Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యోగి ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం

లఖింపూర్‌ ఘటనలో ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లున్నాయి?

అరెస్టులు జరిగాయా?
సమగ్ర వివరాలివ్వాలని ఆదేశం : విచారణ నేటికి వాయిదా
లఖింపూర్‌ హత్యలు దురదృష్టకరమని వ్యాఖ్య

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన వెనుక కేంద్రమంత్రి కుమారుడి పాత్ర ఉందని విమర్శలు రావడంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హత్యలపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ధర్మాసనం.. ఎఫ్‌ఐఆర్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి..? ఎందరిని అరెస్టు చేశారు? అని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌), జ్యుడిషియల్‌ దర్యాప్తు కమిషన్‌ సేకరించిన వివరాలను తమకు ఇవ్వాలని సూచించింది. ‘ఈ ఘటనలో ఒక జర్నలిస్టు, నలుగురు రైతులు సహా మరికొందరు చనిపోయారని మీ అంతట మీరే చెప్పారు. వేర్వేరు వ్యక్తులు హత్యలకు గురికావడం దురదృష్టకరం. నిందితులు ఎవరు? ఎవరెవరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది? ఇప్పటి వరకు ఎవరినైౖనా అరెస్టు చేశారా? లేదా?.. అన్ని వివరాలతో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి’ అని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం పేర్కొంది. మీరు ఈ కేసును సరిగ్గా విచారించడం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతుందని, ఎఫ్‌ఐఆర్‌ కూడా సక్రమంగా లేదు అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది గరిమా ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇప్పటికే సిట్‌, జ్యుడిషియల్‌ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేటస్‌ రిపోర్టు వివరాలను అందజేస్తామన్నారు. రేపటిలోగా ఆ వివరాలను ఇవ్వగలం.
జ్యుడిషియల్‌ కమిషన్‌కు అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారధ్యం వహిస్తున్నారు అని కోర్టుకు చెప్పిన ఆమె ధర్మాసనం పరిగణనలోకి తీసుకున్న లేఖ ప్రతిని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిల్‌ పరిస్థితి ఏమిటో వెల్లడిరచింది. కేసును రేపటికి వాయిదా వేస్తున్నాం ’ అని పేర్కొంది. మృతుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ తల్లి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని విచారణ మధ్యలో అమృతిపాల్‌ సింగ్‌ ఖాల్సా ద్వారా తెలిసిందని సీజేఐ తెలిపారు. ఆమెకు తక్షణమే వైద్య సాయం అవసరమని, దానిని అందించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నామన్నారు. ‘మీరు (రాష్ట్ర న్యాయవాది) రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి.. మృతుడి తల్లి బాగోగులు చూడమని, అవసరమైన వైద్య సహకారం అందించమని, దగ్గరలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చమనండి’ అని ధర్మాసనం సూచనలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img