Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కాంగ్రెస్‌ అధిష్ఠానం తడబాటు

రెండు దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి జరుగు తున్న ఎన్నికలలో కనీస ప్రజాస్వామ్య ఛాయలు కనిపించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం నానా యాతన పడవలసి వచ్చింది. ఎన్నికలు నిర్వహిస్తారని తెలిసిన వెంటనే సీనియర్‌ నాయకుడు శశీ థరూర్‌ రంగంలోకి దిగారు. సోనియా గాంధీ ఆయనను పోటీ చేయ కూడదని చెప్పకపోయినా అధిష్ఠానం అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై పోయారు. అయినా శశీ థరూర్‌ పోటీ చేయాలన్న సంక ల్పానికే కట్టుబడి ఉన్నారు. చివరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన శుక్రవారం సీనియర్‌ నాయకుడు మల్లి కార్జున ఖడ్గేను అధిష్ఠానం అభ్యర్థిగా నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాలనుకున్నప్పుడూ నాలుగో అభ్యర్థి అయిన మాజీ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌ సిన్హాపై పోటీ చేసే భారం పడిరది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా అధిష్ఠానం తరఫు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లికార్జున్‌ ఖడ్గే మూడవ వారు. ఈ ఎన్ని కలలో తాము తటస్థంగా ఉంటామని సోనియా గాంధీ చెప్పినప్పటికి అధికారికంగా పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడంలో అధిష్ఠానం నిర్ణాయక పాత్రనే పోషించింది. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి సోనియా గాంధీ కుటుంబం తరఫున ఎవరూ పోటీ చేయకూడదు అని నిర్ణయించు కున్న తరవాత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ను అభ్యర్థిగా నిర్ణ యించారు. కానీ ఆయన రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగాలను కున్నారు. అక్కడితో కథ ఆగలేదు. సచిన్‌ పైలెట్‌ను ఎక్కడ ముఖ్య మంత్రిని చేస్తారోనని భయపడ్డ గెహ్లోత్‌ మద్దతుదార్లు అయిన 92 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధపడడమే కాక స్పీకర్‌కు రాజీనామా పత్రాలు అందించారు. వాటిని ఆమోదించలేదు కానీ ఇది రాజస్థాన్‌ కాంగ్రె స్‌ శిబిరంలో సంక్షోభానికి దారి తీసింది. చివరకు ముఖ్యమంత్రి గెహ్లోత్‌ దిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలుసుకుని క్షమాపణ చెప్పవలసి వచ్చింది. తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేయను అని కూడా ఆయన ప్రకటించవలసి వచ్చింది. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారో లేదో కూడా అనుమానమే. గెహ్లోత్‌ రంగం నుంచి నిష్క్రమించిన తరవాత మరో సీనియర్‌, తల పండిన కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ పోటీకి సిద్ధ మయ్యారు. గురువారం ఆయన పది సెట్ల నామినేషన్‌ పత్రాలు పట్టు కెళ్లారు. ఏ కారణం చేతో ఆయనకు అధిష్ఠానం ఆశీస్సులు లభించినట్టు లేదు. అధిష్ఠానం మల్లికార్జున్‌ ఖడ్గే వేపు మొగ్గుతున్నట్టు గ్రహించి ఆయనా పోటీ చేయాలన్న సంకల్పం విరమించుకున్నారు. మల్లికార్జున్‌ ఖడ్గే కర్నాటకు చెందిన నాయకుడైనప్పటికీ హిందీ ధారాళంగా మాట్లాడగలరు. ఆయన ఎన్నికైతే స్వాతంత్య్రం తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి చేరుకున్న దక్షి ణాది నాయకులలో ఆరవ వారు అవుతారు. భోగరాజు పట్టాభి సీతా రామయ్య, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్‌ నాడార్‌, ఎస్‌. నిజలింగప్ప, పీవీ నరసిం హారావు కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు. ఖడ్గే సౌమ్యుడు, అనుభవజ్ఞుడు. అన్నింటికీ మించి దళితుడు. ఆయన ఇందిరాగాంధీ ఆధిపత్యానికి ముప్పు ఎదురైన 1969లో కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించారు. 1972లో మొదటి సారి శాసనసభకు పోటీ చేశారు. ఎనిమిది సార్లు గెలుస్తూనే వచ్చారు. 1980 నుంచి 1992 దాకా కర్నాటకలో కాంగ్రెస్‌ మంత్రివర్గంలో ఉన్నారు. 1996 నుంచి 99 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2005 నుంచి 2008 దాకా కర్నాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరవాత ఆయన లోకసభకు పోటీ చేస్తూ వచ్చారు. 2019లోనే మొట్ట మొదటి సారి ఓటమి పాలయ్యారు. మూడు సార్లు ఖడ్గేకు ముఖ్యమంత్రి పదవి చేజారిపోయింది. ఆయన 2014 నుంచి 2019 దాకా లోకసభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ తరవాత ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఖడ్గే సౌమ్యుడే కాక మర్యాదస్థుడు, మృదు స్వభావి. ఇంతవరకు ఆయన మీద వివాదాలూ తలెత్తలేదు.
సంస్థాగతంగా ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించడం అభినందనీయమే. కానీ అధిష్ఠానం అభ్యర్థిని పోటీకి నిలపడం, అధిష్ఠానం ఆశీస్సులు లేనందువల్ల దిగ్విజయ సింగ్‌ పోటీ నుంచి విరమించడం ప్రజాస్వామ్య పద్ధతి అనిపించుకోదు. సోనీయా గాంధీని కలుసుకున్న తరవాత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి గెహ్లోత్‌ ‘‘మేం శాసనసభా పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి ఏక వాక్య తీర్మానం ఆమోదింప చేయలేకపోయాం. నేను ముఖ్యమంత్రిని, శాసనసభా పక్షం నాయకుడిని కనక ఏకవాక్య తీర్మానం ఆమోదింప చేయ లేకపోవడం నా వైఫల్యమే’’ అని గెహ్లోత్‌ విచారం వ్యక్తం చేశారు. ఆ విషయమే ఆయన సోనియాకు విన్నవించారట. ఇలా ఏకవాక్య తీర్మానం ఆమోదించడం అంటే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించవలసిన బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అప్పగించడం. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం అయితే శాసనసభా పక్షం తమ నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడినే ప్రభు త్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ ఆహ్వానించడం రివాజు. కానీ ఇందిరా గాంధీ హయాం నుంచి శాసనసభా పక్ష నేతను ఏ రాష్ట్రంలోనైనా అధి ష్ఠానమే నిర్ణయిస్తోంది. దీనికే సీల్డ్‌ కవర్‌ రాజకీయాలు అన్న ముద్దు పేరు ఉంది. సచిన్‌ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని అడ్డుకోవడానికి 92 మంది శాసనసభ్యులు రాజీనామాలకు సిద్ధ పడడం ఇప్పుడు అమలవు తున్న ముఖ్యమంత్రి ఎంపిక పద్ధతి ప్రకారం చాలా అసహజంగా కనిపించ వచ్చు. కానీ అది మెజారిటీ సభ్యుల ఆకాంక్ష. పైలెట్‌ను అడ్డుకోవడంలో రాజకీయాలు ఉండొచ్చు. గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదు. ఇక్కడ సచిన్‌ పైలెట్‌ యోగ్యతాయోగ్యతల చర్చ అనవసరం. ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనివ్వకుండా జరిగిన వ్యవహారంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో గెహ్లోత్‌ ప్రమేయం కూడా ఉండొ చ్చు. ఏమైనా ఇది ఫక్తు ముఠా రాజకీయం తప్ప ప్రజాస్వామ్య విధానం అయితే కాదు. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తారని తేలిపోయిన తరవాత శశీ థరూర్‌ పోటీ పడాలనుకున్నారు. అది ఆయన ప్రజాస్వామ్య హక్కు. 23 మంది సభ్యులతో కూడిన బృందం కాంగ్రెస్‌లో సంస్థాగతంగా సంస్కరణలు జరగాలని కోరుతూ లేఖ రాసిన వారిలో శశీ థరూర్‌ కూడా ఉన్నారు. శశీ థరూరు ఆ 23 మందితో కూడిన బృందం తరఫున పోటీ చేయడం లేదు. తటస్థంగా ఉంటానని చెప్పిన సోనియా గాంధీ అధిష్ఠానం తరఫున ఒక అభ్యర్థిని రంగంలోకి దింపడంతో శశీ థరూర్‌కు ప్రమేయం లేదు. ఖడ్గే లేదా శశీ థరూర్‌ ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా వారు ప్రస్తుతం ప్రత్యర్థులు కావచ్చు కానీ శత్రువులు కానక్కర్లేదు. అంతర్గత ప్రజాస్వామ్య సారం ఇదే. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తడబడిన మాట వాస్తవం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img