Friday, April 26, 2024
Friday, April 26, 2024

భావ ప్రకటనపై ప్రత్యక్ష దాడి

విస్సన్న చెప్పిందే వేదం అన్నట్టు మోదీ హయాంలో ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారానికి బాధ్యత వహించవలసిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పి.ఐ.బి.)నే సత్యాసత్యాల వివేచన చేస్తుందట. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోయిన తరవాత వార్తా ప్రసారవేగం పుంజుకోవడం ఒక సానుకూల పరిణామం. అయితే అందులో వాస్తవమైన సమాచారంఏదో, అవాస్తవ ప్రచారంఎంతో చెప్పడం అసాధ్యమైపోయింది. బూటకపు వార్తలకు కళ్లెం వేయాలన్నంత మేరకు ఎవరి వాదననైనా అంగీకరించవచ్చు. కానీ ప్రభుత్వ విభాగమే నిజానిజాలను తేల్చేటట్టయితే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వ్యాఖ్యలు అన్నీ బూటకపు వార్తల కింద ముద్రపడి పోతాయి. ఏ వార్త సత్యమో, ఏది బూటకమో తేల్చడానికి ఇప్పటికే కొన్ని వ్యవస్థలు పని చేస్తున్నాయి. అవి ప్రభుత్వం తరఫున ప్రచారంలో పెడ్తున్న సమాచారాన్ని కూడా నిగ్గు తేలుస్తున్నాయి. మరో వేపున బీజేపీ భారీస్థాయిలో ఒక విభాగాన్ని నడుపుతోంది. అది ప్రభుత్వ అనుకూల ప్రచారానికే కాకుండా ప్రభుత్వం తరఫున అసత్య ప్రచారానికి అంకితమై పోయింది. ఇప్పుడు సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రతిపాదన ప్రకారం పి.ఐ.బి. నిగ్గుతేల్చిందే సత్యం అయ్యే పరిస్థితి ఎదురుకాక తప్పదు. సమాచార సాంకేతిక నిబంధనలలో ఈ మేరకు మార్పులు చేయాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రతిపాదన గనక అమలులోకివస్తే ప్రభుత్వం చెప్పేది మాత్రమే అసలు సిసలైన సమాచార మనీ, మిగతాదంతా బూటకపు వార్తలకిందే లెక్కఅని రూఢఅయిపోతుంది. ప్రభుత్వ కార్యకలాపాలమీద, విధానాలమీద వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయడానికే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారన్న విషయం బధిరాంధులకు కూడా అర్థంఅయితీరుతుంది.
ఈ లెక్కన పి.ఐ.బి. అసత్యం అని ముద్రవేసిన ఏ సమాచారాన్నైనా సామాజిక మాధ్యమాలలో కూడా బట్వాడా చేయడానికి వీలుండదు. పి.ఐ.బి.లో ఇప్పటికే వాస్తవాలను నిర్ధారించే విభాగం ఒకటి పనిచేస్తూనే ఉంది. పి.ఐ.బి. ప్రభుత్వ విభాగం కనక అది నిఖార్సుగా ఉంటుందని, నిష్పాక్షికంగా నిగ్గు తేలుస్తుందని భ్రమపడడానికి ఇసుమంత అవకాశం కూడాలేదు. వాట్సాప్‌లాంటి సామాజిక మాధ్యమ విభాగాల్లో అడ్డగోలుగా సమాచారం పాకిపోతున్నమాట వాస్తవమే. ప్రభుత్వమే కొన్ని యూట్యూబ్‌ చానళ్లను అడ్డుకున్న ఉదంతాలూ ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం బూటకపు సమాచారం అనితేల్చిన సమాచారం ప్రభుత్వ వ్యతిరేకమైంది అయితే కావచ్చు కానీ, అది బూటకం కానక్కర్లేదు. నిజా నిజాల నిగ్గుతేల్చే బాధ్యత ప్రభుత్వంచేతిలో ఉండడం అత్యంత ప్రమాదకరం. ఫ్రభుత్వాలు మారిపోవచ్చు. కాని సత్యాసత్యాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారవు. రేపు మరోప్రభుత్వం అధికారంలోకివస్తే ఇప్పటి ప్రభుత్వం అవాస్తవం అనితేల్చిన సమాచారం సంపూర్ణ సత్యం అయిపోతుంది. మారిన ప్రభుత్వమూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రభుత్వాలతో పాటే నిజానిజాల నిర్వచనాలూ మారిపోతే అది అల్లకల్లోల పరిస్థితులకు దారితీయకతప్పదు. ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలామణి అవుతున్న సమాచారంలో అంతావాస్తవమే అని చెప్పడానికి వీలులేదు. కానీ టన్నులకొద్దీ వెలువడుతున్న సమాచారాన్ని నిగ్గుతేల్చే బాధ్యతను ప్రభుత్వ విభాగానికి అప్పగిస్తే ఏలినవారు చెప్పిందే వాస్తవంగా మిగిలిపోతుంది. అంటే వాస్తవానికికూడా చంచల స్వభావం అబ్బుతుంది. పి.ఐ.బి. సత్యాసత్యాలను తేల్చడం మొదలుపెడ్తే భావప్రకటనా స్వేచ్ఛకే ముప్పుతప్పదు. అందువల్ల ఈ ప్రతిపాదనను శక్తిమేరకు ఎదిరించాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే సమాచారాన్ని ప్రభుత్వ విభాగమైన పి.ఐ.బి. నిగ్గుతేల్చడం అంటే ప్రభుత్వానికి అనుకూలమైన సమాచారం మాత్రమే వాస్తవంగా మిగులుతుంది. మిగతా సమాచారంలో ఎంత వాస్తవంఉన్నా అది అసత్య సమాచారంకింద పక్కకు తోసేసే పరిస్థితి తప్పదు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభుత్వమే తీర్పరి అయిపోయే పరిస్థితిని ఆమోదించడం అంటే విమర్శలకు, హేతుబద్ధమైన సూచనలకుకూడా అవకాశం లేకుండా పోతుంది.
ప్రభుత్వానికి తాము చెప్పేదే వాస్తవంఅని నిరూపించాలన్నదుగ్ధతో పాటు విమర్శలన్నింటినీ బుట్టదాఖలుచేసే అధికారమూ అబ్బితే అంతకన్నా ఘోరమైన పరిస్థితి మరేదీ ఉండదు. తన మీద వచ్చే ఫిర్యాదులకు తానే తీర్పరి అయ్యే అవకాశం ఎవరికీ ఉండకూడదు. అప్పుడే ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛకు విలువఉంటుంది. లేకపోతే ఇది రాజ్యాంగ పుటలకే పరిమితమైపోయే దుస్థితి రాజ్యమేలుతుంది. ప్రభుత్వానికీ ఇష్టాయిష్టాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. ప్రత్యర్థుల అభిప్రాయాన్ని అవాస్తవం అని ముద్రవేస్తే భావప్రకటనా స్వేచ్ఛ ఎంత మాత్రం హక్కుగా ఉండకుండా ప్రభుత్వానికి నచ్చనిదల్లా అసత్యంఅన్న దుర్భరపరిస్థితి వస్తుంది. ఇది భావప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజా స్వామ్యానికి మూలకందమైన పత్రికాస్వేచ్ఛకూ సంకెలగా తయారవుతుంది. అప్పుడు పత్రికా రచన కాపలాదారు బాధ్యత నెరవేర్చడానికి అవకాశమే ఉండదు. అసత్య సమాచారంవల్ల ప్రమాదంఉన్న మాటను అంగీకరించ వలసిందే కానీ సత్యాసత్యాలను తేల్చే బాధ్యత ప్రభుత్వమే స్వీకరించడానికి అవకాశం ఇవ్వడం అంటే సత్యం నిరంతరాయంగా పాలకపక్షాల పంచనపడి ఉండవలసిన ఘోరమైన స్థితిలోకి చేరుకోవడం ఖాయం. పత్రికలలోవచ్చే సమాచారంలో తమకు పొసగని వాటిని ఖండిరచే అవకాశం ఇప్పటికీ ఉంది. అవతలి పక్షం వాదన కూడా వినాలన్న నియమం ప్రకారం పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ఈ ఖండనలు, సవరణలకు స్థానం ఇస్తూనే ఉంటాయి. ఎవరిమీదైనా తప్పుడు సమాచారం ప్రచురించారనో, ప్రసారం చేశారనో వాదనలు వస్తే వివిధ మాధ్యమాలు నిఖార్సైన ఆధారాలు చూపితే తమ తప్పు సవరించుకుంటూనే ఉన్నాయి. రెండు పక్షాలు తమ వాదనే సరైంది అన్న పరిస్థితి ఏర్పడితే ఆ వ్యవహారం కోర్టుకెక్కుతోంది. అలా కాకుండా ప్రభుత్వవిభాగం బూటకం అనితేల్చింది ఏ రూపంలో ప్రచారంలోకి రాకూడదనడంవల్ల వాస్తవం పీకనొక్కడానికి మార్గం మరింత సుగమం అవుతుంది. ఇది ఎమర్జెన్సీ సమయంలో విధించిన సెన్సార్షిప్‌ కన్నా ఘోరమైంది.
ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రచురణార్హం కాని సమాచారం ఏమిటో నిర్ధారించే బాధ్యత కేంద్రంలో పి.ఐ.బి.కి, రాష్ట్రాలలో సమాచార పౌర సంబంధ శాఖ అధికారులకు ఉండేది. అప్పుడు సత్యం చెప్పదలుచుకున్న మీడియా సంస్థలు సంకటస్థితి ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మీడియా అనేక రూపాల్లో విస్తరించింది. బూటకపు సమాచారన్ని నివారించడం ఎంత అవసరమో ఆ అధికారం ప్రభుత్వమే చేస్తుందనడం అత్యంత దారుణం. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యతను మీడియా సంస్థల యజమానులకన్నా మీడియాలో పనిచేసేవారే ఎప్పుడూ బుజాన వేసుకున్నారు. కొత్త ప్రతిపాదన మీడియా సంస్థలకేకాక ప్రజలందరికీ సంకెలగా తయారవుతుంది కనక ఈ ప్రతిపాదనను ప్రతిఘటించవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img