Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

భారత్‌ బంద్‌ ఓ హెచ్చరిక

జోరు వానలోనూ మిన్నంటిన నిరసనలు
మోదీని గద్దె దింపుతాం : సీపీఐ నేత రామకృష్ణ్ణ
బీజేపీ పాలన అస్తవ్యస్తం : సీపీఎం నేత మధు
ప్రజాసంపదను దోచేస్తే సహించం : కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : రైతు సంఘాల సమన్వయ సమితి ‘భారత్‌ బంద్‌’ పిలుపులో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. ఈ బంద్‌లో వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్‌, టీడీపీ, రైతు, కార్మిక, ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార పార్టీ వైసీపీ సైతం బంద్‌కు సంఫీుభావం తెలిపింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. లారీలు, ఆటోలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. సినిమాహాళ్లలో ఉదయం ఆటలు రద్దు చేశారు. బ్యాంకులు పని చేయలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. చిన్నపాటి బడ్డీకొట్లు సైతం తెరవలేదు. రహదారులు కర్ఫ్యూని తలపించాయి. రోడ్ల మీద ఆందోళనకారులు మినహా ఎవరూ కనపడలేదు. గులాబ్‌ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా అంతటా భారీ వర్షాలు కురిసినప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి బంద్‌ విజయవంతానికి కృషి చేశారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ దగ్గర వామపక్ష, కాంగ్రెస్‌, టీడీపీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. అనంతరం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి జాతీయ రహదారిపైన జోరు వానలో సైతం నేతలు ప్రదర్శన నిర్వహించారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అంబానీ, ఆదానికీ మోదీ కారుచౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకుంటే ప్రజలు గద్దె దించడం తథ్యమని చెప్పారు. దిల్లీ కేంద్రంగా పది నెలలుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు పోరాటాలు కొనసాగుతున్నప్పటికీ, కనీసం వారితో చర్చలు జరిపేందుకు మోదీ ముందుకు రాలేదని మండిపడ్డారు. తక్షణమే రైతులతో చర్చించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండు చేశారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా మరో చారిత్రాత్మక ఉద్యమానికి సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.మధు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక బరితెగించి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచేసిందని, బిట్రీష్‌ పరిపాలనను తలపించేలా మోదీ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌ మీద రకరకాల పన్నులు వేస్తోందని, నిత్యావసర వస్తువులపైనా పెద్దఎత్తున పన్నులు వేస్తోందన్నారు. పార్లమెంట్‌లో అత్యధిక స్థానాలు ఉన్నాయనే ధీమాతో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితమైన పార్టీలు ఒక అపూర్వమైన కలయికతో ఆందోళనలు కొనసాగించడం శుభపరిణామమన్నారు. పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను వరుస వారీగా విక్రయించే కార్యక్రమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇది ప్రజల దేశమని, ఈ దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రవేశపెట్టి నిలువునా దోపిడీకి పాల్పడుతోందన్నారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే చర్యలను ఉపసంహరించాలని, ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, లేకుంటే బీజేపీకి ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.
సీపీఐ`ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు, సీపీఎం వెస్ట్‌ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, నాయకులు బి.నాగేశ్వరరావు, దోనేపూడి కాశీనాథ్‌, ఏఐటీయూసీ విజయవాడ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సాంబశివరావు, టి.తాతయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ఐఎఫ్‌టీయూ నాయకులు కుటుంబరావు, టీఎన్‌టీయూసీ నాయకులు రెంటపల్లి శ్యామ్‌, పరుచూరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
నల్లచట్టాలు రద్దు చేయాల్సిందే : వడ్డే, రావుల
ఈ సందర్భంగా విజయవాడలో రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం నాయకులు పి.జమలయ్యతోపాటు వామపక్ష, రైతు, విద్యార్థి, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. వడ్డే, రావుల మాట్లాడుతూ ఇప్పటికైనా మోదీ దిగివచ్చి నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, మోదీ వెనక్కి తగ్గకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అక్కడి నుంచి గాంధీనగర్‌, గవర్నరుపేట, ఏలూరురోడ్డు మీదుగా బీసెంట్‌ రోడ్డుకు నేతలు ప్రదర్శనతో, బైక్‌ ర్యాలీతో వెళ్లి దుకాణాలను మూయించారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఐద్వా నాయకులు పుణ్యవతి, ధనలక్ష్మీ, సిహెచ్‌.బాబూరావు, కాశీనాథ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
దేశ సంపదను గుజరాత్‌ కార్పొరేట్‌లకు కట్టబెడుతున్న మోదీ : ఓబులేశు
దేశ సంపదను మోదీ ప్రభుత్వం బడా పెట్టుబడి దారులకు, గుజరాత్‌ కార్పొరేట్‌ వర్గాలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు హెచ్చరించారు. భారత్‌ బంద్‌ సందర్భంగా గొల్లపూడి ఏఐటీయూసీ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బహిరంగంగా కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తూ దేశ సంపదను ప్రజాసంపదను వారికి కట్టబెట్టడానికి చూస్తున్నారని విమర్శించారు. ఒక వైపు మేక్‌ ఇన్‌ ఇండియా పేరు చెప్పి దేశం వెలిగిపోతుందంటూ మాయ మాటలు చెపుతూ, మరోపక్క ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడంతోపాటు వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చేస్తూ నల్ల చట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. 10 మాసాలుగా రైతులు దిల్లీలో నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, కోశాధికారి బి.వి.వి.కొండలరావు, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
రైతుకు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న మోదీ : ముప్పాళ్ల
వ్యవసాయ నల్ల చట్టాలతో దేశ రైతాంగానికి, ప్రత్యేకంగా ఏపీకి ప్రధాని మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. భారత్‌ బంద్‌లో భాగంగా గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను నిలిపివేశారు. కబడ్డీ ఆడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు. అనంతరం లాడ్జి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బైక్‌లతో ర్యాలీగా నగరమంతా కలియతిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, ప్రభుత్వ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 మాసాలుగా దిల్లీలో జరుగుతున్న రైతు పోరాటాన్ని అణచివేస్తున్నారే తప్ప, నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం లేదని అన్నారు. అలాగే అమరావతి రాజధానికి నిధులు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప స్టీల్‌ ప్లాంట్‌, ఉత్తరాంధ్రకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, టీడీపీ నాయకులు కోవెలమూడి నాని, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల బ్రహ్మయ్య, ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
మోదీ, జగన్‌ చీకటి ఒప్పందాలు : ఈశ్వరయ్య
భారత్‌ బంద్‌ కడప జిల్లావ్యాప్తంగా విజయవంతమైంది. కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య పార్టీ శ్రేణులతో వంట వార్పు, ఆట పాట కార్యక్రమం నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్‌ వద్ద రైతులు తాము పండిరచిన పంటను రోడ్డుపై పారవేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి చంద్ర అధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్‌ వద్ద ప్రధాని మోదీ బొమ్మకు పాడె కట్టి అంత్యక్రియలు నిర్వహించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ మోదీ బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎండా, వాన, చలిని సైతం లెక్క చేయకుండా ఏడాదిగా దిల్లీలో రైతాంగం నిరసనలు తెలుపుతున్నా, 605 మంది రైతులు అసువులు బాసినా కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నారాయణ, దస్తగిరి, టీడీపీ నాయకులు మల్లెల లింగారెడ్డి, గోవర్థన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మోదీని సాగనంపి దేశాన్ని కాపాడుకుందాం : రవీంద్రనాథ్‌
భారత్‌ బంద్‌ సందర్భంగా రాజమహేంద్రవరంలో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీల అధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌ నుంచి కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అక్కడ ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ గత పది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెడుతున్నారని, దీనిలోభాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనుకుంటున్నారని, ఆయనను సాగనంపి దేశాన్ని కాపాడుకునేందుకు మరో స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్‌, ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.
తిరుపతిలో మోదీ శవయాత్ర, రైలురోకో
భారత్‌ బంద్‌లో భాగంగా తిరుపతిలో సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌, ఆర్‌పీఐ శ్రేణులు అంబేద్కర్‌ విగ్రహం నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దానిని దహనం చేశారు. తదుపరి రైల్వేస్టేషన్‌ పట్టాలపై బైఠాయించి రైల్‌ రోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం నాయకులు కందారపు మురళి, టీడీపీ, కాంగ్రెస్‌, ఆర్పీఐ నాయకులు నరసింహ యాదవ్‌, గోపాల్‌ రెడ్డి, అంజయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img