Monday, September 26, 2022
Monday, September 26, 2022

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో పరిషత్‌ ఓట్ల లెక్కింపు
42,360 మంది ఉద్యోగులు కేటాయింపు
రెండు టీకాలు తీసుకున్న సిబ్బంది, ఏజెంట్లకే అనుమతి
లెక్కింపు కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు
సుదీర్ఘకాలం పడిగాపులనంతరం తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

అమరావతి : గతంలో ఎప్పుడూ, ఎన్నడూ లేనివిధంగా అనేక అవాంతరాలు, కోర్టు కేసులు, ఎన్నికల కమిషనర్ల మార్పులు, వివాదాలతో దాదాపు 17 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు ఎట్టకేలకు ఆదివారంతో తెరపడబోతోంది. మరోపక్క ఇంతకాలం ఫలితాల కోసం పడిగాపులు కాస్తున్న అభ్యర్థుల భవితవ్యం కూడా తేలబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్‌ జారీ సమయంలో 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోగా, తొలుత గత ఏడాది మార్చి 7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9,672 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, రికార్డు స్థాయిలో 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రాష్ట్రంలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా, ఇందులో నోటిఫికేషన్‌ జారీ సమయంలో 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ఆ సందర్భంగా జరిగిన అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఇదే సమయంలో కరోనా వ్యాప్తి కారణంతో నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేశారు. దానిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం

వ్యక్తం చేయడం, తర్వాత నిమ్మగడ్డను తొలగించి, ఆ స్థానంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించారు. అయితే నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించి మరలా బాధ్యతలు స్వీకరించారు. ఈలోగా కరోనా విజృంభణ, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 31న ఆయన రిటైర్‌ కావడం వంటి వరుస అవాంతరాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. చివరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ అదే రోజు నోటిఫికేషన్‌ జారీ చేసి ఏప్రిల్‌ 8న ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్యకాలంలో దాదాపు 81 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఎట్టకేలకు ఏప్రిల్‌ 8న 7,220 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 18,782 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 2,058 అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే లెక్కింపు ప్రక్రియ కూడా అనేక వివాదాల నేపథ్యంలో వాయిదాలు పడుతూ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ, నిర్వహణ నిబంధనల ప్రకారం జరగలేదని కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో పోలింగ్‌ పూర్తయిన తర్వాత న్యాయస్థానం లెక్కింపును నిలిపివేసింది. దానిపై ప్రభుత్వం మరలా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించగా, ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విధంగా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు దాదాపు ఏడాది కాలం పట్టగా, ఓట్ల లెక్కింపునకు మరో ఐదు నెలల సమయం పట్టింది. ఎట్టకేలకు పరిషత్‌ అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలబోతోంది.
కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో భారీ బందోబస్తు
కౌంటింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించడంతోపాటు ఫలితాల వెల్లడి తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా కోవిడ్‌ టీకా రెండు డోసులు వేయించుకున్నవారికే అనుమతి ఇచ్చారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీ టీవీలతో నిఘా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో 24 గంటలూ పని చేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.
ఏకకాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు లెక్కింపు
ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓట్లను ఏకకాలంలో లెక్కింపు చేపడతారు. సగం టేబుల్స్‌లో ఎంపీటీసీ, మరో సగం టేబుల్స్‌లో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 42,360 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img