Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

బెంబేలెత్తిస్తున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’

రోజురోజుకూ ఉధృతమవుతున్న కేసులు
రోజూ 50కి పైగా బాధితులు.. ఐదుగురు మృత్యువాత
ఇప్పటివరకు 3,876 కేసులు.. 324 మంది మృతి

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి :
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊపిరిపీల్చుకునే లోపే బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో అధికార యంత్రాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాజిటివ్‌ వచ్చి తగ్గిన వారికే ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఎక్కువగా వ్యాపిస్తోంది. దీంతో కరోనాను జయించామన్న ఆనందాన్ని కుటుంబసభ్యులతో కూడా పంచుకోకుండానే ఈ ఫంగస్‌ ఆవిరి చేస్తోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా లక్షణాలను తక్షణమే గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. దీంతో కరోనా బాధితులు తీవ్ర భయకంపితులవుతున్నారు. కరోనా వచ్చిన వారందరికీ బ్లాక్‌ ఫంగస్‌ సంక్రమించే అవకాశం లేదని వైద్యులు ధైర్యం చెపుతున్నప్పటికీ, ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితుల్లో కోలుకున్న పాజిటివ్‌ బాధితులందరిలోనూ బ్లాక్‌ ఫంగస్‌ భయం వెన్నాడుతోంది. స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వినియోగించబడ్డవారికి, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి సహజంగా ఈ ఫంగస్‌ సంక్రమిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్లాక్‌ఫంగస్‌ కేసులను పరిశీలించిన దాని ప్రకారం, దీనిని ఆదిలోనే గుర్తించని పక్షంలో ఫంగస్‌ మెదడుకి చేరితే కోలుకోవడం కష్టమంటున్నారు. వైరస్‌ ప్రవేశించిన రెండు, మూడు రోజుల్లోనే ముఖ భాగంలోని అన్ని అవయవాలపై ఇది దాడి చేస్తుంది. తొలుత ముక్కు భాగంలో ప్రవేశించి తర్వాత కళ్లు, చెవులు, దవడల నుంచి మెదడుకు ఎగబాకుతోంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల్లోకి కూడా ప్రవేశిస్తోంది. నిల్వ ఉన్న బ్రెడ్‌ను ఫంగస్‌ తినేసిన తరహాలో ఇది దాడి చేసిన చోట కణజాలాన్ని తినేస్తుంది. ఆ ప్రాంతాన్ని మొత్తం గుల్ల చేస్తోంది. కనిగుడ్లు బైటకు వచ్చి చూడటానికి భయంకరంగా ఉంటున్నాయి. ఈస్టేజిలో మెదడుకి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు చాలామందికి కళ్లు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఫంగస్‌ మెదడుకి చేరితే మాత్రం ప్రతి 10 మందిలో కనీసం 8 మంది మృత్యువాత పడుతున్నట్లు వైద్యులే చెపుతున్నారు. ఇంతటి భయంకరమైన బ్లాక్‌ ఫంగస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 21వ తేదీ వరకు రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2,772 కేసులు నమోదు కాగా, 212 మంది మృతి చెందారు. ఈనెల 11వ తేదీ నాటికి బాధితుల సంఖ్య 3,876కి మృతుల సంఖ్య 324కు చేరింది. కేవలం గత 20 రోజుల వ్యవధిలో దాదాపు 1104 ఫంగస్‌ కేసులు, 112 మంది మృతి చెందారు. అంటే దీనినిబట్టి రోజుకి 50కు పైగా కేసులు నమోదవుతుండగా, ఐదుగురు మృత్యువాతపడుతున్నారు. ఈ పరిణామాలు అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కరోనా సమీక్షలో సైతం ఈ విషయం ప్రస్తావించడం గమనార్హం. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల నివారణపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బ్లాక్‌ఫంగస్‌ వ్యాపించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాల్లో 626 మంది, అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 23 మంది ఫంగస్‌ బారినపడ్డారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా బ్లాక్‌ ఫంగస్‌ సంక్రమించి 65 మంది మృతి చెందగా, అత్యల్పంగా నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img