Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రాజెక్టులు పట్టవా?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన రంగమేదైనా వుందంటే అది వ్యవసాయమే. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతమిచ్చే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనంత అలక్ష్యాన్ని వహించింది. నిజానికి తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఆ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పని ఎంత వేగంగా ముందుకుపోయిందో, ఏపీలో అంత వేగంగా వెనక్కిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల్లో భాగంగా చేపట్టిన జలయజ్ఞం ఒక్కడుగు ముందుకేసినా గొప్ప విషయమే. పోలవరం, పట్టిసీమ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, పురుషోత్తపట్నం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయడమే జలయజ్ఞం లక్ష్యం. కానీ ఏ ఒక్క దశ కూడా ముందుకు సాగలేదు. నీటి పారుదల శాఖ కార్యాలయంలో మంత్రి, ఆయన బలగాలకు అసలు పనే లేకుండా పోయింది. దీంతో మంత్రి తన పనివదిలేసి ప్రతిపక్షాలను తిట్టే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. గడిచిన నాలుగేళ్లలో ప్రాజెక్టులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదన్న నిజాన్ని సీపీఐ బృందం ఎత్తిచూపింది. నీటి ప్రాజెక్టులపై సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు సాగిన సీపీఐ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన చాలా నిజాలు వెలుగుచూశాయి.
నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్క కాలువ తవ్విన సందర్భం లేదు. కర్నాటకలోని తుంగభద్ర ఎగువ భాగాన ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మిస్తే భవిష్యత్‌లో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా వైసీపీ ప్రభుత్వం నోరుమెదపడం లేదు. ఎగువభద్రకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 5,300 కోట్ల రూపాయలు కేటాయించి, జాతీయ హోదా కల్పించినా జగన్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు జీవనాధారమైన తుంగభద్ర నికర జలాలకు ఇది గండికొట్టడమే. తుంగభద్ర జలాశయమే అనంత, కర్నూలు జిల్లాల ప్రజల తాగునీటి ఆధారం. కర్నాటకలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎగువభద్ర ప్రాజెక్టును చేపట్టడం, పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ ఎనిమిదేళ్లుగా ఉలకని పలకని మోదీ సర్కారు దీనికి మాత్రం కొన్ని క్షణాల్లోనూ తలూపడం, నిధుల వర్షం కురిపించడం ఎన్నికల తంత్రమే.
వేదవతి, గుండ్రేవుల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌లు నిధుల కోసం ఆవురావురమంటున్నాయి. కరువుపీడిత ప్రాంతాలకు ఉపకరించే వేదవతి ప్రాజెక్టు నుంచి ప్రతి యేటా 30 నుంచి 40 టీఎంసీల నీరు వృథా అయిపోతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1942 కోట్లు ఖర్చవుతుందని స్వయంగా ప్రభుత్వమే నిర్ణయించినా, రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు. ఇలా యేటా రూ.16 కోట్లు విడుదల చేస్తే, ఆ ప్రాజెక్టు పూర్తికావడానికి 121 సంవత్సరాలు పడుతుంది. భూసేకరణ చేశారు, పరిహారం మరిచారు. మలగవెళ్లి జలాశయం పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతిలిచ్చి పదేళ్లయినా ఒక్క సిమెంటు బస్తా కూడా వేయలేదు. దీన్ని పూర్తిచేసివుంటే, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు, కర్నూలు నగర తాగునీటికి ఇబ్బందులు ఉండేవికావు.
రతనాల రాయలసీమను రాళ్లసీమగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వాలదే. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు ఈ పాపంలో జగన్‌ ప్రభుత్వ పాత్ర సింహభాగమే. రిజర్వాయర్లన్నీ నీళ్లతో నిండుకుండల్లా వున్నా, వాటిని అనుసంధానించే పిల్లకాల్వలు లేక సాగుకు నీళ్లు అందివ్వలేని పరిస్థితి దాపురించింది. గండికోట రిజర్వాయర్‌లో 26 టీఎంసీల నీరు నిల్వవున్నా పిల్లకాల్వలు లేక ఈ ప్రాంతం ఎండమావిలా గోచరిస్తూ వుంటుంది. గాలేరు నగరి సుజల స్రవంతి శిలాఫలకం దర్శనీయస్థలమే. కరటంబాడు ప్రాజెక్టు వద్ద 1988లో ఎన్టీఆర్‌ వేసిన శిలాఫలకమే నేటికీ దర్శనమిస్తుంది. దానికి రంగులు మాత్రం వేశారు. ప్రాజెక్టు కదలిక అంతంతమాత్రమే. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం వర్తింపచేయడానికి జాప్యమేల? ఈ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఇస్తామన్న ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం దారుణం. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించడమే గాకుండా 32 మండలాలను సస్యశ్యామలం చేయాలన్నదే వెలిగొండ ప్రాజెక్టు ఉద్దేశం. మొదటి సొరంగం పూర్తయినా, రెండో సొరంగం ఇంకా 2.5 కిలోమీటర్ల పని ఆగిపోయింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తానని చెప్పిన జగన్‌ ఒక్క పార మట్టి తీయలేదు.
ఇక పోలవరం సంగతి సరేసరి. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై 26 జిల్లాల ప్రయోజనాలు ఆధారపడివున్నాయి. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు, పట్టణాలకు తాగునీరు, ఉత్తరాంధ్ర, రాయలసీమకు నీరు లభిస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినా, ఆ తర్వాత వచ్చిన మోదీ వ్యవహారం మాత్రం దుర్మార్గంగా వుంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పోలవరంపై రూ.2900 కోట్లు ఖర్చుచేశామని, ఆ నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల జీవనాడి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలి, నటనాచాతుర్యం జుగుప్సాకరం. సీడబ్ల్యుసీ ఆమోదించినా, ప్రాజెక్టు అథారిటీ సిఫార్సు చేసినా.. ప్రాజెక్టు మాత్రం నత్తనడకే. ప్రతిరోజూ దీనిపై మాట్లాడుకోవడం ఓ ప్రహసనంగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు నిర్వాసితులు అన్నమో రామచంద్రా అంటూ అడుక్కుంటున్నా.. ప్రభుత్వం కళ్లకు కనపడటం లేదు. ఎంగిలి మెతుకులు విసిరినట్లు పరిహారం ఇవ్వడానికి, నిర్వాసితులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరతీస్తోంది. ఇదొక చిన్న ప్రాజెక్టు. పదిహేనేళ్లయినా దీనికి దిక్కూమొక్కూ లేకుండా పోయింది. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు స్థితీ అంతే. ఈ ప్రాజెక్టు పరిధిలో రూ.90 కోట్లతో మూడు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి వున్నా అతీగతీ లేదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పడి ఏడుస్తున్న ఏపీ ప్రాజెక్టుల సాధనకు కొత్త ఉద్యమం అనివార్యం, అవశ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img