Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

బీసీల్లో కులగణన

వైద్యరంగంలో 4 వేల పోస్టులు భర్తీ
అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లకు ఆర్డినెన్స్‌
అదానీ డేటా సెంటర్‌కు విశాఖలో 130 ఎకరాలు
జైనులు, సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌లు
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
ఈడబ్ల్యూఎస్‌ వెల్ఫేర్‌తో కొత్త శాఖ ఏర్పాటు
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : వెనుకబడిన వర్గాల్లో కులాల వారీగా గణన చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఆర్థికంగా, సామాజికంగా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడటంతోపాటు వారి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఈ గణన తోడ్పడుతుందని మంత్రివర్గం భావించింది. మేథావులు, వివిధ బీసీ సంఘాలు, వివిధ సంస్థల డిమాండ్‌ మేరకు బీసీల వారీగా జన గణన చేయాలని కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాలు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డులు, పెన్షన్‌ కార్డులపై సంవత్సరం మొత్తం కూడా దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు ప్రతి ఏటా రెండు సార్లు నిధులు విడుదల చేయాలని మండలి తీర్మానించింది. పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగింది. దీనిలో భాగంగా అమ్మ ఒడి పొందాలంటే 75 శాతం హాజరు అర్హతతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. కోవిడ్‌ కారణంగా వరుసగా రెండు

సంవత్సరాలు ఈ నిబంధనను అమలు చేయలేకపోయిన ప్రభుత్వం, ఇకనుంచి పని దినాల్లో 75 శాతం హాజరును పరిగణనలోకి తీసుకుని 2021-22 విద్యాసంవత్సరం అమ్మ ఒడిని జూన్‌ 2022న అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చెల్లించనున్నారు. ఇక ఏపీలో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రివర్గం ఆమోదించిన మరికొన్ని నిర్ణయాలు ఇవే.
అ ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు పబ్లిక్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ అధ్వర్యంలోని 1,285 పోస్టులు, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌లో 560 గ్రేడ్‌ 2 ఫార్మాసిస్ట్‌ పోస్టులను కొత్తగా సృష్టించేందుకు మంత్రివర్గం నిర్ణయం.
– వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్య విభాగంలో అదనంగా 2,190 బోధనా సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది నియామకం
– గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి విలేజ్‌ క్లినిక్స్‌లో ఒక్కొక్కరు చొప్పున 10,032 పోస్టులు మంజూరు. ప్రస్తుతం వీటిలో 7,390 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. మరో రెండు నెలల కాలంలో 4,035 పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం
– ఈడబ్ల్యుఎస్‌ వెల్ఫేర్‌ పేరుతో ప్రభుత్వంలో శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
– రాష్ట్రంలోని జైనులు, సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రంలో 27 వేల మంది జైనులు, 10 వేల మంది సిక్కులు ఉన్నట్టు అంచనా
– నవంబర్‌ 1న వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం
– మండలి, శాసన సభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బందికి అనుమతి
– మావోయిస్టులు సహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు
– ఆంధ్రప్రదేశ్‌ సినిమాస్‌ రెగ్యులేషన్‌ చట్టం 1955 సవరణకు కేబినెట్‌ ఆమోదం. ఇందుకోసం ఆర్డినెన్స్‌ జారీ. పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్న ఏపీఎఫ్‌డీసీ. ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌, ఎస్‌ఎంస్‌లద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సౌకర్యం
– తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు, 19 పోస్టులకు ఆమోదం
– రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం పగటిపూటే 9 గంటలు ఇవ్వాలని నిర్ణయం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
– విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠంకు 15 ఎకరాలు కేటాయింపు
– అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో వేద, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు 17.49 ఎకరాలు కేటాయింపు
– కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు దిన్నెదేవరపాడులో క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు 50 ఎకరాల బదలాయింపు
– కృష్ణా జిల్లా నూజివీడు మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల భూమి కేటాయింపు
– వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణను దేవాదాయ శాఖ నుంచి తిరిగి వారికే అప్పగించాలని నిర్ణయం
– చిత్తూరు జిల్లాలో పేరూరు, విశాఖపట్నంలో భీమిలి మండలం అన్నవరం, కడప జిల్లాలో గండికోట, చిత్తూరులో హార్సిలీ హిల్స్‌, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాలలో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమి అప్పగిస్తూ కేబినెట్‌ ఆమోదం, 7 స్టార్‌ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులు, భీమిలిలో రూ.350 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్‌, తిరుపతిలో రూ.250 కోట్ల టూరిజం ప్రాజెక్టు, చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం
– విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విశాఖలో తాజ్‌ వరుణ్‌బీజ్‌ వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విజయవాడలో హోటల్‌ హయత్‌ ప్రాజెక్టుకు ఆమోదం. టూరిజం పాలసీలో భాగంగా వారికి అనేక రాయితీలు వర్తింపు
– ఏపీ గూడ్స్‌, సర్వీస్‌ టాక్స్‌ ఆర్డినెన్స్‌ సవరణలు
– విశాఖపట్నం మధురవాడలో అదానీ ఎంటర్‌ ప్రైజస్‌ అధ్వర్యంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు 130 ఎకరాల కేటాయింపు
– కడప జిల్లాలో రూ.227 కోట్లతో 5 లిప్టుల ఏర్పాటు
– విజయనగరంలో జేఎన్టీయూ యూనివర్సిటీకి గురజాడ యూనివర్శిటీగా నామకరణం, దీనిపై ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img