Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

ప్రభుత్వ నిర్వాకం వల్లే అన్యాయం

ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
నిర్వాసితులకు పరిహారం చెల్లించి.. పునరావాసం కల్పించాలి..
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉధృతం

పోలవరం నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని, పరిహారం సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అంబేద్కర్‌ కూడలి సెంటర్‌లో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో అఖిల పక్షం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాకం వల్లే నిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని అన్నారు. 2013లో వామపక్షాల పోరాటాల ఫలితంగా భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంగా పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తానని వాగ్ధానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నిర్వాసితుల బాధలు మాత్రం తీరలేదన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అన్న జగన్‌ ప్రస్తుతం పరిహారం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుందన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ తదితర అవసరాలు తీరడానికి తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల ఉద్యోగాలు

ఏర్పడతాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నిర్వాసితుల సమస్యలు పట్టించుకోకుండా తాడేపల్లిలోని ప్యాలెస్‌లో కూర్చొంటే పోలవరం నిర్వాసితుల వెతలు ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేస్తూ కొండ గుట్టలపైకి తరుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీలలో విద్యుత్‌, డ్రెయినేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు లేకుండా ఎలా తరలిస్తారని రామకృష్ణ ప్రశ్నించారు. నిధుల లేమితో పునరావాస కాలనీల నిర్మాణం జరగడం లేదని, ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకగా సాగుతోందన్నారు. దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలన్నారు. 2015లో ఆర్డీవో, తహశీల్దార్‌, ఐటీడీఏ.. 18 సంవత్సరాలు నిండిన వారికి రూ.5 లక్షల 83 వేలు, నిండని వారికి రూ.1,70,200ల పరిహారం ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పిస్తామని వ్రాతపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. అయితే నేటికీ అమలుకు నోచుకోలేదని, బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని వివరించారు. త్వరలో ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ త్యాగాలు చేసిన నిర్వాసితులను రోజుల తరబడి నీటిలో ముంచి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రధాన అడ్డంకి, తొలి ముద్దాయి అన్నారు. చలో దిల్లీ కార్యక్రమం చేపట్టి మోదీ మెడలు వంచాలన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ నిర్వాసితులు కష్టకాలంలో ఉన్నారని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారికి అండగా ఉండకపోగా అధికారులు, పోలీసులు కలిసి బాధిత ప్రజలను ఖాళీ చేయాలని బెదిరించడం దుర్మార్గమని అన్నారు. నిర్వాసితులు నిత్యావసర సరుకుల కొనుగోలుకు పోలవరం వస్తే తిరిగి వెళ్లడానికి ఆర్డీవో, పోలీసులు అడ్డగించడం అమానుషమని తెలిపారు. బయటకు రావాలంటే తహశీల్దార్‌ అనుమతి తీసుకోవాలనడం సరైన విధానం కాదని అన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా పోరాటాలు సాగిస్తామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను బ్యాక్‌ వాటర్‌లో ముంచేశారని విమర్శించారు. 13 జిల్లాల ప్రజలకు అన్నదానం చేసిన ఆదివాసీలను నీటిలో ముంచడం అన్యాయం అన్నారు. మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ మాట్లాడుతూ నిర్వాసితుల, పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు వరప్రసాద్‌ మాట్లాడుతూ లక్షా 5 వేల కుటుంబాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. జనసేన నాయకులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎన్నికలలో జగన్‌ పరిహారం చెల్లింపు విషయంలో వాగ్ధానం చేసి నిర్వాసితులను నట్టేట ముంచారన్నారు. రాష్ట్ర రైతు నాయకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం విషయంలో వామపక్షాలు పని చేయడం అభినందనీయమని అన్నారు. పాలకులు నిర్వాసితులకు ఉపాధి కల్పించి, మెరుగైన పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
తొలుత బాధితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమను అన్యాయంగా ముఖ్యమంత్రి జగన్‌ నీటిలో ముంచారని విమర్శించారు. పోడు భూములకు సైతం నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకరరావు, సీపీఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం అప్‌లాండ్‌ కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, ఎ.రవి, వి.వెంకట్‌, ఆదివాసి సంఘం నాయకులు, నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img