Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘పరిషత్‌’ ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్‌

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు తోసిపుచ్చిన హైకోర్టు ధర్మాసనం

అమరావతి : రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 8వ తేదీ జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. గురువారం ఉదయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీన ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా వారం రోజుల వ్యవధిలో ఏప్రిల్‌ 8వ తేదీన రాష్ట్రంలోని 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 10న కౌంటింగ్‌ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులతో వాయిదా పడిరది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని సింగిల్‌ బెంచ్‌ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టంచేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వుల మేరకే జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్‌ఈసీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎన్నికల కౌంటింగ్‌కు అనుమతిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓట్ల లెక్కింపుపై ఎస్‌ఈసీ కసరత్తు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు న్యాయపరమైన చిక్కులు తొలగడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి లెక్కింపు తేదీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించేందుకు సీఎస్‌, డీజీపీతో నీలం సాహ్ని సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img