Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రపంచ శాంతి కోసం కృషి చేద్దాం

. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో కూటమి జోక్యం తగదు
. శాంతి సంఘం జాతీయ మహాసభల్లో వక్తల ఉద్ఘాటన

(చండీగఢ్‌ నుంచి మోతుకూరి అరుణకుమార్‌)
ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని అణచివేసి…శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని, అణుయుద్ధం వస్తే మానవ వినాశనం తప్పదని అంతర్జాతీయ శాంతి సంఫీుభావ సంఘం అధ్యక్షుడు పల్లబ్‌సేన్‌ గుప్త చెప్పారు. రష్యా`ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధానికి సామ్రాజ్యవాద నాటో దేశాలు మరింత ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. అఖిలభారత శాంతి సంఫీుభావ సంఘం (అయిప్సో) జాతీయ మహాసభలు చండీగఢ్‌లోని స్థానిక పంజాబ్‌, హరియాణా బార్‌ కౌన్సిల్‌ భవన్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులు జరిగే ఈ సభల్లో అంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ, పంజాబ్‌, హరియాణా, బీహార్‌, ఒడిశా, త్రిపుర, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మహాసభల ప్రారంభ సూచికగా సభా ప్రాంగణం వద్ద జాతీయ పతాకాన్ని ఆహ్వానసంఘం చైర్మన్‌ ప్రొఫెసర్‌ హెచ్‌ఎస్‌ సిద్ధు, అయిప్సో పతాకాన్ని పల్లబ్‌సేన్‌ గుప్త ఎగురవేశారు. మహాసభను పంజాబ్‌ హరియాణా రాష్ట్రాల హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌ఎస్‌ చీమా లాంఛనంగా ప్రారంభించారు. వియత్నాం, క్యుబా, అమెరికా, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల నుండి శాంతి ఉద్యమ నాయకులు పాల్గొని సౌహార్థ సందేశం ఇచ్చారు. పల్లబ్‌సేన్‌ గుప్త మాట్లాడుతూ సోషలిస్టు, కమ్యూనిస్టు దేశాలపై అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాల ఆంక్షలు, చిన్న దేశాలు, ఇస్లామిక్‌ దేశాలపై దాడులు సాగిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. సిద్ధూ, చీమా ప్రసంగిస్తూ జాతీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న సామ్రాజ్యవాదం, ఫాసిజం, మతోన్మాదం, ఆర్థిక సంక్షోభం, పర్యావరణ సమతుల్యత లోపించడం నేపథ్యంలో శాంతి ఉద్యమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. దేశ స్వాతంత్య్రం, రెండవ ప్రపంచ యుద్ధం, హిరోషిమా`నాగసాకిపై అణుదాడుల తర్వాత ప్రపంచ దేశాల మధ్య శాంతి, ఐక్యత కోసం 1951లో ఆలిండియా పీస్‌ కౌన్సిల్‌ ఏర్పడి 1972 నుండి అఖిల భారత శాంతి సంఫీుభావ సంఘంగా రూపాంతరం చెందిందని, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా విశాల దృక్పథంతో సంఘం పనిచేస్తోందని వివరించారు. సైఫుధీన్‌, మాళవీయ, అరుణ అసఫాలీ, పండిట్‌ సుందర్‌ లాల్‌, అజయ్‌ ఘోష్‌, ఏకే గోపాలన్‌, డీడీ కోశాంబి, పృథ్విరాజ్‌ కపూర్‌, కిషన్‌ చందర్‌, ముల్క్‌రాజ్‌ ఆనంద్‌, వీకే కృష్ణ మీనన్‌ వంటి అనేకమంది ఈ సంఘానికి నాయకత్వం వహించారని నాయకులు గుర్తు చేశారు.
పంజాబ్‌ సంప్రదాయంలో ప్రదర్శించిన నృత్యం సభికుల్ని అలరించింది. మధ్యాహ్నం జరిగిన ప్రతినిధుల సభలో శాంతి ఉద్యమం, ప్రగతిశీల ఉద్యమంలో సేవలందించి మరణించిన వారికి శాంతి సంఘం జాతీయ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ సంతాప తీర్మానం ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ అజెండా అమలు చేస్తోందని, విద్యారంగంలో పురాణం, జ్యోతిష్యం ప్రవేశపెట్టి పూర్తిగా కాషాయీకరణ చేస్తోందని విమర్శించారు. సాయంత్రం పంజాబ్‌లో నాటి, నేటి పరిస్థితులపై సదస్సు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహాసభలో అయిప్సో జాతీయ కమిటీ సభ్యులు సుధాకర్‌, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి సంఘం రాష్ట్ర కన్వీనర్లు మహంకాళి సుబ్బారావు, ఎన్‌.సతీష్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు ఆర్‌.పిచ్చయ్య, మోతుకూరి అరుణకుమార్‌, ఇమామ్‌, ఎం.సాయి కుమార్‌ ప్రతినిధులుగా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img