Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

కర్ణాటకలో విద్య కాషాయీకరణ జోరు

వేగంగా స్కూలు సిలబస్‌లో మార్పులు ` చరిత్ర వక్రీకరణ
ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని శ్లాఘించేలా పాఠ్యాంశాలు
31న రాష్ట్రవ్యాప్త సమ్మెకు రచయితలు, విద్యార్థి, మహిళా సంఘాల పిలుపు

న్యూదిల్లీ : హిజాబ్‌, హలాల్‌, ముస్లిం వ్యాపారాలపై దాడుల తర్వాత కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణపై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించింది. పసిమనస్సుల్లో మతతత్వ విషబీజం నాటాలని చూస్తోంది. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలను వరుసబెట్టి సవరిస్తోంది. ఈ క్రమంలో విప్లవయోధుడు భగత్‌ సింగ్‌, మైసూర్‌ మహారాజు టిప్పుసుల్తాన్‌, లింగాయత్‌ సామాజిక సంస్కర్త బసవన్న, ద్రవిడ ఉద్యమకారుడు పెరియర్‌, సంస్కర్త నారాయణ గురు వంటి వారిపై పాఠ్యాంశాలను తొలగించడం లేదా కుదించడం జరిగింది. కన్నడ కవి కువెంపు గురించి వాస్తవాలనూ వక్రీకరించింది. పదవ తరగతి కన్నడ పుస్తకంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కేశవ్‌ బలిరాం హెగ్గేవార్‌ ప్రసంగాన్ని చేర్చింది. కర్ణాటక ప్రభుత్వ తాజా చర్యలను విద్యార్థి సంఘాలైన ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐతో పాటు మానవ బంధుత్వ వేదిక, జనవాది మహిళా సంఘం, దళిత సంఘాలు, న్యాయవాదులు, విద్యా నిపుణులు, సీనియర్‌ రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి మార్పులకు ముందు చర్చలు జరగాలని, అవి లేకుండా పాఠపుస్తకాల ముద్ర, సవరణ కుదరదని కాంగ్రెస్‌ నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ అన్నారు. హెగ్డేవార్‌, గోల్వార్కర్‌, నథురాం గాడ్సే వంటి వారిని తమ రాజకీయ ర్యాలీల్లో, ఓట్లు అడగడం కోసం బీజేపీని వాడుకోమనండిగానీ వ్యక్తిగత కారణాల కోసం విద్యను రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. కర్ణాటక విద్యా మంత్రి నగేశ్‌ మాత్రం తమ చర్యలను సమర్థించుకున్నారు. తాజా వివాదంపై ఆయన సోమవారం స్పందించారు. ‘ఈ వివాదం అనవసరం. తమను తాము మేధావులుగా, విద్యా నిపుణులుగా చెప్పుకునే వారు ఇదంతా చేస్తున్నారు. ‘నిజమైన చరిత్ర’ను పిల్లలకు అందిస్తున్నాం’ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలను గొప్పగా చూపి హిందూత్వ వాదాన్ని బలపర్చుకునేందుకు ఇదంతా చేస్తున్నారన్నది విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. 1947లో జరిగిన దేశ విభజనకు కాంగ్రెస్‌ను నిందిస్తూ బీజేపీ పాలిత హరియాణా సెకండరీ విద్య బోర్డు తొమ్మిదో తరగతి చరిత్ర పుస్తకాన్ని సవరించింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై సానుకూలత పెంచే ప్రయత్నం చేసింది. హెగ్గేవార్‌ను శ్లాఘించింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ ఏహెచ్‌ విశ్వనాథ్‌ సైతం ఈ సవరణలపై అభ్యంతరం తెలిపారు. విద్యను, రాజకీయ సిద్ధాంతాలను వేరుగా ఉంచాలన్నారు. తాము చేస్తున్నదే సరైనదని, నిజం ఏమిటో పిల్లలకు తెలియాలని మార్పులు`చేర్పులు చేస్తున్నామని నగేశ్‌ అన్నారు. టిప్పుసుల్తాన్‌పై పాఠ్యాంశాన్ని తొలగించలేదని, భగత్‌ సింగ్‌పై పాఠంశంలో మరిన్ని అంశాలను చేర్చామని, ఇతర స్వాతంత్ర యోధులు చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు వంటి వారి గురించీ మరిన్ని వివరాలు అందించామని చెప్పారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వ హయాంలో రామచంద్రప్ప నేతృత్వ రివిజన్‌ కమిటీ కొన్ని పాఠాంశాలను తొలగించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ‘చరిత్ర’ భారమవుతోందని టీచర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. సిలబస్‌ మొత్తం ఏడాదిలోగా పూర్తి కావడం లేదని వారన్నారు. అందుకే సామాజిక సంస్కర్త నారాయణ గురుపై అధ్యాయాన్ని తొలగించి కన్నడ పుస్తకంలో చేర్చాం, ఆరవ తరగతి పుస్తకాల్లో అది యథావిధిగా ఉందని అన్నారు. టిప్పుసుల్తాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా మైసూరు మహారాజాలకు సంబంధి కంటెంట్‌ గత పుస్తకాల్లో పెద్దగా లేదని చెప్పారు. హెగ్డేవార్‌ ప్రసంగాన్ని చేర్చడాన్ని సమర్థించుకున్నారు. రోడ్‌ మోడల్స్‌ (స్ఫూర్తిప్రదాతలు) గురించి ప్రసంగాన్నే చేర్చాం అని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్య రచయితలు, మేధావులకూ వామపక్ష, లౌకిక మేధావుల వలే రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయని మంత్రి నగేశ్‌ వ్యాఖ్యానించారు. నిరసన తెలిపితే తెలపండిగానీ ఈ కసరత్తు ఆగబోదన్నారు. దీంతో ఈనెల 31న రాష్ట్రవ్యాప్త సమ్మెకు రాజకీయ, రచయితల, విద్యార్థి, మహిళా సంఘాలతో పాటు ఎన్జీవోలు సిద్ధమయ్యాయి. విద్య కాషాయీకరణను అడ్డుకుంటామని తేల్చిచెప్పాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img