Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ అనంత బాబు ఘటనపై
సీబీఐ విచారణ చేయాలి

ఆయన శాసనమండలి సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించిన అఖిలపక్ష నేతలు
ఎమ్మెల్సీ నేర చరిత్రను వెలికితీయాలని కలెక్టర్‌కు వినతిపత్రం

విశాలాంధ్ర-కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసును సీబీఐతో విచారణ చేయించాలని, అతని శాసనమండలి సభ్యత్వం రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర అఖిలపక్ష నేతలు కె.రామకృష్ణ నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అక్కడ నుంచి గొల్లల మామిడాడ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఘటనతో పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకుండా పోయిందని, అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. సోమవారం కాకినాడలో జిల్లా ఎస్పీ పత్రికా సమావేశం వివరాలు విన్న తర్వాత ఈ ఘటన మొత్తాన్ని నీరుగార్చే ప్రమాదం ఏర్పడిరదన్నారు. జూన్‌ 2న చలో రాజ్‌ భవన్‌ వేలాది మంది దళితులతో నిర్వహించి, అనంత బాబు శాసన మండలి సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అధికారం చేతుల్లో ఉందని అహంకారంతో ఎమ్మెల్సీ విర్రవీగి డ్రైవర్‌ని హత్య చేశాడని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దళిత ఉద్యమ నాయకుడు కొరివి వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత బాబు ఘటనను సోనియాగాంధీ దృష్టికి తీసుకువెళతామని, దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడేలా ఎమ్మెల్సీ అనంత బాబు ప్రవర్తించాడని, అతనిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జె.వి.ప్రభాకర్‌, కె.సుబ్బారావు, పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చింతపల్లి అజేయ్‌ కుమార్‌, ఆర్పీఐ రాష్ట్ర కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, కాకినాడ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, సీపీ డిస్ట్రిక్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జి.లోవరత్నం, దళిత సంఘాల నాయకులు పల్లి కృష్ణ పాల్‌, ఏనుగుపల్లి కృష్ణ, అప్పారావు, డీహెచ్‌పీఎస్‌ నాయకులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img