Friday, April 26, 2024
Friday, April 26, 2024

కార్పొరేట్ల సేవలో మోదీ సర్కారు

ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం
భారత్‌బంద్‌కు జగన్‌, కేసీఆర్‌ మద్దతివ్వాలి : నారాయణ

విశాలాంధ్ర`శ్రీకాకుళం : మోదీ సర్కారు ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్‌లకు విక్రయిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే లక్ష్యంగా ఏడేళ్లుగా మోదీ పాలన సాగుతోందని ఆగ్రహం వెలిబుచ్చారు. జాతి సంపదను ఇష్టానుసారం విక్రయి స్తున్న మోదీ ప్రధానిగా అనర్హుడని నారాయణ అన్నారు. సీపీఐ జనఆందోళన్‌లో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు అధ్యక్షతన సభ జరిగింది. నారాయణ మాట్లాడుతూ లక్ష కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను వేల కోట్లకే అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. ప్రైవేట్‌ టెలికాం రంగ సంస్థలకు లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిన మోదీ సర్కారు… బీఎస్‌ఎ న్‌ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థకు కనీసం రూ.39 వేల కోట్ల బకాయి ఇవ్వలేకపోయిందని నారాయణ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రైవేటుపరం చేస్తున్నా రన్నారు. ప్రైవేటు ఆపరేటర్లకు 4జి, 5జి టెక్నాలజీకి అనుమతులిచ్చిన మోదీ సర్కారు…బీఎస్‌ఎన్‌ఎల్‌కి 3జి వరకే పరిమితమైందని వివరించారు. రూ.10వేల కోట్లకు పైగా రుణాలు పొందిన వారు 28 మంది ఉంటే, అందులో విజయ్‌ మాల్య తప్ప, మిగిలిన వారంతా మోదీ శిష్యులేనని నారాయణ చెప్పారు. దేశంలో 100 ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామన్న మోదీ…ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎందుకు అమ్ముతున్నారని సూటిగా ప్రశ్నించారు. అంబానీ, అదానీ చేతుల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉండేలా మోదీ అడుగులు వేస్తున్నారన్నారు. పెగాసెస్‌ ద్వారా ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని మోదీ తస్కరిస్తున్నారని, దీనిపై సుప్రీంకోర్టు మోదీకి అక్షింతలు వేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం మోదీ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. మోదీ విధానాలపై ఐక్యపోరాటాలు అవశ్యమన్నారు. రైతు వ్యతిరేక మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని, రైతుసంఘాలు చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 27న రైతులు తలపెట్టిన భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. బంద్‌కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నష్టాల సాకుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్న మోదీ సర్కారు దుర్మార్గపు ఆలోచనను తూర్పారబట్టారు. లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం సరైన నిర్ణయం కాదని, ఈ నిర్ణయాన్ని ప్రభు త్వం ఉపసంహరించుకునేంత వరకు పోరాటం ఆగదన్నారు. మోదీ మతోన్మాద ంతో పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనలో అన్ని రంగాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ఇదే ఫాసిస్టు పాలన కొనసాగితే దేశ ఆర్థికవ్యవస్థకు, భావితరాల భవిష్యత్‌కు పెనుప్రమాదం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జల్లి విల్సన్‌ మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అన్నదాత అని, అన్నదాతను కుదేలు చేయడానికి మోదీ సర్కారు మూడు సాగు చట్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. వ్యవసాయరం గాన్ని కార్పొరేటీకరణ చేయడంలో భాగంగానే మూడు వినాశకర చట్టాలు తీసుకొచ్చిందని దునుమాడారు. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు దిల్లీలో 270రోజులకు పైగా అలుపెరుగని పోరాటం చేస్తున్నాయని,ఆ పోరాటం దేశచరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్‌బాబు, ఐజేయూ నాయకులు నల్లి ధర్మారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురుగుబెల్లి రాజేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిక్కాల గోవిందరావు, పట్టా ప్రభావతి, బలగ శ్రీరామ్మూర్తి, నాయకులు అల్లుబోయిన అప్పలనాయుడు, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు అనపాన షణ్ముఖరావు, డీహెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు యడ్ల గోపి, ఆదివాసీ సంఘం నాయకులు కూరంగి మన్మథరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img