Monday, April 22, 2024
Monday, April 22, 2024

విద్యుత్‌ ఉద్యమం తీవ్రతరం

నేడు 10 వామపక్ష పార్టీల సమావేశం
కేంద్రం అప్పు కోసం ప్రజలపై భారమా?
ట్రూఅప్‌ పేరుతో ప్రజలపై విద్యుత్‌ చార్జీలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`ఒంగోలు :
కేంద్రం ఇచ్చే అదనపు అప్పు రూ.2,500 కోట్లకు ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

కె.రామకృష్ణ విమర్శించారు. ఈనెల 22 నుంచి ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగే విద్యార్థి, యువజన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతుల ఏర్పాట్లను పరిశీలించేంచేందుకు రామకృష్ణ బుధవారం ఒంగోలు విచ్చేశారు. మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విద్యుత్‌ సంస్కరణలను బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణ, కేరళలోని వామపక్ష ప్రభుత్వం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే విద్యుత్‌ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నాయన్నారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో గృహ వినియోగదారులపై అదనపు విద్యుత్‌ భారాలు మోపుతోందన్నారు. రైతులు, గృహవినియోగదారులు…ఎవరినీ వదలడం లేదన్నారు. అధికారంలోకి రాకముందు జగన్‌ చెప్పిన మాటలేంటో, ఇప్పుడు చేస్తున్నదేమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ చార్జీల పెరుగుదలకు నిరసనగా ఈనెల 9వ తేదీన విజయవాడలో 10 వామపక్ష పార్టీల అధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. గత విద్యుత్‌ పోరాటం స్ఫూర్తితో ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టు, ఈ పాటికే నీరుపారుతున్న తెలుగుగంగ ప్రాజెక్టులను అక్రమ ప్రాజెక్టులుగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షతో, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ)కి ఫిర్యాదు చేస్తే డీపీఆర్‌లు పంపాలని ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించడం దుర్మార్గమన్నారు. ఆ ప్రాజెక్టులు ఎప్పుడు నిర్మించారో పరిశీలించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు ఇవ్వటాన్ని ప్రశ్నించారు.
మరో గాలి జనార్ధనరెడ్డిగా బాలినేని
బళ్లారిలో గాలి జనార్దనరెడ్డి మైనింగ్‌ గనులు గుప్పెట్లో పెట్టుకుని ఎలా పాలన సాగించారో…రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి చీమకుర్తి గనులను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యేక విమానాలలో విదేశాలలో చక్కర్లు కొడుతున్నారని, ఆయనకు ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో చెప్పాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కనీసం ఏఎన్‌ఎంకు రూ.15వేల జీతం ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ప్రత్యేక విమానాలలో విదేశాలలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.వెంకట్రావు, జిల్లా మాజీ కార్యదర్శి ఎం.వెంకయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img