Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రతిపక్ష ఐక్యతకు కొత్త చిగుళ్లు

ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. 1967లో మొట్టమొదటిసారి ప్రతిపక్షాల మధ్య ఐక్యత తొమ్మిది రాష్టాలలో సంయుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాలకు దారి తీసింది. ఆ ప్రయోగం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ ఎమర్జెన్సీ నేపథ్యంలో కొన్ని పార్టీలు కలిసి జనతా పార్టీ ఏర్పాటు చేశాయి. లోకనాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో జరిగిన సంపూర్ణ విప్లవ నేపథ్యంలో కేంద్రంలో మూడు దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ను గద్దె దించగలిగారు. జనతా ప్రభుత్వమూ రెండున్నరేళ్లకన్నా ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తరవాత 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ రూపంలో ప్రతిపక్షాల ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిరది. రెండేళ్ల కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. ఆ తరవాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి పేరుతో అటల్‌ బిహారీ నాయకత్వంలో మూడుసార్లు అధికారం లోకి రావడం అప్పటి సమీకరణల ప్రకారం ప్రతిపక్ష ప్రభుత్వం కిందే జమ. ఈ కూటమిలో దాదాపు పాతిక ముప్పై పార్టీలు ఉండేవి. ఆ తర వాత కాంగ్రెస్‌ నాయకత్వంలో 2004లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వం పదేళ్లు కొనసాగింది. ఈ వరస క్రమం చూస్తే ప్రతిపక్షాల ఐక్యత మొదట కాంగ్రెస్‌ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పడడానికి, ఎన్‌.డి.ఎ. అధికారంలోకి వచ్చిన తరవాత బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో మోదీ నాయ కత్వంలో ఎన్‌.డి.ఎ. అధికారంలోకి రావడం, 2019లో మరింత ఎక్కువ ఆధిక్యత సంపాదించడం, ఈ క్రమంలో కాంగ్రెస్‌ అంతకంతకూ బలహీన పడడంతో ప్రతిపక్ష ఐక్యతా యత్నాలు ముందుకు సాగలేదు. అనేక రాష్ట్రా లలో బీజేపీ అధికారంలో ఉండడం కూడా ప్రతిపక్ష ఐక్యతకు అవకాశం లేకుండా చేసింది. మోదీ ఏలుబడిలో మతతత్వ ధోరణులు ప్రబలడం, ఫాసిస్టు పోకడలు పొడసూపడంతో ప్రతిపక్షాలలో మళ్లీ కదలిక వచ్చింది. నియంతృత్వ పోకడలతో పని చేసే మోదీ పాలనలో రాజ్యాంగం విచ్ఛిన్నం అవుతోందన్న అభిప్రాయం బలంగా నాటుకుంది. చిక్కెక్కడ ఉందంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాన్ని వ్యతిరేకించే పార్టీలను ప్రతిపక్షాల కింద జమ కడ్తున్నాం. నిజానికి అందులో చాలా పార్టీలు భిన్న సంద ర్భాలలో మోదీ ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకు రావడంలో మోదీకి సహ కరించాయి. వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ లాంటి పార్టీల నడవడిక చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. బీజేపీయేతర పక్షాల మధ్యే వైరుధ్యాలు ఉండడం, ఆ పక్షాలు రాష్ట్ర స్థాయిలో పోటీ పడవలసిన అగత్యం ఉండడం వల్ల బీజేపీ ఆటలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఉదాహరణే తీసుకుంటే అధికారంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌, తెలుగు దేశం పేరుకు బీజేపీ యేతర పక్షాలే అయినా, రాష్ట్ర స్థాయిలో కలహించుకుంటూనే ఉన్నాయి. అంటే బీజేపీయేతర పక్షాలన్నింటినీ ప్రతిపక్షాల కింద జమ కట్టే అవకాశం లేదు. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. అప్పుడు కాంగ్రెసేతర, బీజేపీ యేతర పక్షాల ఐక్యత అన్న సూత్రం పని చేసింది. మోదీ బలపడుతూ, దేశమంతటా ఇప్పటికీ అస్తిత్వం ఉన్న కాంగ్రెస్‌ కునారిల్లుతున్న స్థితిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే బీజేపీయేతర పక్షాల ఐక్యత అన్న అభిప్రాయం మొదలైంది. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రాంతీయ పార్టీల ప్రభ తగ్గింది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే ముప్పు ఏర్పడే రీతిలో మోదీ ప్రవర్తించారు. తమ మిత్ర పక్ష పార్టీలకే అస్తిత్వం లేకుండా చేశారు. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ మధ్య ఏ పార్టీ మిగలదు, ఒక్క బీజేపీనే ఉంటుంది అనడం ఆ పార్టీ అహంకారానికి చిహ్నం. ఇది మిగతా ప్రతిపక్షాలన్నింటినీ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యలోనే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ప్రతి పక్షాలు వాజపేయి ప్రభుత్వంలో ఆర్థిక, విదేశాంగ శాఖలను నిర్వహించిన యశ్వంత్‌ సిన్హాను రంగంలోకి దించడంతో ప్రతిపక్షాల ఐక్యత ఆశలు మళ్లీ అనలు తొడిగాయి. అయితే మమతా బెనర్జీ లాంటి వారు కూడా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థి అని ముందే తెలిసి ఉంటే అని సన్నాయి నొక్కులు ప్రారంభించారు. ఆ మేరకు ప్రతిపక్ష ఐక్యతకు విఘాతం కలిగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడంలో బీజేపీ సఫలమైంది.
తాజాగా బిహార్‌లో జె.డి. (యు.), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొన సాగుతున్న స్థితిలోనే జె.డి.(యు.)ను చీల్చడానికి బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రమాదాన్ని గ్రహించిన బిహార్‌ ముఖ్యమంత్రి బీజేపీని వదిలించుకున్నారు. అమాంతం తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) తో పొత్తు కూడి బీజేపీని దిగ్భ్రాంత పరచడంతో పాటు తన పదవిని నిలబెట్టుకున్నారు. నితీశ్‌ది అవకాశ వాదం అన్న విమ ర్శలు వినిపించాయి. అయితే ఆయన నిజాయితీని శంకించలేం. అవినీతి ఆరోపణలూ తక్కువే. పరిపాలానుభవం ఉన్న వాడు అన్న పేరు ఉంది. భాగ స్వామ్య పక్షాలను మార్చడం నితీశ్‌కు కొత్త కాదు. నితీశ్‌ బీజేపీని వదిలించు కోవడంవల్ల మళ్లీ ప్రతిపక్ష ఐక్యతా యత్నాలకు కొత్త చిగుళ్లు తొడిగాయి. నితీశ్‌ సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి వచ్చినవారు. సోషలిస్టు నేపథ్యం ఉన్న ఆర్‌.జె.డి. తో కలవడంతో నితీశ్‌ ఇప్పుడు సైద్ధాంతిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న భావన కలిగింది. ఒకప్పుడు నితీశ్‌ ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్రంగా ఉండడమే కాకుండా ప్రతిపక్షాలకు అధికారమే దక్కితే ఆయనే ప్రధాని అన్న మాట వినిపించేది. ప్రతిపక్షాలను ఏకం చేయడానికి మమతా బెనర్జీ, కె.చంద్ర శేఖర్‌ రావు లాంటి వారు ప్రయత్నాలు చేసినా ఆధిపత్యం తమకే దక్కాలన్న రీతిలో ప్రవర్తించారు. బీజేపీయేతర పక్షాలలో చాలా వాటికి కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం కిట్టదు. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఈ పక్షాలకు ప్రధాన ప్రత్యర్థి కావడమే దీనికి కారణం. ఆయినా కాంగ్రెస్‌ను మినహాయించే ప్రతిపక్ష ఐక్యత అసంపూర్ణం. నితీశ్‌ తాజా వైఖరి బిహార్‌ రాజకీయాలనే కాక మొత్తం దేశ రాజకీయాలనే మలుపు తిప్పుతుందన్న ఆశ ఉంది. వామపక్షాలతో సహా ఏడు రాజకీయ పార్టీల కూటమి ఇప్పుడు బిహార్‌లో అధికారంలో ఉంది. బీజేపీ ఒంటరిగా మిగిలి పోయింది. వామపక్షాల బలం తగ్గినందువల్ల కొంతకాలంగా వాటిని ప్రస్తావించిన సందర్భమే కనిపించలేదు. బిహార్‌ పరిణామాల నేపథ్యంలో వామపక్షాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితిలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అవసరం. అన్నింటికన్నా మించి ప్రతిపక్ష కూటమిలో వామపక్షాలు క్రియాశీలంగా ఉంటే నిర్దిష్టమైన సైద్ధాంతిక పునాది సమకూరుతుంది. నికరమైన ఉమ్మడి కార్యాచరణ రూపొందించడంలోనూ వామపక్షాలు కీలక పాత్ర పోషించగలవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img