Monday, June 5, 2023
Monday, June 5, 2023

ప్రభుత్వం దిగిరాకుంటే… చలో విజయవాడ

. మలి దశ ఉద్యమ కార్యాచరణ
. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
. 29 వరకు దశల వారీ కార్యాచరణ
. ఏపీ జేఏసీ అమరావతి సమావేశం కీలక నిర్ణయం
. ఉద్యోగులపై సర్కారు వివక్ష : బొప్పరాజు, దామోదరరావు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై జగన్‌ ప్రభుత్వం దిగిరావాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి చలో విజయవాడకు శ్రీకారం చుడతామని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్‌ చైర్మన్‌ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్ణం నాయుడు, అన్ని జిల్లాల అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం సమావేశ నిర్ణయాలను మీడియాకు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు వెల్లడిరచారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వం స్పందించనందున… బుధవారం (ఈనెల 5వ తేదీ) నుంచి 29 వరకు రెండో దశ ఉద్యమ కార్యాచరణకు దిగామని, ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కొనసాగిస్తారని వెల్లడిరచారు. అప్పటికీ స్పందించకుంటే… మూడో దశ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగించాలని సమావేశం నిర్ణయించందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వానికి ఉద్యోగుల అందరి మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే మలిదశ ఉద్యమ కార్యాచరణకు ప్రధాన కారణమన్నారు. తమ డిమాండ్లు సాధించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, 11వ పీఆర్సీ ప్రతిపాదించిన పే స్కేళ్లను బయట పెట్టాలన్నారు. పెండిరగ్‌లో ఉన్న నాలుగు డీఏల, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, మూడు కొత్త డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 12వ పే రివిజన్‌ కమిషన్‌ నియమించాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఈహెచ్‌ఎస్‌ ద్వారా క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ అమలు చేయాలని, కొత్త జిల్లా కేంద్రాలన్నిటిలోనూ 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ఏపీ జేఏసీ అమరావతి మలిదశ ఉద్యమ కార్యాచరణ ఇలా…
అ ఈనెల 5 నుంచి 29 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు
అ 8వ తేదీ నుంచి అన్ని ముఖ్యమైన కూడళ్లలో నల్ల కండువాలు ధరించి డిమాండ్ల పోస్టర్లు విడుదల
అ 10న అన్ని జిల్లాల్లోని స్పందనలో నల్ల మాస్కులు ధరించి ‘జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత
అ 11న ఒక్కరోజు సెల్‌ ఫోన్‌ డౌన్‌ నిర్వహణ
అ 12న 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వారి సమస్యలపై ధర్నా
అ 15న మరణించిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శ
అ 18న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ధర్నాలు
అ 20వ తేదీన ఉద్యోగుల వేతనాలు 1వ తేదీన రానందుకు నిరసనగా ఇఎంఐ చెల్లింపులపై ఒత్తిడి తేవద్దని, అపరాధ రుసుం వేయవద్దని బ్యాంకుల సందర్శన
అ 25న అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యపై ధర్నాలు
అ 27న సకాలంలో పెన్షన్లు రాని రిటైర్డు ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పరామర్శలు
అ 29న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ఉద్యోగుల సమస్యలపై ధర్నాలు
ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎస్‌.కృష్ణమోహన్‌, ఆర్‌.వసంతరాయులు, యూనియన్‌ నాయకులు బి.కిశోర్‌, ఎస్‌.మల్లేశ్వరరావు, శివారెడ్డి, మహిళా నాయకులు జ్యోతి, ఏపీ జేఏసీ అనుబంధ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, 26 జిల్లాల చైర్మన్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img