Friday, September 30, 2022
Friday, September 30, 2022

బిహార్‌లో బీజేపీ ఎత్తుగడలు చిత్తు

బిహార్‌లో బీజేపీతో నితీశ్‌ కుమార్‌ కలహాల కాపురం ముగిసింది. ఎన్‌.డి.ఎ. కూటమి నుంచి నితీశ్‌ కుమార్‌ మంగళ వారం వైదొలగారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడమే తరువాయి. అయితే కొత్త ప్రభుత్వంలో కూడా నితీశ్‌ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారు. అధికారం కోసం జె.డి.(యు) అధినేత బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా సైద్ధాంతికంగా నితీశ్‌ పార్టీకి, బీజేపీకి పొసగదని ముందే తెలుసు. నితీశ్‌ కుమార్‌ సోష లిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. 1974-75లో జై ప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో సంపూర్ణ విప్లవం నేపథ్యంలో రాజకీయంగా ఆయన ఎదిగారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తరవాత విడ పోివడం నితీశ్‌కు ఇది రెండవ సారి. బీజేపీకి, నితీశ్‌ కుమార్‌కు ఏ మాత్రం పొసగడం లేదని గత రెండు నెలలుగా జరిగిన పరిణామాలు నిరూ పిస్తూనే ఉన్నాయి. చివరకు అనివార్యంగా ఈ అసహజ సంకీర్ణ ప్రభుత్వం పతనం కాక తప్పలేదు. ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) తో కలిసి నితీశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయ బోతున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు నితీశ్‌ నాయకత్వంలోని జె.డి.(యు), లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ నాయ కత్వంలోని ఆర్‌.జె.డి. కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు లాలూ కుమారు లిద్దరితో వేగడం నితీశ్‌కు అసాధ్యమైంది. అప్పుడు తేజస్వీ మీద నితీశ్‌ అవినీతి ఆరోపణలు మోపారు. మొత్తం మీద ఆ ప్రభుత్వం పతనం అయింది. నితీశ్‌ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్‌.డి.ఎ. గూటిలో చేరిపోయారు. నిజానికి ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షంలో ఇంతవరకు ఉన్న చెప్పుకోదగ్గ పార్టీ నితీశ్‌ నాయకత్వంలోని జె.డి.(యు) మాత్రమే. మంగళవారం నితీశ్‌ కుమార్‌ తన పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో తెగతెంపులు చేసుకుందామని ప్రకటించి వారి ఆమోదం పొందారు. బీజేపీతో విడిపోతే మద్దతు ఇవ్వడానికి ఆర్‌.జె.డి., కాంగ్రెస్‌, వామపక్షాలు అంతకుముందే అంగీకరించాయి. మంగళవారం జె.డి.(యు) ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశం జరిగినట్టే ఆర్‌.జె.డి. శాసనసభ్యుల సమావేశం కూడా జరిగింది. అందులో నితీశ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నితీశ్‌ కుమార్‌ అధికారంకోసం ఎవరితోనైనా పొత్తు కూడగలరన్న అపఖ్యాతి ఉన్న మాట వాస్తవమే. తేజస్వీ యాదవ్‌ ఆయనను ‘‘పల్టూ చాచా’’ అని సంబోధించేవారు. ఇటీవలి కాలంలో చాలా మంది నితీశ్‌ను ‘‘కుర్సీ రాం’’ అని కూడా అంటున్నారు. ఈ దృష్టితో చూస్తే నితీశ్‌ కుమార్‌ అధికార దాహం అపారం అనిపించక మానదు. ఆ మాట నిజమే కావచ్చు కానీ బిహార్‌ రాజకీయాలలో నితీశ్‌ అనివార్యత అంతకన్నా పెద్ద కారణం. 2020లో జరిగిన శాసన సభ ఎన్నికలలో బీజేపీకి 77 స్థానాలు, జె.డి.(యు)కు 45, ఆర్‌.జె.డి.కి 75 స్థానాలు, కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చాయి. 2020 ఎన్నికల తరవాత బీజేపీకి 77 స్థానాలున్నా 45 సీట్లు మాత్రమే ఉన్న జె.డి.(యు) నాయకుడు నితీశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించక తప్పలేదు. ఇటీవలే సుల్తాన్‌ అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లీమీన్‌ తరఫున ఎన్ని కైన అయిదుగురు శాసనసభ్యుల్లో నలుగురు ఆర్‌.జె.డి.లో చేరిపోయారు. దీనితో ఆర్‌.జె.డి. బలం 79కి పెరిగింది. అంటే ఆర్‌.జె.డి. అతి పెద్ద రాజ కీయ పార్టీ. ఇప్పుడు ఆర్‌.జె.డి. పరిస్థితీ అదే. ఆ పార్టీకి 79 స్థానాలున్నా నితీశ్‌నే ముఖ్యమంత్రిగా ఒప్పుకోక తప్పలేదు. బీజేపీని అధికారంలో లేకుండా చేయాలంటే తేజస్వీ యాదవ్‌కు గత్యంతరం లేదు.
బీజేపీతో కలిసి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా తన భాగస్వామ్య పక్ష అస్తిత్వానికే ఎసరు పెట్టడం ఖాయం అని చాలాసార్లు రుజువైంది. మెజారిటీ లేని చోట్ల కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంకోసం బీజేపీ ఎన్ని అడ్డదార్లయినా తొక్కుతుంది. మహారాష్ట్రలో తాజాగా జరిగింది ఇదే. అక్కడ కూడా శివసేన తిరుగుబాటు వర్గ నాయకుడు ఏక్‌ నాథ్‌ షిందేను సమర్థించే వారికన్నా బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువే అయినా షిందేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. అలా కలిసి ఉన్నట్టే ఉండి ఆ పక్షాన్నే మింగేసే రాజకీయాలు అనుసరించడం బీజేపీకి అలవాటైన వ్యవహారమే. దీర్ఘకాలికంగా శివసేనను బలపరచడానికి బీజేపీ అనుసరించిన వ్యూహం నచ్చకే ఉద్ధవ్‌ ఠాక్రే కాంగెస్‌, ఎన్‌.సి.పి.తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. చివరికి ఆ సర్కారును కూడా షిందే సహాయంతో బీజేపీ కూల్చేసింది. బిహార్‌లో కూడా జె.డి.(యు) అధ్యక్ష స్థానంలో ఉన్న ఆర్‌.సి.పి. సింగ్‌ సహాయంతో జె.డి.(యు)ను మింగే యడానికి బీజేపీ ప్రయత్నించింది. ఈ విద్యలో నిష్ణాతుడైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బిహార్‌ రాజకీయాలలో కలగజేసుకుంటున్న తీరు నితీ శ్‌కు చికాకు కలిగించింది. తన అసంతృప్తిని నితీశ్‌ అనువైనప్పుడల్లా వెళ్లగక్కుతూనే వచ్చారు. బీజేపీ తన పార్టీని మింగేయకముందే సంకీర్ణ ప్రభు త్వం నుంచి తప్పుకోవడం మంచిదని నితీశ్‌ భావించారు. ఆ క్రమంలోనే ఆయన తేజస్వీ యాదవ్‌తో సఖ్యత పెంచుకున్నారు. పరస్పర విమర్శలు తగ్గాయి. పరిస్థితి అనుకూలించగానే నితీశ్‌ బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారు. నితీశ్‌ కొత్త దారి పట్టడానికి బీజేపీతో ఉన్న అసౌకర్యానికి తోడు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు బీజేపీయేతర పార్టీలు నితీశ్‌ కుమార్‌ను ప్రతిపక్ష కూటమి నాయకుడిగా భావిం చాయి. కానీ ఆయన బీజేపీతో వియ్యమంద డంతో ప్రతిపక్షాలు ఆయనను నమ్మడం మానేశాయి. అయితే సైద్ధాంతి కంగా బీజేపీయేతర పక్షాలతోనే నితీశ్‌కు సులభంగా పొసగుతుంది. ఇటీవలి కాలంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని నిలవరించడానికి ప్రతి పక్షాల ఐక్యత సాధించాలన్న దృష్టి పెరిగింది. అయితే ఆ ప్రతిపక్ష కూటమికి నాయకత్వంకోసం మమతా బెనర్జీ, కె. చంద్రశేఖర రావు, అరవింద్‌ కేజ్రీ వాల్‌ పోటీ పడ్తున్నారు. నాయకత్వం తమ చేతిలో లేకపోతే ప్రతిపక్ష ఐక్యతే లేదు అన్నంతదాకా వీరి తీరు వెళ్లింది. వీరందరితో పోలిస్తే మోదీకి ఎదు రొడ్డి నిలబడగలిగిన శక్తి నితీశ్‌ కుమార్‌కే ఉంది. ఆయన పిల్లి మొగ్గలు వేయకుండా ఉంటే కచ్చితంగా ప్రతిపక్ష నాయకులలో అగ్రాసనమే ఉండేది. అయితే ఇప్పటికైనా నితీశ్‌కు తన శక్తిసామర్థ్యాలతో పాటు సైద్ధాంతిక పునాది కూడా గుర్తొచ్చినట్టుంది. ప్రతిపక్ష కూటమికి నాయకత్వ స్థానాన్ని పూడ్చ గలిగే శక్తి కచ్చితంగా నితీశ్‌కు ఉంది. ఈ పరిణామాలన్నింటి పర్యవ సానం ఏమిటంటే భాగస్వామ్య పక్షాలను మింగేసే తిమింగలంలాంటి బీజేపీ నితీశ్‌ ఎత్తుగడల ముందు చిత్తుకాక తప్పలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img