Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధిక్కారం సైతుమా

రాజ్యాధికారం చేతిలో ఉన్న నియంతలు సర్వాధికారాలూ తమవేననుకుంటారు. మన రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన అధికార విభజన ఉంది. అయినా నియంతృత్వాన్ని చెలాయించే పాలకులు ఉన్నప్పుడు పార్లమెంటు, న్యాయవ్యవస్థ సైతం తాము చెప్పినట్టే నడుచుకోవాలనుకుంటారు. దిల్లీ ఈశాన్య ప్రాంతంలో 2020 ఫిబ్రవరిలో మత కలహాలు చెలరేగాయి. అప్పుడు 53 మంది మరణించారు. దాదాపు 700 మంది గాయపడ్డారు. ఈ కలహాలకు సంబంధించి పోలీసులు తమదైన రీతిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మత కలహాలకు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో లంకె పెట్టారు. ఈ కేసులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధీనంలో పని చేసే పోలీసులు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలు, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న వారు, అభ్యుదయ భావాలున్న రాజకీయ పార్టీల నాయకులు, ముస్లింలు ఎక్కువగా ఉండే జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ముస్లిం మహిళా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేసిన ఒక సిక్కు మతస్థుడు – ఇలా ఎవరిని పడితే వాళ్లను దిల్లీ మతకలహాలలో నిందితులను చేశారు. వీరందరి మీద దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) లాంటి కిరాతక చట్టాల కింద కేసులు మోపారు. ఈ కేసులు క్రమంగా విచారణకు వస్తున్నాయి. కానీ పోలీసుల ఆరోపణలు న్యాయస్థానాల్లో దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి. అడ్డదిడ్డంగా పోలీసులు కేసులు మోపి నిందితుల జాబితాలో చేర్చిన వారికి న్యాయస్థానాలు జామీను మంజూరు చేస్తున్నాయి. ఇది సహజంగానే ఏలినవారు ధిక్కార స్వరంగా వినిపిస్తోంది. అందుకే ఈ కేసులను విచారిస్తున్న క్రమంలో బూటకపు కేసులు మోపిన, అసమర్థంగా వ్యవహరిస్తున్న పోలీసులను న్యాయస్థానాలు మందలిస్తున్నాయి, ఆక్షేపిస్తున్నాయి. ప్రాసిక్యూషన్‌ తరఫున సాక్ష్యం చెప్తున్న పోలీసులు ప్రమాణం చేసిన తరవాత కూడా అసత్యం చెప్పడాన్ని న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నాయి. అదనపు సెషన్స్‌ జడ్జీలు ధర్మేంద్ర రాణా, వినోద్‌ యాదవ్‌ విచారణ క్రమంలో పోలీసులనే బోనెక్కిస్తున్నారు. అంటే పరోక్షంగా ఈ న్యాయమూర్తులు ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి అడ్డుకట్ట వేయడానికి సాహసిస్తున్నారు. అలాంటి సాహసాన్ని మోదీ ప్రభుత్వం సహించలేదు. ఈ వైనం తెలుసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా తమ చేతిలో పనిగనక అదనపు సెషన్స్‌ జడ్జీల లాంటి వారి మీద బదిలీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. దిల్లీలో అదనపు సెషన్స్‌ జడ్జీగా పని చేస్తున్న వినోద్‌ యాదవ్‌ తాజాగా ఈ బదిలీ వేటుకు గురయ్యారు. దీని వెనక ఎవరి హస్తం ఉండి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. లేదా తిరగేసి ఆలోచిస్తే ఈ జడ్జీలను బదిలీ చేసే అధికారం ఉన్న ఉన్నత న్యాయస్థానాలలో అధిష్టించిన న్యాయమూర్తులు ఎవరి పనుపున ఈ బదిలీలు చేస్తున్నారో సులభంగానే అర్థం అవుతుంది. వినోద్‌ యాదవ్‌ దిల్లి మతకలహాలకు సంబంధించిన కేసులను విచారించే క్రమంలో కనీసం డజను సార్లు పోలీసుల నడవడికను తప్పుపట్టారు. వారి దర్యాప్తులు ఎంత లోపభూయిష్టంగా ఉంటున్నాయో బహిర్గతం చేశారు. నిన్ననే అదనపు సెషన్స్‌ జడ్జి వినోద్‌ యాదవ్‌ అంతా నిజమే చెప్తాము అని ప్రమాణం చేసి అబద్ధ సాక్ష్యం పలికిన పోలీసులను తీవ్రంగా తప్పు పట్టారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ మత కలహాల సరళిని గమనిస్తే పోలీసులు మోపిన కేసులు న్యాయస్థానానికి వచ్చేటప్పటికి ఎందుకు వీగిపోతున్నాయో అర్థం అవుతుంది. దిల్లీ మత కలహాలలో హిందువులు, ముస్లింలు కూడా బాధితులుగా మిగిలారు. కానీ పోలీసులు మాత్రం కేవలం ముస్లింలే మతకలహాలకు పాల్పడినట్టు చిత్రిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ముస్లింలే దిల్లీ మతకలహాలు కూడా రెచ్చగొట్టారని నిరూపించడానికే పోలీసులు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంవల్ల ఎక్కువగా నష్టపోయేది ముస్లింలేనన్నది బహిరంగ రహస్యమే. అందుకే ఈ చట్టానికి నిరసన తెలియజేసిన వారిలో ముస్లింలే ప్రధానంగా కనిపించి ఉండవచ్చు. అందులో మహిళల సంఖ్య కూడా ఎక్కువే. అందుకనే పోలీసులు మహిళలను, భిన్న సందర్భాలలో మోదీ ప్రభుత్వం మీద అసమ్మతో, నిరసనో వ్యక్తం చేసిన వారిని దిల్లీ మతకలహాలలో నిందితుల్ని చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది 2019 డిసెంబర్‌లో. దిల్లీ అల్లర్లు ఫిబ్రవరిలో జరిగాయి. ఇంకేముంది నిరసన వ్యక్తం చేసే వారే మతకలహాలకు బాధ్యులు అని ఏలిన వారి మనసులో మాట గ్రహించిన దిల్లీ పోలీసులు ఈ కలహాలతో ఏ మాత్రం సంబంధం లేని వారి మీద కేసులు మోపారు. హర్ష్‌ మందర్‌ లాంటి వారు కలహాలు జరగడానికి రెండున్నర నెలల ముందు ప్రసంగిస్తూ విద్వేషం రెచ్చగొట్టారని అభియోగం మోపారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉమర్‌ ఖాలిద్‌ను కూడా ఎందుకైనా మంచిదని దిల్లీ మతకలహాలలో భాగస్వామిని చేశారు.
ఈ నేపథ్యంలోనే కేసులు విచారణకు వచ్చాయి. దిల్లీ మతకలహాల కేసులను విచారిస్తున్న అదనపు సెషన్స్‌ జడ్జీ ఒక్కరినే బదిలీ చేయలేదు. ఆయనతో పాటు మరో ముగ్గురు అదనపు సెషన్స్‌ జడ్జీలను, 11 మంది మెట్రోపాలిటన్‌ జడ్జీలనూ బదిలీ చేశారు. అయితే కీలకమైన దిల్లీ మతకలహాల కేసుల విచారణ సందర్భంగా పోలీసుల నిర్వాకాన్ని తప్పుపట్టిన వినోద్‌ యాదవ్‌ మీద బదిలీ వేటు పడడం గురించి అనుమానాలు రేకెత్తక మానవు. ప్రమాణం చేసి ప్రాసిక్యూషన్‌ తరఫున సాక్ష్యం చెప్పిన పోలీసులను బుధవారం నాడు వినోద్‌ యాదవ్‌ తప్పు పట్టడమే కాకుండా ఈ అంశం మీద డిప్యూటీ పోలీసు కమిషనర్‌ నివేదిక ఇవ్వాలని కోరారు. అంటే విచారణ ఏ దిశగా సాగుతోందో తెలిసిపోతోంది కనకే ఆయన మీద బదిలీ వేటు పడిరది. సెప్టెంబర్‌ 2వ తేదీన విచారణ సందర్భంగా షా ఆలం, రషీద్‌ సైఫీ, షాదాబ్‌ అనే ముగ్గురు నిందితుల మీద మోపిన ఆరోపణలను వినోద్‌ యాదవ్‌ తోసిపుచ్చారు. పోలీసుల అరకొర దర్యాప్తును కడిగేశారు. స్వాతంత్య్రానంతరం దేశ రాజధాని దిల్లీలో ఎన్నడూ లేని రీతిలో మతకలహాలు జరిగితే శాస్త్రీయ, ఆధునిక పద్దతులను ఉపయోగించి దర్యాప్తు చేయకపోవడాన్ని దుయ్యబట్టారు. దీనివల్ల ప్రజాస్వామ్య భావాలకు విఘాతం కలుగుతుందని కూడా అన్నారు. మరో సందర్భంలో ఆగస్టు 28న మతకలహాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రామాణికమైన దర్యాప్తు పద్ధతులను అనుసరించడం లేదు అని వినోద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. దర్యాప్తును ఒక కొలిక్కి తీసుకొచ్చే ఉద్దేశమే పోలీసులకు ఉన్నట్టు లేదు అని కూడా అన్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు స్వయంగా కోర్టుకు హాజరు కాకపోయినా కనీసం అంతర్జాలాన్ని వినియోగించి అయినా విచారణకు హాజరు కాకపోవడాన్నీ యాదవ్‌ విమర్శించారు. అక్కడితో ఆగకుండా జులై 13న దిల్లీ పోలీసుల మీద ఆ జడ్జీ రూ. 25వేల జరిమానా కూడా విధించారు. అల్లర్లలో కన్ను కోల్పోయిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే పోలీసులు అసలే పట్టించుకోకపోవడాన్ని తూర్పారపట్టారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందన్న నమ్మకమే కుదరడం లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img