test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

భారీ సంక్షోభంలో లారీ

ఠారెత్తిస్తున్న టోల్‌, టైర్ల ధరలు, పన్నులు


200 శాతం పెరిగిన డీజిల్‌, ఇన్సూరెన్స్‌ రేట్లు
ఆ మేరకు పెరగని కిరాయిలు
తీవ్ర సమస్యగా మారిన డ్రైవర్లు, క్లీనర్‌ల కొరత
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న లారీ యజమానులు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న లారీ పరిశ్రమ రంగం మున్నెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకనాడు రారాజులా వెలుగొందిన ఈ రంగం ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూసే దీనావస్థకు చేరింది. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న డీజిల్‌, ఇన్సూరెన్స్‌, టోల్‌, టాక్స్‌, టైర్ల ధరలతోపాటు లారీకి వినియోగించే ప్రతి పరికరం ధర గణనీయంగా పెరగడం, ఆ మేరకు కిరాయిలు మాత్రం పెరగకపోవడంతో యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికితోడు కరోనా మహమ్మారి తోడు కావడంతో రవాణా రంగం కుదేలైంది. వ్యవసాయ రంగంలో రైతుల తరహాలో తరతరాలుగా ఈ రంగాన్ని నమ్ముకుని ఇదే వృత్తి, ప్రవృత్తిగా జీవిస్తున్న లారీ యజమానులు, ఇప్పటివరకు తమతోపాటు పది మందికి అన్నం పెట్టిన ‘లారీ’ని వదల్లేక, ప్రత్యామ్నాయం కానరాక నిత్యం ఆర్థిక కష్టాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. గత 50 ఏళ్లలో ఒక లారీ నుంచి 30, 40 లారీలకు అధిపతిగా దినదినాభివృద్ధి చెందిన అనేకమంది యజమానులు నేడు మళ్లీ ఒక లారీకి పరిమితమై డ్రైవర్‌గా మారిన దయనీయ పరిస్థితులు ప్రస్తుతం ఈ రంగంలో కోకొల్లలుగా ఉన్నాయి. కిరాయిల్లేక, తోలినా గిట్టుబాటు కాక, నెలవారీ ఫైనాన్స్‌ కిస్తీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇక్కట్లకు లోనవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల లారీలుండగా, ప్రస్తుతం వాటిలో 50 శాతం లారీలకు కిరాయిలు దొరకడం గగనమవుతుండగా, దాదాపు 60 వేల లారీలు వివిధ ఫైనాన్స్‌ కంపెనీల షెడ్లలో మూలుగుతున్నాయి. ఒకనాడు ఒకటి, రెండు లారీలున్న యజమానులు కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే పరిస్థితి ఉండేది. పది మందికి సహాయపడడానికి కూడా ముందుకొచ్చేవారు. అటువంటిది ప్రస్తుతం ఇతరుల సహాయం కోసం బేలచూపులు చూస్తున్నారు. కొందరైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో లారీలు తెగనమ్ముకుని, ఇతర ప్రాంతాలకు, వివిధ వృత్తుల్లోకి వలసపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతంలో కిస్తీలు రెగ్యులర్‌గా కట్టలేక ఫైనాన్స్‌ కంపెనీ వారు వచ్చి లారీ తీసుకెళితే అవమానంగా భావించేవారు. అటువంటిది ఇప్పుడు కిస్తీలు చెల్లించలేక, వారే ఫైనాన్స్‌ కంపెనీకి కబురుపెట్టి లారీ తీసుకెళ్లమని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి ధరలు అనూహ్యంగా పెరగడమే కారణం. ముఖ్యంగా గత పదేళ్లలో డీజిల్‌ ధరలు దాదాపు 200 శాతం పెరిగాయి. 2010లో డీజిల్‌ లీటరు ధర 36 రూపాయలుండగా, నేడు రూ.100కి చేరింది. దీనికితోడు ఏపీలో పొరుగు రాష్ట్రాల కంటే లీటరుకు అదనంగా వ్యాట్‌ టాక్స్‌ రూ.3 చెల్లింపు వల్ల రోజుకు సుమారు ఒక్కో లారీపై రూ.3 వేల అదనపు భారం పడుతోంది. అలాగే ఇన్సూరెన్స్‌ ప్రీమియం పదేళ్ల క్రితం 10 టైర్ల లారీకి 32 వేలు చెల్లించాల్సి వస్తే నేడు రూ.70 వేలు పైగా చెల్లించాల్సి వస్తోంది. ఇక టోల్‌ చార్జీలు, టైర్లు ఇతర పరికరాల ధరలు గణనీయంగా పెరిగాయి. చెన్నై నుంచి వైజాగ్‌ వెళ్లడానికి టోల్‌ గేట్లకే సుమారు రూ.7 వేలు కట్టాల్సి వస్తోంది. టైర్లు ఒక్కసారి మార్చాలంటే 2 లక్షలు ఖర్చు అవుతోంది. ఇంజన్‌ ఆయిల్‌తో పాటు లారీకి వినియోగించే ఇతర పరికరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక అన్నింటికి మించి ప్రభుత్వం కూడా రకరకాల పన్నుల పేరుతో పిండేస్తోంది. గతంలో రూ.5 వేలు ఉండే నేషనల్‌ పర్మిట్‌ ఇప్పుడు రూ.22 వేలకు చేరింది.
ఇదిగాక ఓవర్‌లోడు, ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌, ఇన్సూనెన్స్‌, పర్మిట్‌ వెరిఫికేషన్‌ల పేరుతో పోలీసులు, రవాణాశాఖాధికారులు వేస్తున్న అపరాధ రుసుంలు, మామూళ్లు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇక పట్టణాలలో లోడ్లు, అన్‌లోడ్ల విషయంలో ట్రాఫిక్‌ నిబంధనల వల్ల తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లో ఎనీటైమ్‌ సరుకుల రవాణాకు అనుమతి ఉండే టాటా ఏష్‌, అప్పీ ఆటోలు వంటి మినీ లారీ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు, భారీగా సరకు రవాణా చేసే సంస్థలు గూడ్స్‌ రైళ్లను ఆశ్రయించడం వల్ల కూడా లారీ రంగం తీవ్రంగా నష్టపోతోంది. వీటన్నింటికి తోడు మరోవైపు లారీ డ్రైవర్ల, క్లీనర్ల కొరత ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. లారీ యజమానుల కుటుంబాల్లో వారసులెవ్వరూ ఈ రంగంలో ఉండాలని కోరుకోవడం లేదు. దీనిపై ఆసక్తిగా కొత్తగా వచ్చేవారు కూడా కానరావడం లేదు. లారీ పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకపోగా, దీనిపై పన్నుల రూపంలో వందల కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది మరోవైపు ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే లక్షలాది మంది వివిధ వృత్తిదారుల వల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం వస్తోంది. అయినప్పటికీ పాలకులు ఈ రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img