Friday, April 26, 2024
Friday, April 26, 2024

శరద్‌ పవార్‌ విజ్ఞత

శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.)లో రేగిన చిరు తుపానును నివారించడంలో ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ సఫలమయ్యారు. అధికారం లేకుండా ఉండలేక పోతున్న ఎన్‌.సి.పి. అధినేత అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ ఊగిసలాట ధోరణి ఆ పార్టీకి కీడు చేస్తుందేమోనన్న సంకేతాలు వెలువడ్డాయి. అజిత్‌ పవార్‌ బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇదే జరిగి ఉంటే ఎన్‌.సి.పి. కచ్చితంగా బలహీనపడి ఉండేది. ఈ విపత్తును నివారించడానికి శరద్‌ పవార్‌ తాను ఎన్‌.సి.పి. అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనితో ఎన్‌.సి.పి. కార్యకర్తల్లో అలజడి మొదలైంది. శరద్‌ పవార్‌ నాయకత్వ స్థానాన్ని వదలకూడదన్న ఒత్తిడి పెరిగింది. పవార్‌ చేసిన ప్రకటన ఛగన్‌ భుజబల్‌ లాంటి వారు ఎన్‌.సి.పి. నాయకత్వ స్థానాల పంపిణీ సూత్రాన్ని కూడా రూపొందించారు. పవార్‌ కుమార్తే సుప్రియా సూలే జాతీయ స్థాయిలో పార్టీకి నాయకత్వం వహిస్తే అజిత్‌ పవార్‌ మహారాష్ట్రలో పార్టీబాధ్యతలు నిర్వర్తించాలని ఛగన్‌ భుజబల్‌ సూచించారు. ఏమైతేనేం శరద్‌పవార్‌ ఎన్‌.సి.పి. అధ్యక్షుడిగా కొనసాగ డానికి అంగీకరించడంతో ఆ పార్టీలో చీలిక రావడమో, బీజేపీ వైపు మొగ్గడమో అన్న రెండు ప్రమాదాలూ తప్పాయి. కర్నాటక శాసనసభ ఎన్నికలలో గెలవకపోతే మోదీ భవిష్యత్తే అనుమానాస్పదం అవుతుంది. అందుకని మోదీ ఎక్కువ సమయం ఎన్నికల ప్రచారానికి కేటాయించడమే కాక బీజేపీకి చాలా ప్రీతిపాత్రమైన మతతత్వాన్ని తురుపు ముక్కగా ఉపయోగించుకోవడం మానలేదు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడాన్ని మోదీ వాటంగా మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి వినియోగించుకున్నారు. ఎన్‌.సి.పి.లో చెలరేగిన తుపానును నిరోధించిన తరవాత పవార్‌ మాట్లాడుతున్న తీరు బీజేపీ వైపు మొగ్గే అవకాశం లేదని నిరూపించాయి. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ మతపరమైన నినాదాలు ఇవ్వడాన్ని ఆయన గట్టిగా తూర్పారబట్టారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని జోస్యం కూడా చెప్పారు. కర్నాటకలో ఓటర్లు బీజేపీతో విసిగిపోయి ఉన్నారనీ, ఆ పార్టీ పలుకుబడి పలచనవుతోందని కూడా పవార్‌ అనడం ఆయన బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ చేయి కలపబోరన్న భరోసా కల్పించింది. బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కోక తప్పదన్నది పవార్‌ అభిప్రాయం. ‘‘మనం సెక్యులరిజం అన్న భావనను అంగీకరించామని, ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు, ఒకవేళ అధికారం దక్కితే ప్రమాణం స్వీకరించేటప్పుడు సెక్యులరిజానికి నిబద్ధమై ఉంటామని, ప్రమాణం చేస్తామని కూడా పవార్‌ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మోదీ మత ప్రస్తావన తీసుకురావడం, మతతత్వాన్ని పెంచి పోషించే రీతిలో మాట్లాడడాన్ని పవార్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. కర్నాటక ఎన్నికలలో ఎన్‌.సి.పి. తొమ్మిది సీట్లకు మాత్రమే పోటీ చేస్తోంది. అయినా ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్తును పదిలపరచడమో, దిగజార్చడమో ఖాయం గనక పవార్‌ సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉన్నట్టు సంకేత ప్రాయంగానైనా ప్రకటించడం మంచి పరిణామమే. బీజేపీ ఎన్‌.సి.పి.ని చీల్చే ప్రయత్నం తీవ్రంగానే చేసింది. కానీ పవార్‌ వ్యూహం, సైద్ధాంతిక నిబద్ధత ఆ ఆగడాలు ఏవీ సాగకుండా ఆపగలిగింది.
కేంద్రంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్నది కొన్ని రాష్ట్రాలలో మాత్రమేనని కూడా పవార్‌ గుర్తు చేశారు. ఏక్‌ నాథ్‌ షిండే తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తోంది. షిండేను కేవలం ఉత్సవ విగ్రహంలా వినియోగించుకుంటోంది. ఈ ఎత్తుగడలు అన్ని రాష్ట్రాలలో పని చేయవు అన్న వాస్తవాన్ని పవార్‌ వ్యక్తం చేశారు. శరద్‌ పవార్‌ రాజకీయ అనుభవాన్ని, ఆచరణాత్మక వ్యూహాలను తక్కువ అంచనా వేయడానికి వీలే లేదు. ఏక్‌ నాథ్‌ షిండే కుట్ర చేయక ముందు ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలో మహా వికాస్‌ అగాధీ అధికారంలో కొనసాగడం పవార్‌ చాకచక్యం కారణంగానే. ఎన్‌.సి.పి., కాంగ్రెస్‌ తో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని నడిపినందువల్ల శివసేన మతతత్వాన్ని పూర్తిగా విడనాడిరదని కానీ, సెక్యులర్‌ విధానాలను అనుసరించిందని అర్థం కాదు. అయితే బాల్‌ ఠాక్రే నాయకుడిగా ఉన్నప్పటి నుంచి హిందుత్వ రాజకీయాలలో రెండు ఆకులు ఎక్కువే చదివిన శివసేనను పవార్‌ మాలిమి చేయగలిగారు. రాజకీయ సమీకరణల కారణంగా ఉద్ధవ్‌ ఠాక్రే మతతత్వ ఛాయలు తగ్గిన మాట కూడా కాదనలేెం. శరద్‌ పవార్‌ రాజకీయ పరిణతి, పరిపక్వత ఎంత ముఖ్యమైందో మహా వికాస్‌ అగాధీని ఏర్పాటు చేయడం లోనే తేలిపోయింది. కానీ శరద్‌పవార్‌ తన నాయకత్వంలోని ఎన్‌.సి.పి.లో తన తరవాత తనంతటి నాయకుడిని దిద్ది తీర్చలేకపోవడం కూడా వాస్తవమే. పార్టీ అధినేతగా తాను తప్పుకుంటున్నానని ప్రకటించిన తరవాత తన స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి పవార్‌ ఒక భారీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో బీజేపీతో చేతులు కలపాలని కోరే వారూ ఉండొచ్చు. కానీ ఎన్‌.సి.పి. కార్యకర్తల ఒత్తిడివల్ల పవార్‌ నాయకత్వ స్థానం నుంచి తప్పుకోవాలని అనుకున్నా వెనక్కు తగ్గక తప్పలేదు. దీన్నిబట్టి ఎన్‌.సి.పి. నాయకులలో కొందరు అధికార దాహంతో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడానికి సిద్ధమైనా కార్యకర్తలు ఆ పన్నాగాలు సాగనివ్వలేదు. అంటే శరద్‌ పవార్‌ నాయకత్వంలో ఎన్‌.సి.పి. కార్యకర్తల్లో సెక్యులర్‌ భావాలు బాగానే నాటుకున్నట్టు లెక్క. ఇదీ పవార్‌ సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణం. మహారాష్ట్ర ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఉద్ధవ్‌ ఠాక్రే అధికారం కోల్పోయినా జనంలో మద్దతు తగ్గలేదని అర్థం అవుతోంది. పవార్‌కు మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత ప్రధానమైనవే కావచ్చు. కానీ జాతీయ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీని నిలవరిం చడంలో ఆయన దక్షత ప్రతిపక్షాలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలలో శరద్‌ పవార్‌ మాటకు విలువ ఉంటుంది. ప్రతిపక్ష ఐక్యత కోసం భిన్న మార్గాల్లో ప్రయత్నం చేస్తున్న వారందరూ శరద్‌ పవార్‌ను సంప్రదించక తప్పడం లేదు. అంటే జాతీయ రాజకీయాలలో ఆయన పాత్రను, ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం. 2024 సార్వత్రిక ఎన్నికలలోగా ప్రతిపక్షాలను ఒక్క తాటిమీదకు తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ లాంటి వారు దృఢ దీక్షతోనే ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల పొడవునా శరద్‌ పవార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావుతో మాట్లాడినా ప్రాంతీయ పార్టీల ఐక్యతవల్ల కలిగే ప్రయత్నం చాలా పరిమితమైందని ఆయనకు తెలుసు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో మోదీ మతతత్వ ప్రసంగాలను వ్యతిరేకించడంద్వారా తమ పార్టీ సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉండడమే కాక బీజేపీని ఢీకొనడానికి తమ పార్టీ సిద్ధం అన్న సంకేతాన్ని పవార్‌ స్పష్టంగానే ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమే కాకుండా, దేశంలో విస్తారంగా అస్తిత్వం ఉన్న కాంగ్రెస్‌ ను మినహాయించి ప్రతిపక్ష ఐక్యత సాధించాలన్న దృష్టి పవార్‌ లో ఎప్పుడూ కనిపించలేదు. అంటే బీజేపీని ఎన్నికలలో ఢీకొనడమే కాక సైద్ధాంతిక స్థాయిలో ఎదుర్కోవలసిన ఆవశ్యకతనూ పవార్‌ విస్మరించడం లేదు. ఇది ఆయన విజ్ఞత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img