Friday, April 26, 2024
Friday, April 26, 2024

టాటాలకు ఏర్‌ ఇండియా

అనేక సంవత్సరాలుగా రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం కలగజేస్తున్న ఏర్‌ ఇండియా విమానయాన సంస్థను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. టాటా సన్స్‌ కు చెందిన టెలేస్‌ అనే సంస్థ ఏర్‌ ఇండియాను కొనడానికి అంగీకరించింది. 1953ల నుంచి అయిదు దశాబ్దాలపాటు 2003 దాకా లాభలార్జించిన ఏర్‌ ఇండియాకు ఇప్పుడు నష్టాలు తప్ప లాభాల ఊసే లేదు. ఇప్పటి వరకు రూ. 84, 000 కోట్ల నష్టాలు, రూ. 61, 560 కోట్ల రుణాలు మిగిల్చిన ఈ సంస్థను కొనడానికి టాటాలు ముందుకొచ్చారు. నష్టాల ఊబిలోకి లాగుతున్న ఏర్‌ ఇండియా బాధ్యతను టాటాలకు అప్పగించినందుకు ప్రభుత్వం సంతోషంగా ఉండవచ్చు. పెట్టుబడుల ఉపసం హరణ అన్న తమ క్రతువులో ఓ ఘట్టం పూర్తయిందని సంతృప్తి పడవచ్చు. ఏర్‌ ఇండియాను టాటాలు కొనేశారు అనగానే ‘‘ఘర్‌ వాపసి’’, ‘‘ఏర్‌ లూంస్‌’’ ‘‘టాటా అంటే అన్ని వేళల్లో వీడ్కోలు చెప్పడం కాదు’’ అన్న హాస్యస్పోరక వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వినిపించాయి. సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ రంగాన్ని కునారిల్లజేయడమే సంస్కరణలుగా చెలామణి అవుతోంది. కానీ పెట్టుబడుల ఉపసం హరణ ప్రయత్నాలు మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసినా ఒకటి రెండేళ్లు మినహా ఎప్పుడూ లక్ష్యాలను సాధించలేదు. పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం గత ఏడేళ్లుగా ఉదాహరణ ప్రాయంగా రెండే రెండేళ్లు – 2017-18, 2018-19 లో మాత్రమే లక్ష్యం సాధించగలిగారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,75,000 కోట్ల మేర పెట్టుబడులు ఉపసం హరించాలనుకుంటే ఏర్‌ ఇండియా అమ్మకాలను మినహాయిస్తే ఇప్పటి వరకు రూ. 9,111 కోట్లు మాత్రమే ఉపసం హరించగలిగారు. ఏర్‌ ఇండియా నుంచి 40 శాతం పెట్టుబడులని ఉపసం హరించాలని వాజపేయి ఏలుబడిలో 2001లో ప్రయత్నించారు. కానీ సఫలం కాలేదు. ప్రతి ఏటా నష్టాలు పెరుగుతున్నందువల్ల ఏదో ఒక రోజు ఏర్‌ ఇండియాను తెగనమ్మక తప్పదన్న వాస్తవం ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత 2018లో 76 శాతం పెట్టుబడులను ఉపసంహరించాలనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. 2020లో తాజా ప్రయత్నాలు మొదలయ్యాయి. అమ్మకం ప్రయత్నాలకు రెండు ప్రధాన అవాంతరాలెదురైనాయి. ప్రభుత్వానికి ఎంతో కొంత వాటా ఉండడం ఏ ప్రైవేటు రంగ సంస్థకూ నచ్చలేదు. రోజువారీ భారీ నష్టాలతో పాటు ఇంతకు ముందే పేరుకుపోయి ఉన్న నష్టాల మొత్తం, రుణ భారం ఏర్‌ ఇండియాను కొనాలనుకున్న వారెవరికీ రుచించలేదు. ఇప్పుడున్న మొత్తం రూ. 61, 562 కోట్ల అప్పుల్లో టాటా సంస్థ కేవలం రూ. 15,300 కోట్లను మాత్రమే భరిస్తుంది. అంటే మిగతా మొత్తం నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే రూ. 43, 562 కోట్ల అప్పు తీర్చాల్సింది ఈ దేశ ప్రజలే. తెగనమ్మినా బాధ వెంటాడుతూనే ఉంటుందన్న మాట.
నష్టాలలో మునిగిపోయిన ఏర్‌ ఇండియాను టాటాలు ఎందుకు కొన్నట్టు అన్న ప్రశ్నకు సమాధానం ఉంది. అసలు ఏర్‌ ఇండియా టాటాల సంస్థే. 1932లో జహంగీర్‌ రతన్జీ దాదాభాయ్‌ టాటా (జె.ఆర్‌.డి.టాటా) ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. తమ బిడ్డ 68 ఏళ్ల తరవాత తమ ఇంటికి వచ్చిందన్న తృప్తి టాటా సంస్థ యజమానులకు మిగలవచ్చు. జె.ఆర్‌.డి. టాటా మన దేశంలోనే మొట్ట మొదట కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్సు పొందిన వ్యక్తి. విమానాలు నడపడమన్నా, విమానాయాన సంస్థలు నిర్వహించడమన్నా ఆయనకు చాలా ఇష్టం. స్వాతంత్య్రం తరవాత ఆయన ఏర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పేరుతో అంతర్జాతీయ విమానయాన సర్వీసు ప్రారంభించాలనుకున్నారు. అదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో. అందులో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండేది. తూర్పు-పశ్చిమ దేశాలను కలిపిన మొదటి విమానయాన స్వదేశీ సర్వీసు అదే. 1953లో నెహ్రూ హయాంలో ప్రైవేటు రంగంలోని విమాన సర్వీసులన్నింటినీ కలిపి అంతర్జాతీయ ప్రయాణాలకు ఏర్‌ ఇండియా, దేశంలో విమాన ప్రయాణాలకు ఇండియన్‌ ఏర్‌ లైన్స్‌ అన్న రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ విమానయానంలో జె.ఆర్‌.డి. టాటా సేవలను గుర్తించి ఆయననే ఏర్‌ ఇండియా చేర్మన్‌ గానూ, ఇండియన్‌ ఏర్‌ లైన్స్‌ డైరెక్టర్‌ గానూ నియమించారు. ప్రభుత్వ రంగంలోకి వచ్చిన తరవాత ఏర్‌ ఇండియా ప్రపంచ విఖ్యాత విమాన సర్వీసుగా చాలా కాలం కొనసాగింది. 1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం జె.ఆర్‌.డి. టాటాకు నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని లాగేసి ఏర్‌ ఇండియా, ఇండియన్‌ ఏర్‌ లైన్స్‌ లో ఆయనకు ఏ స్థానమూ లేకుండా చేసింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో టాటా నడిపే విమానయాన సంస్థ దేశ కిరీటంలో కలికి తురాయి అన్న అభిప్రాయం ఉండేది. అప్పుడు పాన్‌ అమెరికన్‌, ట్రాన్స్‌ వరల్డ్‌ ఏర్‌ లైన్స్‌, కె.ఎల్‌.ఎం., ఏర్‌ ఫ్రాన్స్‌ మొదలైన సంస్థలు మన దేశానికి విమానాలు నడపడం మొదలైంది. రష్యాకు మొదటి రాయబారిగా నియమితురాలైన విజయలక్ష్మీ పండిత్‌ను మాస్కో కు తీసుకెళ్లింది మాత్రం స్వదేశీ ఏర్‌ ఇండియా విమానంలోనే. 2007లో ఏర్‌ ఇండియా, ఇండియన్‌ ఏర్‌ లైన్స్‌ సంస్థలను విలీనం చేశారు. అప్పటి నుంచి ఈ సంస్థ లాభాలార్జించిన ఉదంతమే లేదు. ఇప్పుడు టాటాలకు అంటగట్టామన్న సంతోషం ప్రభుత్వానికి ఉండొచ్చు కానీ ఏర్‌ ఇండియాను నష్టాల ఊబి నుంచి పైకి లాగి లాభాల బాట పట్టించడం టాటాలకు పెద్ద సవాలే. ఏర్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఏర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ కలిసి విదేశాల్లో 55 చోట్లకు విమానాలు నడుపుతున్నాయి. 3000 చోట్ల ఈ సంస్థ విమానాలు దిగడానికి అనుమతులున్నాయి. కాంట్రాక్ట్‌ సిబ్బందితో కలిపి మొత్తం 13, 000 మంది ఆ సంస్థలో పని చేస్తున్నారు. నష్టాలు తగ్గించుకోవడానికి ఏ ప్రైవేటు యాజమాన్యమైనా మొదటి వేటు సిబ్బంది మీదే వేస్తుంది. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఏడాది పాటు సిబ్బంది ఉపాధికి భంగం కలగదు. ఆ తరవాత స్వచ్ఛంద పదవీ విరమణ లాంటివి తప్పక పోవచ్చు. నష్టాల నుంచి బయటపడి నిర్వహించ గలుగుతారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే 83 ఏళ్ల రతన్‌ టాటా సాహసికుడు. భారీ సంస్థలను లాభనష్టాల గురించి ఆలోచించకుండా కొనగలిగే ధైర్యం ఉన్న వారు. కోరస్‌ స్టీల్‌, జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ ను ఆయన ఇలాగే కొన్నారు. ప్రభుత్వానికి బాధా విముక్తి కలిగింది. భవిష్యత్తులో టాటాలకు లాభాలపై అనుమానాలు ఎట్లా ఉన్నా ‘‘విశ్వ గురువు’’ భారత్‌ కు సొంత విమానాయాన సంస్థ ఇక లేనే లేదనేది పచ్చి నిజం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img