Monday, April 22, 2024
Monday, April 22, 2024

చంద్రబాబు నివాసం వద్ద బాహాబాహి

వైసీపీ ధర్నాతో ఉద్రిక్తత
రెండు వర్గాల మధ్య తోపులాట.. రాళ్లు, కర్రలతో ఘర్షణ
సొమ్మసిల్లిన బుద్దా, జోగి కారు ధ్వంసం
లాఠీచార్జి చేసిన పోలీసులు.. జోగి రమేష్‌ అరెస్టు
డీజీపీ ఆఫీస్‌ వద్ద టీడీపీ ధర్నా

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు మాజీ స్పీకర్‌ కోడెల వర్థంతి సందర్భంగా సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ నేతలు చంద్రబాబు నివాసం వద్ద చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పెద్దసంఖ్యలో తన అనుచరులతో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు చేరుకు న్నారు. ఈ విషయం జోగి ముందే ప్రకటించినప్పటికీ పోలీసులు ముందు జాగ్రత్తగా ఆయనను అక్కడకు రాకుండా నిలు వరించలేదు. అక్కడకు వచ్చిన తర్వాత కూడా పోలీసుల సమక్షంలో చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారికి ఎదురుగా దూసుకు రావడంతో రెండు వర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. వైసీపీ ఆందోళన సమాచారం తెలుసుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌, బుద్దా వెంకన్న, పట్టాభి తదితరులు కార్యకర్తలతో అక్కడకు హూటాహుటిన చేరుకున్నారు. ఇదేం పద్ధతి అంటూ వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వైసీపీ నేతలు ప్రతిఘటించారు. ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకొని, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రాళ్లదాడిలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సృహతప్పి పడిపోయారు. ఘర్షణలో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు జంగాల సాంబశివరావుకు తలకు, కాలికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాల వారిని చెదర గొట్టారు. జోగి రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడ నుంచి తరలించారు. తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మంగళగిరి డీజీపీ కార్యాల యంలో ఫిర్యాదు చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మాత్రం లోపలకు ఆహ్వానించారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు జులుం నశించాలి, డీజీపీ పక్షపాత వైఖరి నశించాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. డీజీపీ కార్యాలయంలోకి వెళ్లడానికి ఎందుకు అనుమతివ్వరంటూ నిలదీశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దాదాపు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తామని 24 గంటల ముందు ట్విట్టర్‌, వాట్సాప్‌లో ఓ ఎమ్మెల్యే ప్రకటించి కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో దాడి తెగబడితే పోలీసుల ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని టీడీపీ నేతలు ఆరోపించారు. డీజీపీ దగ్గరుండి వైసీపీ నేతలను చంద్రబాబు ఇంటికి పంపారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ పోలీసులే వైసీపీ నేతలను ప్రోత్సహిస్తున్నారని, బుద్దా వెంకన్నను కింద పడేసి కొట్టారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు తమపై దాడి చేసి కొట్టారని, జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. జోగి రమేష్‌ను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img