Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అమృతం ఎవరికి దక్కింది?

కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కాలెండర్లో పేజీలు ప్రతి సంవత్సరం నియమబద్ధంగా మారుతూనే ఉంటాయి. ఏళ్లు గడు స్తూనే ఉంటాయి. కానీ కొన్ని రోజులు మనం గుర్తుంచుకోవలసి నవిగా, వేడుకలు జరుపాల్సినవిగా ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే ఆగస్టు పదిహేను పర్వదినమే. దేశం వలసవాద సంకెళ్లు తెంచుకుని 74 ఏళ్లు నిండాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమృతోత్స వంగా జరుపుకుంటున్నాం. హర్‌ ఘర్‌ తిరంగా అని మోదీ ప్రభుత్వం ఎక్కడలేని హడావుడి చేస్తోంది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరడానికి మూడు రోజులు నిర్దేశించింది. కోట్లాది పతాకాలు సిద్ధం చేసే శక్తి లేనందువల్ల చైనాలో కొన్ని పతాకాలు సిద్ధం చేయించారు. భారత్‌లో తయారీ అన్న మోదీ నినాదం ఒక్క దెబ్బతో మాయమైంది. బ్రిటిష్‌ వలస పాలకులు మన వనరుల్ని దోచుకెళ్లి ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేసిన నేపథ్యంలో నవ భారత నిర్మాణానికి యథా శక్తి ప్రయత్నం చేశాం. చాలా విజయాలే సాధించాం. అంతరిక్ష రంగంలో అయితే అగ్రరాజ్యాల సరసన నిలిచాం. బ్రిటిష్‌ సంకెళ్లు తెంచుకున్న తరవాత దేశ జనాభా అంతటికీ ఎలాంటి తేడాలు లేకుండా పౌరసత్వం వచ్చింది. సర్వ సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడకుండా చూసే బాధ్యత రాజ్యవ్యవస్థదే అని రాసుకున్నాం. స్వతంత్ర భారత పౌరులు తమ బతుకు మెరుగు పడ్తుందని కలలు కన్నారు. మౌలిక అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యం క్రమంగానైనా సమకూరుతాయనుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం ఒక్కో రాయి పేర్చి మహాసౌధం సిద్ధం కావడమూ చూశాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే వైరుధ్యాలను, బలహీనతలను, ప్రలోభాలను చూశాం. చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించుకున్నాం. బ్యాంకులు నడిచేది ప్రజల డబ్బుతో కనక వాటి సదుపాయం జన సామాన్యానికి దక్కేట్టు చేయడానికి బ్యాంకులను జాతీయం చేశాం. ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. అయినా అన్నమో రామచంద్ర అంటున్న వారు ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నారు. అర్థాకలితో గుక్కెడు మంచి నీళ్లు తాగి బలవంతాన నిద్రలోకి జారుకునే వారి సంఖ్యా కోట్లల్లోనే ఉంది. తినడానికి తిండి లేని వారి సంఖ్య తగ్గినా పోషకాహార లోపంతో తీసుకుంటున్నవారి సంఖ్య తగ్గించడంలో కాళ్లీడుస్తూనే ఉన్నాం. ఈ 75 ఏళ్ల కాలంలో జనానికి అందే ఆహార ధాన్యాలలో పెరుగుదల నేలబారుగానే ఉంది. 1961 నుంచి ఇప్పటి దాకా చూసినా ఆహార ధాన్యాల అందుబాటు పెరిగింది కేవలం 3.3 శాతమే. పప్పుధాన్యాల అందుబాటు అయితే పది శాతం తగ్గింది. 1951 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 36.1 కోట్లు. అప్పుడు అక్షరాస్యత 18.33 శాతం. ఇప్పుడు 70.19 కాగా ఆ సమయంలో సగటు ఆయుఃప్రమాణం 32 ఏళ్లు. ప్రతి వెయ్యి జననాలకు 145.6 శిశు జననాలు. లక్ష మంది ప్రసవిస్తే 2000 మంది ప్రసవంలోనే కడతేరేవారు. అప్పటికి దేశంలో ఉన్న డాక్టర్లు 50,000 మందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 725 మాత్రమే. రెండు నెలల కింద విడుదలైన మానవాభివృద్ధి నివేదికలో మనం దయనీయంగా 131 వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలో ఆకలిగొన్న వారిలో 25 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. అయిదేళ్ల లోపు పిల్లల్లో 44 శాతం మంది వారి వయసుకు తగ్గ బరువు లేరు. అంటే పోషకాహారం లేదనే. శిశువుల్లో 72 శాతం మంది, మహిళల్లో 52 శాతం మంది రక్తలేమి తోనే బతుకీడుస్తున్నారు. 1946లోనే జోసెఫ్‌ భోరే కమిటీ డబ్బు లేక వైద్య సహాయం అందకుండా ఉండగూడదని, ఆరోగ్యానికి అభివృద్ధికి విడదీయ రాని లంకె ఉందని చెప్పింది. అంటే పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పోషకాహారం, ఉపాధి అవకాశాలు సమకూరితే తప్ప ప్రజారోగ్యం మెరుగు పడదు. ఈ విషయంలో మనం వేసింది బుల్లి బుల్లి అడుగులే. ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసమే నెహ్రూ హయాంలో వైద్యం ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఔషధాలు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వ రంగంలో ఐ.డి.పి.ఎల్‌. లాంటి సంస్థలను 1961లో నెలకొల్పారు. అలాంటివి కాస్తా ప్రైవేటీకరణ వరదలో కొట్టుకు పోయాయి. స్వాతంత్య్రం వచ్చినప్పుడు 20 వైద్య కళాశాలలే ఉన్నా అందులో ఒక్కటి మాత్రమే ప్రైవేటు రంగంలో ఉండేది. ఇప్పుడు 612 వైద్య కళాశాలలు ఉంటే అం దులో 299 ప్రైవేటువే. ప్రైవేటు వైద్య విద్య పేదలకు, దిగువ మధ్యతరగతి వారికి అందని ద్రాక్షేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పరిస్థితి తిరగబడిరది. వైద్యంతో పాటు, వైద్య విద్యా అంగడి సరుకైపోయింది. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరం 6.3 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటున్నారు. వైద్య చికిత్సకు మన దేశం పెట్టింది పేరుగా ఉన్నా అది పేదలకు అందేది కాదు. ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయం అందేది 50 కోట్ల మందికే. మిగతా 90 కోట్ల మంది తమ దారి తాము చూసుకోవ లసిందే. ఆయుష్మాన్‌ భారత్‌ ఆసుపత్రుల్లో చేరే వారికే తప్ప వైద్యులను సంప్రదించడానికి వర్తించదు. ఆరోగ్య రంగానికి ప్రభుత్వం వెచ్చిస్తున్నది స్థూల జాతీయోత్పత్తిలో నామమాత్రంగా ఒక్క శాతమే. 15వ ఆర్థిక సంఘం నియమించిన ఉన్నతాధికార సంఘం 2019లో ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా ఉండాలని సిఫార్సు చేసింది. పట్టించుకునే నాథుడేడి? ఆరు నుంచి పధ్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఉచిత, నిర్బంధ విద్య గరపాలని నిర్దేశించుకున్నాం. దానికి పదిహేనళ్ల గడువూ పెట్టుకున్నాం. దశాబ్దాలు గడిచినా లక్ష్యానికి అనేక యోజనాల దూరంలో ఉన్నాం. అక్షరాస్యుల సంఖ్య ఇప్పటికీ 77.7 శాతం దాటలేదు.
స్వాతంత్య్రం కేవలం రాజకీయ స్వేచ్ఛ అన్న మాయలో పడిపోయినట్టు న్నాం. రాజ్యాంగ పీఠికలో రాసుకున్న సామాజిక న్యాయం నినాదాలకు పరిమితమైతే ఆర్థిక స్వాతంత్య్రం గురించి పూర్తిగా మరిచి పోయాం. భూసంస్కరణలు అమలైంది చాలా కొద్ది రాష్ట్రాలలోనే. ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి. నిరుద్యోగ సేన పెరిగిపోతోంది. భావ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ స్వాతంత్య్రానికి గీటురాయి అన్న మాటెత్తితే దేశద్రోహులన్న ముద్ర పడిపోతోంది. స్వాతంత్య్రం ఎవరో ఇచ్చేది కాదని, దాన్ని సాధించు కోవడంకన్నా పరిరక్షించుకోవడం ముఖ్యం అన్న వారు ఆందోళన జీవుల కింద జమపడి పోతున్నారు. నియంతృత్వ మేఘాలు ఆవరిస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీ విధించకుండానే అంతకన్నా భయంకరమైన నిరంకుశత్వం కొనసాగుతోంది. మన రాజ్యాంగం సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని రాసింది. కానీ కాలదోషం పట్టిన భావజాలాన్ని పట్టుకు వేలాడుతున్న తిరోగాములు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. ‘‘ప్రతి భారతీయుడికి తలదాచు కోవడానికి గూడు/కడుపు నింపుకోవడానికి కూడు/ విద్య, వైద్య సౌకర్యాలు/ ఆత్మవంచనకు తావులేని మతాతీత వ్యవస్థ/ కులీనతకు తావులేని ఉదారవాదం/ ప్రతి మనిషిని సమానంగా గౌరవించే జాతీయవాదం/తండ్రీ! నా దేశాన్ని స్వేచ్ఛా స్వర్గంలోకి నడిపించు’’ అన్న రవీంద్రుడి గీతం ఇంకెంతకాలం ఆలపించాలో! క్షీర సాగర మథనంలో అమృతం దేవతల వశమైనట్టే మన స్వాతంత్య్రం కూడా సంపన్నుల, నిరంకుశుల పాలవుతున్నట్టు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img