Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

కేంద్రంపై ఐక్యపోరాటాలు

ప్రత్యేకహోదా, రాయలసీమ అభివృద్ధి ప్యాకేజీ ఏది?
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
కడప పాదయాత్రలో రామకృష్ణ విమర్శలు

కడప : మోదీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. మోదీ ప్రభుత్వ ఏడేళ్లపాలనలో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, దేశ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం- ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ చేపట్టిన పాదయాత్ర గురువారం కడపకు చేరుకుంది. రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశసంపదను కార్పొరేట్‌ కంపెనీలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో పేద, మధ్య తరగతి వర్గాలు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయినా పట్టించుకోలేదన్నారు. పెట్టుబడిదారుల ఆస్తులు మాత్రం పెరిగిపోయాయన్నారు. 50 కోట్ల మంది కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి 44 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా బీజేపీ ప్రభుత్వం మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ పేరిట ప్రభుత్వ ఆస్తులను కేంద్రం గంపగుత్తగా ప్రైవేటికరిస్తోం దని విమర్శించారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెరగడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష టీడీపీ పల్లెత్తు మాట అనడం లేదని, రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం విరుచుకుపడు తుందని, వైసీపీ ప్రభుత్వం ఇందుకు మినహాయి ంపేమా కాదని అన్నారు. మోదీ సర్కారుకు జగన్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోందని నిందించారు. బీజేపీ ఏడేళ్ల పాలనలో దేశంలో ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. 70 ఏళ్లుగా సంపాదించుకున్న ఆస్తులు, పరిశ్రమలను ప్రైవేటీకరిస్తోందని వివరించారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని, దీనివల్ల 18 వేలమంది పర్మినెంట్‌ ఉద్యోగుల ఉపాధి పోతోందన్నారు. అందులో ఐదు వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు ఉన్నారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలను మోదీ సర్కారు ధ్వంసం చేసిందన్నారు. సీపీఐ జన ఆందోళన్‌లో భాగంగా కడపలో పాదయాత్ర చేస్తున్నామన్నారు. బీజేపీ మతచిచ్చుతో ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నదన్నారు. సీఎం జగన్‌ కేంద్రం అడుగుజాడల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. ఉచిత విద్యుత్‌ను రద్దు చేసి మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాజన్నరాజ్యం అనడంలో అర్థమే లేదన్నారు.
డీజీపీ గౌతమ్‌ నవాంగ్‌ శాంతిభద్రతల పర్యవేక్షణలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల 27న 19 రాజకీయ పార్టీలు నిర్వహించే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేశు, పి.హరినాథరెడ్డి, ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌, జిల్లా కార్యదర్శి రామప్రసాద్‌, సంఘసేవకులు సలాఉద్దీన్‌, సామాజిక ఉద్యమనేత సంగటి మనోహర్‌, సీపీఐ నాయకులు పి.కృష్ణమూర్తి, ఎల్‌.నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, సుబ్రహ్మణ్యం, వెంకట శివ, బసీరున్నీసా, విజయలక్ష్మి, ఎంవి సుబ్బారెడ్డి, మద్దిలేటి, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. పాదయాత్ర ఉదయం 10 గంటలకు కడప వినాయక సర్కిల్‌ నుండి ప్రారంభమై వార్త సర్కిల్‌, చిలకల బావి, మట్టి పెద్దపులి, చెన్నూరు బస్టాండ్‌, వన్‌టౌన్‌ సర్కిల్‌, గోకుల్‌ సర్కిల్‌, కృష్ణ సర్కిల్‌, అన్నమయ్య సర్కిల్‌, అప్సర సర్కిల్‌, పాత బైపాస్‌ వరకు సాగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img