదేశ్‌లో ఏడవది, చివరిదైన పోలింగ్‌ మార్చి ఏడున జరగవలసి ఉండడంతో ఆదిత్యనాథ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తానే ఫిర్యాదు చేసి, తానే తీర్పూ చెప్తోంది. తానే శిక్షలు విధిస్తోంది. ఇది చట్ట రీత్యా కుదరదని ఇద్దరు న్యాయమూర్తుల బెంచి వ్యాఖ్యానించడం చిన్నవిషయం కాదు. మరో మూడు రోజుల్లోగా పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసన తెలియజేసిన వారి ఆస్తులు జప్తుచేయడం ఆపకపోతే యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు పరిస్థితి దుర్భరంగా తయారవుతుంది. పైగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో యు.పి. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు పాటించడం మినహా మరేమార్గమూ కనిపించడం లేదు. ఒక వేపు అయిదేళ్ల కాలంలో సాధించిన మహత్కార్యం ఏమీ లేకపోవడం, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాకుండా రైతు ఉద్యమ ప్రభావం సర్వత్రా కనిపించడం యోగీ సర్కారుకు ప్రతికూలం గానే ఉంటుందన్న అభిప్రాయం బీజేపీని దిక్కు తోచని స్థితిలోకి నెట్టేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img