Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

నడిరోడ్డుపై ‘పద్మశ్రీ’

ప్రభుత్వ వసతి ఖాళీ చేయించిన కేంద్రం
న్యూదిల్లీ: గడువు పూర్తయినా.. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటోన్న 90 ఏళ్ల ఒడిస్సీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీతను హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి కళాకారులంటే గౌరవం లేదని నృత్యకారుడి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రముఖ నృత్యకారుడు గురు మయధర్‌ రౌత్‌ కొన్నేళ్లుగా దిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖ కళాకారులకు చాలా ఏళ్ల క్రితమే ఈ వసతులు కేటాయించగా.. 2014లో వీటిని రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేదు. వీరిలో చాలామంది తమ బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన వారు ఏప్రిల్‌ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయధర్‌ రౌత్‌ వెళ్లకపోవడంతో అధికారులే స్వయంగా వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా వీధిలో పెట్టడంతో ఆ వృద్ధ కళాకారుడు నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై కన్పించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. దీంతో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై మయధర్‌ కుమార్తె మధుమితా రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేయించడం చట్టపరంగా సరైందే అయినప్పటికీ అధికారులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. కళాకారుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేదని దుయ్యబట్టారు. ‘‘ఖాళీ చేయించడాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ, ఇందుకు వారు ప్రవర్తించిన తీరు అమానవీయం. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంటిబెల్‌ మోగింది. అప్పుడు నేను మా నాన్నకు భోజనం పెడుతున్నాను. అధికారులు వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపొమ్మన్నారు. రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు. ఆ వెంటనే పోలీసులు, కూలీలు వచ్చారు. చూస్తుండగానే మా సామాన్లన్నీ వీధిలో పెట్టారు. ఇదంతా చూసి మా నాన్న షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మా నాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన ఆయనకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?’’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఇళ్లు ఖాళీ చేయని మరో 8 మంది కళాకారులకు మే 2 వరకు గడువు ఇచ్చినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వీరందరికీ పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. తాము బంగళాలను ఖాళీచేసే పనిలోనే ఉన్నామని, అయితే కొంత సమయం కావాలని వారు కోరినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img