Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పేదలకు ఆరోగ్య భాగ్యం

. ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 వైద్యచికిత్సలు
. వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం జగన్‌ నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో పేదలకు కొండంత అండగా ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొత్తగా 809 వైద్య చికిత్సలను అందించనున్నట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు… ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని, బకాయిలు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల్లో సైతం నమ్మకం, విశ్వాసం పెరిగిందని, తద్వారా లబ్ధిదారులకు మెరుగైన వైద్యసేవలందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్‌, విలేజ్‌ క్లినిక్స్‌, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్‌ కూడా ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల వివరాలు, అందుతున్న సేవల వివరాలు కూడా ఇందులో ఉంచుతున్నామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవా అవార్డు లు ఇస్తామని తెలిపారు. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059 కాగా, జనవరి 2020లో 2059కి పెంచుతూ, వైద్యం ఖర్చు వేయి రూపాయల ఖర్చుకు పైబడ్డ చికిత్స లను ఆరోగ్యశ్రీలో చేర్చామని, ఆ తర్వాత జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం తీసుకు న్నామని సీఎం గుర్తు చేశారు. అదనంగా చేర్చిన వాటిలో 54 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్లుండగా, నవంబర్‌ 2020లో 2436కి పెంచిన వాటిలో బోన్‌ మ్యారోతోపాటు 235 ప్రొసీజర్లున్నట్లు తెలిపారు. జూన్‌ 2021లో వాటిని మరలా 2446కు పెంపు చేయగా, ప్రస్తుతం చికిత్సల సంఖ్యను 3255కు పెంచినట్లు సీఎం వెల్లడిరచారు. వీటివల్ల సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2,894.87 కోట్లు ఖర్చు అవుతుండగా, ఆరోగ్య ఆసరా కోసం మరో రూ.300 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే ఆరోగ్యంపై మూడు రెట్లు అధికంగా ఖర్చు పెడుతున్నామని, పేదల ఆరోగ్యంపై వైసీపీ ప్రభు త్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని సీఎం అన్నారు. గత మూడేళ్లలో వైద్యరంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చామ న్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు 46వేల పోస్టులను భర్తీ చేశామని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, విలేజ్‌ క్లినిక్స్‌, నాడు`నేడుతో చేపట్టిన సమూల మార్పులను సీఎం వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్‌, ఏపీ వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్‌ హరీంద్ర ప్రసాద్‌, వైద్య ఆరోగ్యశాఖ డీజీ(డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img