Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తీవ్రం కానున్న విద్యుత్‌ సంక్షోభం

మన దేశంలో, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలలో విద్యుత్‌ కొరత తీవ్రతరమయ్యే సూచనలున్నాయి. ప్రస్తుతానికి బొగ్గు ఉత్పత్తి, నిల్వలు తగ్గిపోవడం వల్ల దేశంలో విద్యుత్‌ కోతలు వేసవి కాలం రాకముందే చోటు చేసుకున్నాయి. 135 ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలుండగా 115 కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడిరది. అందువల్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గి విద్యుత్‌ కోతలు కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. బొగ్గు నిల్వలు రెండు రోజుల క్రితం వరకు 7.2 మిలియన్ల టన్నులున్నట్లు అంచనా. ఇదే సమయంలో బొగ్గు దిగుమతులు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అలాగే బొగ్గు టన్ను ధర 40`60 శాతం దాకా పెరిగింది. విద్యుత్‌ కొరత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలకు ఆటంకంగా మారే అవకాశం ఉంది. అన్ని జీవన రంగాలపై విద్యుత్‌ కొరత ప్రభావం ఉంటుంది. గృహ వినియోగమూ పెరిగింది. ఇందుకు ఏసీలు, వాషింగ్‌ మిషన్లు తదితర అవసరాలు కారణమవు తున్నాయి. బొగ్గు నిల్వలు పెరిగి విద్యుత్‌ కొరతను అధికమిస్తామని కేంద్రంలోని బీజేపీ పాలకులు అనేక అంశాలలో హామీ ఇచ్చినట్లుగా బొగ్గు విషయంలో హామీ ఇస్తున్నారు. ఒకానొక నాడు కిరోసిన్‌ దీపాలు, లాంతర్ల వెలుగుతో సాగిన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కావడానికి, పట్టణాలు, నగరాలలో పూర్తిగా విస్తరించడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. అనంతరం బొగ్గు గనుల సంఖ్య పెరిగి, ఉత్పత్తి పెరిగింది. అలాగే జల విద్యుత్‌ కేంద్రాలూ పెరిగాయి. బొగ్గు గనుల నుండి వెలువడే విపరీతమైన కాలుష్యం అపారంగా పెరిగింది. ఫలితంగా భూ మండలం వేడెక్కుతూ, జీవావరణమంతా తిరిగి కోలుకోలేనంతగా కలుషితమైంది.బొగ్గు కాలుష్యం తగ్గిస్తామని, గనులను మూసివేస్తామని అమెరికా తదితర ధనిక దేశాలు అంతర్జాతీయ వాతావరణ సదస్సుల్లో హామీ ఇచ్చాయి. క్యోటో ఒప్పందం నాటి నుండి 2015 లో కుదిరిన పారిస్‌ ఒప్పందం దాకా ఆయా దేశాలు ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి కాలుష్యం తగ్గిస్తామని హామీ ఇచ్చాయి. ఒప్పందం చేసుకున్న నిర్ణయాల మేరకు కాలుష్యం తగ్గింపు లక్ష్యాలనూ ప్రకటించాయి. 1972 లో ధరిత్రి పరిరక్షణ సదస్సు నుండి ఇంతవరకు 24 సదస్సులు ఐరాస అధ్వర్యంలో జరిగి తీసుకున్న నిర్ణయాలు అరకొరగా అమలయ్యాయి. జీవావరణ కాలుష్యం, మానవాళి అనారోగ్యాలు పెరిగాయే కానీ వీటి నివారణ, నియంత్రణ చర్యలు అయా దేశాలు నామ మాత్రంగా తీసుకుంటున్నాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసక విధానాలు, చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కాలుష్యం తగ్గించి, భూ మండలం ఉష్ణోగ్రతలను 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు మించకుండా నియంత్రించాలని తీసుకున్న నిర్ణయాలలో భాగంగానే చైనాతో సహా కొన్ని దేశాల్లో చాలా బొగ్గు గనులను మూసివేశాయి.ఫలితంగా పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా తగ్గిపోయి అవీ కుంటుపడుతున్నాయి.
బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు బదులుగా సౌర విద్యుత్‌, వాయు విద్యుత్‌ ఉత్పత్తి లాంటి వాటిని పెంచి క్రమంగా బొగ్గు గనులను పూర్తిగా మూసివేయవలసి ఉంటుంది. ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకేగాక రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడి జల విద్యుత్‌ కేంద్రాలను సైతం నిలిపివేయవలసిన పరిస్థితి తలెత్తుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యంగా అన్ని దేశాల్లోనూ ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి పెంపుదలకు ప్రణాళికలు వేశారు గానీ అమలే కొరవడిరది. కాలుష్యానికి అన్ని జీవన రంగాలకు విడదీయలేని బంధం ఉంది. ఇటీవల నోబెల్‌ బహుమతి పొందిన ముగ్గురు వాతావరణ శాస్త్రజ్ఞులు, రెండు మూడు నెలల క్రితం ఐరాస వాతావరణ విభాగం శాస్త్రవేత్తలూ కాలుష్యం తగ్గకపోతే ప్రకృతి మహా విపత్తు తప్పదని, ఇందుకు ఎక్కువ సమయం లుదని హెచ్చరించాయి. ఈ పరిణామాలను గమనించిన మానవాళి అనివార్యంగా తమ జీవన విధానాన్ని మార్చుకోవలసి ఉంది. ఇందులో భాగంగా కాలుష్యభరిత బొగ్గు గనులను అనివార్యంగా మూసివేయవలసి వస్తుంది. ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తి పెంచడానికి మనతో సహా ఆయా దేశాల పాలకుల చర్యలను వేగవంతం చేయాలి. ముఖ్యంగా మనకు సూర్యుడి వెలుగులు ఎక్కువగా లభిస్తాయి. అందువల్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచించి వేగంగా అమలు చేయాలి. వీటికి అత్యధిక ప్రాధాన్యత నివ్వాలి. ప్రకృతి విపత్తులు పెరుగుతున్న తరుణంలోనూ మోదీ ప్రభుత్వం 14 కొత్త బొగ్గు గనుల తవ్వకం వేలం వేసి ఖరారు చేయడం దేనికి సంకేతం. సౌర విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం రచించిన ప్రణాళికల అమలు ముందుకు కదలడం లేదు.
ఈ నెల 30 నుంచి బ్రిటన్‌ గ్లాస్కో నగరంలో జరగనున్న 25 వాతావరణ అంతర్జాతీయ సదస్సు కూడా కాలుష్యం తగ్గింపు, భూ మండలం వేడిని 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు కట్టడి చేయడం, అందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అసలు కాలుష్యం ఎక్కడుందని ప్రశ్నించే నేతలు వాతావరణంలో వచ్చిన మార్పులను గుర్తించ నిరాకరిస్తున్న కబోదులే. తాత్కాలికంగా ఏర్పడిన, లేదా ముందు ముందు పెరగనున్న విద్యుత్‌ కొరతను పరిష్కరించుకోవడానికి కొంత కాలం పట్టవచ్చు. వాతావరణ సదస్సులు చేసిన అంతర్జాతీయ ఒడంబడికలు అమలు చేయడం తప్పదు. నేటి తీవ్ర పరిస్థితి పట్ల ఆందోళన ఉంటుంది. అయితే శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు, ప్రజలు చర్యలు చేపట్టాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో అత్యధికంగా సౌర విద్యుత్‌ పలకాలను అమర్చుకొని విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించాలి. గృహాలకే కాదు, వివిధ రంగాల పరిశ్రమలు సౌర విద్యుత్‌ సౌకర్యాలను అమర్చుకోవడం ద్వారా విద్యుత్‌ కొరతను అధిగమించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img