Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భావస్వేచ్ఛకు ఊపిరి !

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ మంచి తీర్పు రాష్ట్రంలో భావస్వేచ్ఛకు ఊపిరిలూదింది. పౌరహక్కులకు కాస్త ప్రాణం పోసింది. ఏపీలో జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగు మాసాల క్రితం అంటే జనవరి 2వ తేదీన రాత్రికి రాత్రి జారీ చేసిన చీకటి జీవో (జీవో నెంబర్‌ 1)ను హైకోర్టు శుక్రవారంనాడు రద్దు చేసింది. సభలు, ర్యాలీలపై ‘జగన్‌ రాజ్‌’ దూసిన కత్తిని విరిచేసింది. ఒకవిధంగా చెప్పాలంటే జగన్‌ సర్కారు అరాచకాలకు ఇది అడ్డుకట్ట వేయడమే. ప్రతిపక్షంలో వున్నప్పుడు నడిచిన దారిని అధికారంలోకి వచ్చాక మరిచిపోయి, అడ్డదారిలో రాక్షస జీవోలను విడుదల చేస్తున్న జగన్‌కు తాజా తీర్పు ఓ చెంపపెట్టు.
జగన్‌ ప్రభుత్వం జీవో నెంబరు 1ను తీసుకువచ్చిన నేపథ్యం అందరికీ ఎరుకే. 2023వ సంవత్సరం ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఒకటి, రెండు సభల్లో తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దీంతో ఈ ఘటనలను సాకుగా చూపి జగన్‌ సర్కారు రాత్రికి రాత్రే జీవో1ను తీసుకువచ్చింది. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు, దాన్ని అడ్డుకోవాలని తెచ్చిన జీవో కూడా గొప్పేమీ కాదు. పాతచట్టాల్లోని అంశాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయాలనుకుంటే, అందుకు గెజిట్‌ జారీ చేయాల్సివుంటుంది. ఆనాడు గెజిట్‌లో పెట్టకుండానే జీవో నెం.1ను అమల్లోకి తేవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఈ జీవోను వ్యతిరేకించడం గమనార్హం. సీపీఐ ఒకడుగు ముందుకేసి, ఈ రాక్షస జీవోపై పెద్దఎత్తున ప్రజాఉద్యమాన్నే లేవనెత్తింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈ జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ తర్వాత టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర, కాంగ్రెస్‌ నాయకుడు రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏఐవైఎఫ్‌ అధ్యక్షులు రాజేంద్రబాబు తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ జీవో జారీ చేసిందని రామకృష్ణ తరపు న్యాయవాది విన్పించిన వాదనలపై హైకోర్టు సానుకూలంగా స్పందించి, ఈ జీవో అమలుపై స్టే విధించింది. ఆరు నూరైనా అరాచక జీవోను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా..దీన్ని హైకోర్టులోనే తేల్చు కోవాలని సర్వోన్నత న్యాయస్థానం తిప్పిపంపింది. తిమ్మినిబమ్మి చేయడానికి జగన్‌ ప్రభుత్వం చేసిన విశ్వప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. అప్పటికే నైతికంగా ఓడిన జగన్‌ ఎట్టకేలకు హైకోర్టులోనూ చిత్తయ్యారు.
ఈ ప్రపంచం ఎందరినో నియంతలను, వారి దుర్మార్గపు పాలనను చవిచూసింది. అవన్నీ పరాభవంతోనే కాలగర్భంలో కలిసిపోయిన విషయం అక్షరసత్యం. చీకటిజీవోలతో ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న జగన్‌ ప్రభుత్వం నిండునూరేళ్లూ బతుకుతుందని ఆశించడం అర్థరహితం. నిజానికి ఈ జీవో 162 ఏళ్ళ క్రితం నాటిది. స్వేచ్ఛావాయువుల కోసం పోరాటం సల్పడానికి భారతీయులు చేపట్టిన స్వాతంత్రోద్యమాన్ని అణగదొక్కేందుకు 1961లో బ్రిటిష్‌ రాజ్యం తీసుకువచ్చిన పోలీస్‌యాక్ట్‌ను ఈనాడు జగన్‌ రాజ్యం ‘అద్వితీయమైన పరిశోధనలు, తవ్వకాలు నిర్వహించి, వెలికితీసి, బూజుపట్టిన నాటి చట్టాన్ని గట్టిగా దులిపి, దానికి రంగులద్ది కొత్తగా తీసుకువచ్చిన ఉత్తర్వు ఈ జీవో నెం.1’. 1858లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనపోయి భారత్‌ నేరుగా బ్రిటిష్‌ రాణి పాలన కిందకు వచ్చిన తర్వాత నిరసనలను చట్టబద్ధంగా అణచివేసేందుకు 1961లో తీసుకువచ్చిన పోలీస్‌యాక్ట్‌లో పోలీసుల అధికారాలు, విధులను పొందుపరిచారు. అందులోని సెక్షన్‌ 30 ప్రకారం, బ్రిటిష్‌రాజ్యంలో సభలు, సమావేశాలు, ఊరేగింపులకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. పైగా సందర్భానుసారంగా దీన్ని అమలు చేయాలి. కాకపోతే, ఆనాటి చట్టం సైతం ఆంధ్రాప్రాంతానికి వర్తించలేదు. ఎందుకంటే, ఆనాటి ఆంధ్రాప్రాంతం మద్రాస్‌ ప్రెసిడెన్సీలో భాగంగా వుండేది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీల్లో సొంత పోలీసు చట్టాలున్నందున ఆ ప్రాంతాల్లో 1961 యాక్ట్‌ వర్తించదని బ్రిటిష్‌వారే స్పష్టంచేశారు. ఏ రాష్ట్రమైనా ఈ చట్టాన్ని గానీ, ఇందులో కొంతభాగాన్ని గానీ అమలు చేసుకోవచ్చని బ్రిటిష్‌వారు పేర్కొన్నప్పటికీ, ఆనాడు మద్రాస్‌ ప్రెసిడెన్సీ దీన్ని అమలుకు స్వీకరించలేదన్నది నగ్నసత్యం. బ్రిటిష్‌ కాలంలోనే వర్తించని ఈ చట్టం ఈనాడు జగన్‌ ప్రభుత్వంలో వర్తిస్తుందా? ‘పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమల్లో వుందని’ అప్పుడప్పుడూ పోలీసులు ప్రకటనలు చేసినా..ఇవి తీవ్రంగా అమలైన దాఖలాలు లేవు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2014లో పోలీస్‌ రిఫామ్స్‌ యాక్ట్‌ను తీసుకువచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఇదే అమల్లో వుంది. ఉన్నట్టుండి జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్కసుతో తీసుకువచ్చిన జీవో నెం.1 ఉద్దేశానికి, స్వేచ్ఛను హరించాలనే ఆనాటి బ్రిటిష్‌ వారి నీచమైన లక్ష్యానికి భావసారూప్యత వుందని రుజువైంది.
జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నవ్యమైన నవరత్నాలిస్తే, పాలన సవ్యంగా సాగిపోతుందన్న భ్రమలో వుంటూ వచ్చారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏనాడూ లేనంతగా పౌరహక్కులు మృగ్యమయ్యాయి. కేంద్రంలోని మోదీ పాలనకు దీటుగా జగన్‌ సర్కారు ప్రజల ప్రాథమిక హక్కులను, ప్రజాస్వామ్య నీతిని హరిస్తోంది. మనం అభివృద్ధి చెందుతున్నామా? లేక మరింత నిర్బంధంలోకి వెళ్తున్నామా? అన్న అనుమానం జీవో నెం.1తో వచ్చేసింది. పౌరహక్కులు, ప్రాథమిక హక్కులకు విఘాతం కల్పించడమే గాక ప్రతిపక్షాలనూ, ప్రజలనూ నిర్బంధంలో వుంచడమే ఈ జీవో పరమోద్దేశమన్నది జగమెరిగిన సత్యం. సీఎం కాక మునుపు ఓదార్పు యాత్రల పేరుతో వేలకిలోమీటర్లు రోడ్లపై నడిచి, ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆనాటి జగన్‌కు వర్తించని జీవోలు, ఈనాడు ప్రతిపక్షాలకు వర్తించేలా చేయడం రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రజలకు ప్రసాదించిన భావస్వేచ్ఛ హక్కును హననం చేయడమే అవుతుంది. ఈ విషయం హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో ప్రస్ఫుటంగా పేర్కొన్నారు. రేపొద్దున జీవించే హక్కునూ జగన్‌ ప్రభుత్వం హరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. జీవో నెం.1ను రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ ప్రభుత్వానికి, విషపు గుళికల్లాంటి సలహాలిస్తున్న జగన్‌ 70 మంది సలహాదారులకూ ఈ తీర్పు గుణపాఠం అవుతుందని ఆశిద్దాం! లేకుంటే.. ప్రజాకోర్టు ‘తుదితీర్పు’ ఇవ్వాల్సి వుంటుంది!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img