Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

బీజేపీ నేతల్లో…భయం… భయం

లఖింపూర్‌ ఘటనతో…పెల్లుబికిన ప్రజాగ్రహం
ప్రైవేటు సైన్యాల ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు

న్యూదిల్లీ : అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాల్నే అవలంబిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు యూపీలో చోటు చేసుకున్న లఖింపూర్‌ ఖేరీ ఘటన శాపంగా మారింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ఆందోళన చేస్తున్న అన్నదాతలపై కార్లతో దాడి చేసి నలుగురు రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ నేతలపై దేశ వ్యాప్తంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ ప్రజాగ్రహం తిరుగుబాటుగా మారుతుందనే భయం ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశానికి బలం చేకూర్చేలా బీజేపీ నేతల వ్యవహార శైలి కనిపిస్తోంది. తాజాగా హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రైవేటు సైన్యంగా మారి ఆందోళన చేస్తున్న అన్నదాతలపై దాడులు చేయాలని పిలుపునివ్వడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సీఎం వ్యాఖ్యలకు ముందుగానే హరియాణాలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్‌ అధికారి కూడా రైతుల తలలు పగులగొట్టండని పోలీసులకు ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ చర్యలన్నీ ప్రజల్లో తమ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం గమనించిన పాలకపార్టీ నేతల్లో పెరుగుతున్న అసహనానికి పరాకాష్టగా విమర్శకులు భావిస్తున్నారు.
కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం దేశంలోని ఒక వర్గం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగానే ఉండడం, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవడం, మతతత్వ అజెండాను అమలు చేయడం సహా పార్లమెంటులో చేస్తున్న చట్టాలన్నీ వివాదాస్పదమైనవే కావడంతో ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. తాజాగా దేశానికి అన్నంపెట్టే రైతన్నలను కార్ల కింద తొక్కించిన బీజేపీ నేతల చర్యను దేశ ప్రజలెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్న తరుణంలో వారిలో భయం నెలకొంది. అన్నదాతల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్ని కుట్రలు చేసినా నల్ల చట్టాలను రద్దు చేసేదాక పోరాటం ఆగదని సంయుక్త కిసాన్‌ మోర్చా చేసిన ప్రకటన బీజేపీ పాలకులకు కంటగింపుగా మారింది. తమకు అనుకూలమైన సంస్థలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో రైతులపై ఎంత విషం చిమ్మినా వెరువక తమ ఆందోళనలు సాగిస్తున్న అన్నదాతలపై బలప్రయోగానికి కూడా తెగబడిరది. అప్పటికీ లొంగకపోవడంతో ప్రాణాలు తీయడానికి వెనుకాడడం లేదని లఖింపూర్‌ ఖేరి ఘటనతో స్పష్టమైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ విధానాలను వ్యతిరేకించేవారిపై కక్ష పూరితంగానే వ్యవహరించిన బీజేపీ నేతలు నేడు పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం ఎలా అని అలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ బహిర్గతం కాని ప్రజాగ్రహం లఖింపూర్‌ ఘటనతో వ్యక్తమవడంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డట్టు కనిపిస్తోంది. అందుకు ఆందోళలనలను పక్కదారి పట్టించేలా ఎదురుదాడులు చేయడం ప్రారంభించారు. అన్నీ తాము చూసుకుంటాం జైళ్లకు వెళ్లడానికి కూడా సిద్దం కండని తమ కార్యకర్తలకు సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం హరియాణాలోని అధికార బీజేపీ ఇప్పటికే ప్రారంభించింది. త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ కూడా ఖట్టర్‌ తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోని ఆగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి తమ దగ్గరున్న అన్ని వ్యూహాలు విఫలమవడంతోనే హింసాత్మక చర్యలు చేపట్టడం కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img