Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాదయాత్రల రుతువు

ఇప్పుడు ఎక్కడ చూసినా చేతిలో త్రివర్ణ పతాకం కనిపిస్తోంది. భారత ఐక్యత అన్న నినాదమే వినిపిస్తోంది. అనేక పార్టీలు రాహుల్‌ గాంధీ అంత సుదీర్ఘమైన పాదయాత్రలు కాకపోయినా పరిమితంగానైనా పాద యాత్రలు కొన సాగిస్తున్నాయి. త్రివర్ణ పతాకం, పాదయాత్ర అధికారం సంపాదించడానికి పెద్ద నిచ్చెన అవుతుందన్న విశ్వాసం అనేకమంది నాయకుల్లో కనిపిస్తోంది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ముగిసిన తరవాత చేయి చేయి కలుపుదాం అన్న యాత్ర ప్రారంభించడం దాదాపు ఖాయం అయిపోయింది. ఈ యాత్ర కచ్‌ నుంచి కొహిమా దాకా జనవరి 26 నుంచి 26 మార్చి దాకా సాగుతుంది. ఈ యాత్రలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారో లేదో మాత్రం ఇంకా ఖరారు అయినట్టు లేదు. భారత్‌ జోడో యాత్ర రాజకీయ యాత్ర కాదంటున్నారు. కానీ ఈ యాత్ర పొడవునా బీజేపీ అనుసరిస్తున్న విద్వేష విధానం ప్రస్తావన ఉంది. పనిలో పనిగా నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి జనం సమస్యలు కూడా రాహుల్‌ ప్రస్తావిస్తూనే ఉన్నారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ పలుకుబడి మెరుగుపడ్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఈ యాత్ర ఉపయోగపడాలన్న ఆశ కాంగ్రెస్‌లో అంతరాంతరాల్లో ఉండొచ్చు. కానీ బయటకు మాత్రం ఆ ఎన్నికల ప్రస్తావనే తీసుకు రావడం లేదు. రాహుల్‌గాంధీ ప్రజల సమస్యలను లేవనెత్తుతున్నారు కనక ఈ సమస్యల వలయంలో చిక్కుకున్న వారు ఈ యాత్రకు మద్దతు ఇస్తారన్న ఆశ లేకపోలేదు. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ గాంధీకి సమకూరుతున్న మద్దతును దృష్టిలో పెట్టుకుని కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు పాద యాత్రలు నిర్ణయించాయి. ప్రశాంత్‌ కిశోర్‌ అక్టోబర్‌ రెండున ప్రారంభించిన యాత్ర ద్వారా బిహార్‌ అంతటా పర్యటిస్తున్నారు. జనతాదళ్‌(యు) నాయకుడు, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌.జె.డి) నాయకుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా యాత్రలకు సమాయత్తం అయ్యారు. బీజేపీ కూడా అదే పంథా అనుసరిస్తోంది. కాంగ్రెస్‌ సైతం బిహార్‌లో పాదయాత్ర మొదలుపెట్టింది. ఈ యాత్రలు అగ్ర నాయకులు నిర్వహించినా, ప్రాంతీయంగా పలుకుబడి ఉందనుకుంటున్న నాయకులు ప్రారంభించినా అన్నింటిలో ఒక సామాన్య సూత్రం కనిపిస్తోంది. అది త్రివర్ణపతాకం. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడూ అందులో త్రివర్ణ పతాకమే కనిపించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తే ఇటీవలి కాలంలోనే తమ రాజకీయ ప్రయోజనాల కోసమైనా త్రివర్ణ పతాకాన్ని మోయడం ఎక్కువగా కనిపిస్తోంది. మల్లికార్జున్‌ ఖడ్గే కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయినా అసలు నాయకుడు రాహుల్‌ గాంధీయేనని రుజువు చేయడానికి కచ్చితమైన ప్రయాస కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నాయకత్వం అంటే సోనియా గాంధీ కుటుంబ నాయకత్వమేనని అడుగడుగునా రుజువు చేస్తూనే ఉన్నారు. దాదాపు 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు అసలైన నాయకత్వం సోనియా కుటుంబమేనని స్పష్టమైన సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. 2024 దాకా పాదయాత్రలు కొనసాగే సూచనలే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాదయాత్రలు చేయకపోయినా ఈ నెలలోనే 11 రాష్ట్రాలలో పర్యటన చేపట్టారు. ఆయన లక్ష్యమూ 2024 ఎన్నికలే. ఆయన తూర్పు రాష్ట్రాలలో పర్యటిస్తూ 2024 జనవరి ఒకటవ తేదీ కల్లా అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి అవుతుందని ప్రకటించారు. అంటే చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నామని చెప్పదలచుకున్నారు. ఆ సమయానికల్లా 2024 ఎన్నికలు కనుచూపుమేరలో ఉంటాయి. బీజేపీని అధికారానికి చేరువ చేసిందే రామమందిర ఉద్యమం కనక అమిత్‌షా ప్రకటనకు ప్రాధాన్యం తప్పకుండా ఉంటుంది. ఇది హిందుత్వ రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన పథకమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకు ఒక్కరోజు ముందే కాంగ్రెస్‌ మరిన్ని పాదయాత్రల ప్రస్తావన తీసుకొచ్చింది. రాహుల్‌ పాదయాత్ర ఈ నెలలో కశ్మీర్‌లో ముగుస్తుంది. ఆ తరవాత హాథ్‌ జోడోయాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్‌ సంకల్పించింది. కచ్‌ నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రలో గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలను చుట్టబెడ్తారు. ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సిన తొమ్మిది రాష్ట్రాలలో తూర్పున ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయి మరి. 

ప్రధానంగా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అగ్ర నాయకుల పర్యటనలు ఖరారు అవుతున్నాయి. బిహార్‌ నుంచి 40లోకసభ స్థానాలు సంపాదించాలని బీజేపీ దీక్షగా పనిచేస్తోంది. బిహార్‌లో బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాదయాత్ర జనవరి 3న మొదలు పెట్టారు. సముద్ర మథనంలో ప్రస్తావనకు వచ్చే మందర పర్వత ప్రాంతం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే 1200 కిలోమీటర్ల యాత్రకు శ్రీకారం చుట్టారు. నితీశ్‌ కుమార్‌ గాంధీజి కర్మభూమి అయిన చంపారన్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దీనిని సమాధాన్‌ యాత్ర అంటున్నారు. బిహార్‌లో ప్రస్తుతం ఎన్నికలేమీ లేవు. కానీ నితీశ్‌ దృష్టికూడా 2024 ఎన్నికల మీదే ఉన్నట్టుంది. నితీశ్‌ యాత్ర బీజేపీ హిందుత్వను ఎదుర్కోవడానికి ఉద్దేశించింది. తేజస్వీ యాదవ్‌ సీమాంచల్‌ నుంచి కోసీ ఆంచల్‌ దాకా పాదయాత్ర చేయనున్నారు. ఈ ప్రాంతాలలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. మజ్లిస్‌ నాయకుడు ఈ ప్రాంతంలోనే ముస్లిం ఓట్లలో చీలిక తీసుకు రాగలిగారు. అది పునరావృతం కాకుండా చూడడం తేజస్వీ లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్‌లోనే జె.పి.నడ్డా, మల్లికార్జున్‌ ఖడ్గే, నితీశ్‌, తేజస్వీ, ప్రశాంత్‌ కిశోర్‌ యాత్రలు కొనసాగిస్తున్నారంటే వారి లక్ష్యం ఏమిటో స్పష్టంఅవుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోనూ సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌, బహుజన్‌ సమాజ్‌పార్టీ నాయకురాలు మాయావతి కూడా పాదయాత్రలు మొదలుపెట్టే అవకాశం లేకపోలేదు. రైతులు, కార్మికుల ప్రస్తావన తీసుకువచ్చి రాహుల్‌గాంధీ వామపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని అనుకుంటున్నట్టు ఉంది. కుల సమీకరణలలో ప్రస్తుతం బీజేపీ అగ్రభాగాన ఉంది. దాదాపు 15ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ తన పూర్వవైభవాన్ని సంపాదించడంలో సఫలం కాలేకపోయింది. ఇప్పుడైనా కాంగ్రెస్‌ కార్యకర్తలను క్రియాశీలం చేయగలుగుతోందో లేదో తెలియదు. సోనియా కుటుంబానికి ఆవల కాంగ్రెస్‌ నాయకులు తెరమీదకు వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. మల్లికార్జున్‌ఖడ్గే కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయినా అసలు నాయకత్వం సోనియా కుటుంబానిదే అని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్‌ భవిత బాగుంటుందనుకుంటేనే కాంగ్రెస్‌ కార్యకర్తల్లో చురుకుదనం వస్తుంది. 2019లో కాంగ్రెస్‌కు 12 కోట్ల ఓట్లు వస్తే బీజేపీకి 23 కోట్ల ఓట్లు వచ్చాయి. పది కోట్ల లోటు కాంగ్రెస్‌ పూడ్చగలుగుతుందా అన్నది శేష ప్రశ్నే. ఏ దృష్టితో చూసినా ఇది పాదయాత్రల రుతువులా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img