Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ధరల మోత

పాలు… గ్యాస్‌ నుంచి పన్నుల వరకు
విద్యుత్‌ చార్జీలు… వైద్యం ఖర్చులదీ అదే దారి
పేద, మధ్యతరగతిపై భారం

న్యూదిల్లీ : దేశంలో ధరల మోత మోగుతోంది. పాలు నుంచి వంట గ్యాస్‌ వరకు… పన్నుల నుంచి వైద్య ఖర్చుల వరకు అన్ని వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయాలు లేకపోవడంతో నెల నెలా భారం పెరుగుతూనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు ఇంటి అద్దెలు, విద్యుత్‌ చార్జీలు, సొంతిల్లు కలిగిన వారికి ఆస్తి పన్నులు, విద్య, వైద్యంలో పెరిగిన ఖర్చులు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర ధరలతో అన్ని తరగతుల ప్రజలు కుదేలవుతున్నారు. కుటుంబ పోషణ కోసమే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉల్లిపాయలు కిలో రూ.30, టమోటా రూ.40, మిర్చి రూ.60, బెండకాయలు రూ.60 ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఇంటికి రోజుకు కేవలం కూరగాయలకే రూ.100లకు పైగా ఖర్చవుతోంది. వీటితో పాటు వంట నూనె లీటరు రూ.170 నుంచి రూ.190 వరకూ పెరిగింది. మేలు రకం బియ్యం కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ ఉంటుంది. కందిపప్పు, మినపప్పు, పెసర పప్పులదీ అదే దారే. కీలకమైన వంట గ్యాస్‌ ధరను ప్రజలు భరించలేనంతగా మోదీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం గ్యాస్‌ రీఫిల్‌ సిలిండర్‌ ధర రూ.1,152 అయింది. డెలివరీ ఖర్చుతో కలుపుకుంటే రూ.1,200 అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.112, రూ.100 నుంచి దిగువకు రాని పరిస్థితి ఉంది. అలాగే ఆస్పత్రి ఖర్చులు అధికంగానే ఉన్నాయి. మందులు కొనాలంటేనే గుండె దడదడలాడిపోతోంది. షుగర్‌, బీపీలకు సంబంధించిన మందుల ధరలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. యాంటి బయాటిక్స్‌ మందుల ధరలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఇక విద్యుత్‌ చార్జీలను ఎడాపెడా పెంచేస్తున్నారు. కస్టమర్‌, ఫిక్సడ్‌, ఓవర్‌లోడ్‌, ట్రూ అప్‌ చార్జీల పేరుతో రెండు నెలలకోసారి ఏదో ఒక రూపంలో భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులే కాదు ప్రభుత్వంలో పనిచేసే చిరుద్యోగుల జీవన ప్రమాణాలు ఇటీవల కాలంలో దారుణంగా తయారయ్యాయి. ప్రతినెలా కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండటంతో ఇటీవల ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ధరల నియంత్రణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img