Monday, August 8, 2022
Monday, August 8, 2022

బీజేపీతో తీవ్ర ముప్పు

మోదీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నం

సీబీఐతో కక్ష సాధింపు చర్యలు
వామపక్ష ఐక్యత పెంపొందాలి
ప్రగతిశీల ఉద్యమాలు పెరగాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర శక్తిగా మారిందనీ, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లోకి తీసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం విజయవాడ దాసరిభవన్‌లో జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన వివిధ జిల్లాల పార్టీ కార్యదర్శులను పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సమితి సభ్యులకు పరిచయం చేశారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో చర్చించాల్సిన అంశాల్ని, వర్తమాన, భవిష్యత్‌ ఉద్యమాల నివేదికను, కార్యదర్శి నివేదికను రామకృష్ణ ప్రవేశపెట్టారు. గత సమితి సమావేశం నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో మరణించిన పార్టీ నేతలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై నారాయణ ప్రసంగించారు. బీజేపీ, ఆరెస్సెస్‌తో దేశానికి తీవ్రప్రమాదం పొంచి ఉందని నారాయణ హెచ్చరించారు. ప్రధాని మోదీని దేశాధినేతగా బీజేపీ ప్రచారం చేస్తోందని, దానిని ప్రజలంతా తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. సీపీఐని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. వామపక్ష ఐక్యతను పెంపొందించుకోవాలని, ప్రగతిశీల శక్తులు, వ్యక్తులు, ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని మరిన్ని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కనుసన్నల్లో సీబీఐ నడుస్తోందని, వివిధ రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, నేతలపై కేసులు పెడుతూ, లొంగ దీసుకుంటోందని, ఎదురించిన వారిని జైళ్లకు పంపుతోందని నారాయణ విమర్శించారు. బీహార్‌ ఎన్నికలు జరుగుతున్న వేళ హడావుడిగా ఆర్బీఐ ద్వారా ఆర్థిక సాయాన్ని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. రాజ్యాంగ సంస్థలను మోదీ విచ్ఛిన్నం చేస్తున్నారని, మోదీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. రాష్ట్రాలపైనా కేంద్రం ఆర్థిక పెత్తనం చెలాయిస్తోందనీ మండిపడ్డారు. డబుల్‌ ఇంజన్‌ పేరుతో కేంద్రంలోనూ, రాష్ట్రాలలో ఒకే విధానం ఉండాలనే నియంతృత్వ ధోరణితో మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక బొగ్గు సమస్య తీవ్రతరమైందని చెప్పారు. రాష్ట్రాలు తప్పనిసరిగా 10శాతం విదేశీ బొగ్గు కొనుగోలు చేయాలని ఆదేశించడం ద్వారా అదానీకి ఆయాచిత లబ్ధి చేకూరుస్తున్నట్లు నారాయణ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీకి నిస్సిగ్గుగా కట్టబెడుతోదని విమర్శించారు. తాజాగా ప్రభుత్వ వైద్యవ్యవస్థను అదానీకి కట్టబెట్టేందుకు నిర్ణయించిందన్నారు. మోదీ హయాంలో 24 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారని, కనీసం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనూ కొత్తగా ఏర్పాటు చేయలేదని నిందించారు. ఆర్థిక లావాదేవీలు బీజేపీ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ చిల్లర స్థాయిలో అవినీతికి పాల్పడగా, బీజేపీ మాత్రం టోకుగా అవినీతికి పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌, ఆర్‌బీఐ, సీబీఐ, న్యాయవ్యవస్థ తదితర రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోందని విమర్శించారు. ప్రశ్నించేవారిపైనా, ప్రత్యర్థులపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ మోదీని ప్రశ్నించే ధైర్యం లేకపోతోందన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని ఒక్క అంశంలోనూ జగన్‌ నిలదీయలేకపోయారని విమర్శించారు. రాష్ట్రాలపై పెత్తనం చేసే చట్టాల ఆమోదానికి సైతం వైసీపీ మద్దతివ్వడం దుర్మార్గమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుతో గెలిచినప్పటికీ జగన్‌ చివరికి మోదీకి మద్దతిస్తారని చెప్పారు. మోదీ`జగన్‌ బంధం రైలు పట్టాల్లాంటివనీ, వారిద్దరూ విడిపోరూ, కలవబోరనీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైతం సీబీఐ కేసులకు భయపడి బీజేపీని వ్యతిరేకించే సాహసం చేయలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల పొత్తులపై జరుగుతున్న చర్చను నారాయణ ప్రస్తావించారు. ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల పొత్తులు, సీట్ల పేరిట కాలయాపన చేయకుండా ఉద్యమాల బలోపేతంపై దృష్టి సారించాలని సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img