Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిరసన సెగ

వామపక్షాల ఆందోళనలు ఉద్రిక్తం
గుంటూరులో కట్టెల పొయ్యిపై వంటతో నిరసన
కడపలో ఎడ్లకు ఆటోను కట్టి నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలి : రామకృష్ణ, మధు, చలసాని

పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, విద్యుత్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను పెద్దఎత్తున నిరసించారు. పది వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరిగాయి. విజయవాడలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో వామపక్ష పార్టీల శ్రేణులు, ఆటో కార్మికులు, మహిళలు రహదారులకు అడ్డంగా ఆటోలను, వాహనాలను ఉంచి నిరసన తెలిపారు. మోదీ డౌన్‌ డౌన్‌ అని నినదించారు. ఇక్కడ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కడపలో ఎడ్లకు ఆటోను కట్టి, గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వామపక్ష శ్రేణులు నిరసన తెలిపాయి. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ప్రధాని మోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి అన్ని ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

విశాలాంధ్ర నెట్‌వర్క్‌ : పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, నిత్యవసర వస్తువుల ధరల పెంపును వ్యతిరేకిస్తూ, పది వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. విజయవాడ లోబ్రిడ్జి గద్ధ బొమ్మ సెంటరులో సీపీఐ, సీపీఎం విజయవాడ నగర కమిటీలు, ప్రజాసంఘాల అధ్వర్యాన పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఇక్కడకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, వివిధ కార్మిక, మహిళ, ప్రజా సంఘాల నేతలు తరలివచ్చి నలుదిక్కులా రహదారులను దిగ్బంధించారు. బృందాల వారీగా నేతలు విడిపోయి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి అంచెలంచెలుగా ముందుకెళ్లి ఆందోళనలు కొనసాగించారు. రహదారులకు అడ్డంగా ఆటోలను, వాహనాలను ఉంచి, వాటి ముందు వామపక్ష పార్టీల శ్రేణులు, ఆటో కార్మికులు, మహిళలు నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసనలతో బుద్ధి చెప్పాలంటూ నినదించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించి, దాదాపు అర్థగంటపాటు వాహనాలు బారులు తీరాయి. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, సీపీఐ నేతలు దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరావు, సీపీఎం నేతలు సిహెచ్‌.బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, పిన్నమనేని మురళీకృష్ణ, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, మహిళా సమాఖ్య నాయకులు పి.రాణి, ఓర్సు భారతి, పి. దుర్గాంబ, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, చలసాని శ్రీనివాస్‌, వివిధ ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరతలించారు. అరెస్టు సమయంలో పోలీసులు, వామపక్ష, ప్రజాసంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నేతలు తప్పుపట్టారు. అంతకముందు మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తూర్పారబట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండూ పోటాపోటీగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ, ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెలు, విద్యుత్‌ ఛార్జీలతోపాటు ఆస్తిపన్నులను భారీగా పెంచారని చెప్పారు. ఈ ధరలను సాధారణ ప్రజలు భరించలేని పరిస్థితులో ఉన్నారన్నారు. మోదీ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు రూ.60 ఉన్న పెట్రోలు ధర, ప్రస్తుతం రూ.114కు పెరిగిందని, రూ.50 ఉన్న డీజిల్‌ ధర నేడు రూ.104కు చేరిందని వివరించారు. మధు మాట్లాడుతూ మరో నెల రోజుల్లో పెట్రోలు ధర లీటరు రూ.130కు చేరే ప్రమాదముందని, పెట్రోలు ధరల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాకే బస్సు ఛార్జీలు, అన్ని వస్తువుల ధరలూ పెరిగాయన్నారు. చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సమస్యల్ని విస్మరించి బూతు పురాణం కొనసాగించడం దురదృష్టకరమన్నారు. దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ కరోనాను అడ్డంపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు.
గుంటూరులో వినూత్న నిరసన: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన వలన పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కోరుతూ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో, అన్ని మండల కేంద్రాలలో ఆందోలనలు కొనసాగాయి. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కట్టెలపొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం గ్యాస్‌ బండను భుజంపై పెట్టుకుని శంకర్‌ విలాస్‌ సెంటర్‌ నుంచి లాడ్జిసెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ముప్పాళ్ల మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం 37శాతం పన్నుల వసూలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 33శాతం వసూలు చేస్తున్నదనీ, పన్నులు తగ్గించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయనందున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ప్రధాని నరేంద్రమోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వలన పేదవాళ్ళు, చిన్నచిన్న వ్యాపారస్తుల జీవితాలు నాశనమయ్యాయని చెప్పారు. మోదీ విధానాల వలన పెట్రోలు, డీజిల్‌లతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశనంటాయని విమర్శించారు. సీపీఐ, సీపీఎం నాయకులు జంగాల అజయ్‌ కుమార్‌, పాశం రామారావు, కోట మాల్యాద్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కడపలో ఆటోకు ఎడ్లను కట్టి నిరసన : పెరిగిన ధరలకు నిరసనగా కడప జిల్లాలో అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. కడపలో ఆటోకు ఎడ్లను కట్టి సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య తదితరుల నాయకత్వంలో నిరసన తెలిపారు. తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సీపీిఐ జిల్లా వర్గ సభ్యులు పి.మురళి, నగర కార్యదర్శి జె విశ్వనాథ్‌, నాయకులు నదియా, కేవై రాజ,ఎన్‌ శివ,మంజుల,రత్నమ్మ,ఎన్‌ డి రవి,సి ఎచ్‌ శివ,కాలయ్య,సూరి,కుమార్‌,ప్రమీల, బాల, పూర్ణ , రామచంద్ర,సుశీల తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో : ప్రెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పత్తికొండలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి వినూత్న రీతిలో ద్విచక్ర వాహనాన్ని పాడే మోసుకుంటూ పురవీధుల గుండా ఉరేగిస్తూ నాలుగు స్తంభాల మండపం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, పెరిగిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుదాస్‌, మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్‌, సీపీఎం మండల కార్యదర్శి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు తిమ్మయ్య, ఏ ఐ వై ఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పులి శేఖర్‌, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు పెద్ద వీరన్న, రంగన్న, నెట్టికంటయ్య, గిడ్డయ్య గౌడ్‌, వెంకటేష్‌, అల్తాఫ్‌, నజీర్‌, పెద్ద ముని, చిన్న కౌలుట్ల, ఉరుకుందు, నాగేంద్ర, సిపిఎం నాయకులు దస్తగిరి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
విశాఖలో : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచుకుంటూపోవడానికి నిరసనగా గురువారం ఉదయం విశాఖలో గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్‌ మీదగా గురజాడ అప్పారావు విగ్రహం వరకు సీపీఐ, సీపీఎం అధ్వర్యాన ద్విచక్ర వాహనాలను తోసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.నరసింగరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ ఎంఎల్‌ జిల్లా నాయకుడు వై.కొండయ్య తదితరులు మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జిల్లాల్లో : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ తదితర నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్‌లో చేపట్టిన ధర్నా, రాస్తారోకోలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్‌ పాల్గొన్నారు. చింతూరు, రామచంద్రాపురం, అమలాపురం, రాజానగరంలో నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, సీపీఐ ఎంఎల్‌ రెడ్‌ స్టార్‌ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి, పెంటపాడు, తాడేపల్లిగూడెంటౌన్‌, తణుకు, ఇరగవరం, భీమవరం, కొయ్యలగూడెంలో ధర్నా, నిరసన దీక్షలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img