Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ స్కామ్‌ ?

అదానీ సంస్థ మేలుకే 10 వేల మెగావాట్లు సోలార్‌ కొనుగోలు
రూ.30 వేల కోట్ల టెండర్ని నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తారా ?
మీ రివర్స్‌ టెండరింగ్‌ విద్యుత్‌ ఒప్పందాలకు వర్తించదా?
ప్రభుత్వంపై పయ్యావుల ఫైర్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వం అదానీ సంస్థకు మేలు చేయడం కోసమే రూ.లక్షా 20వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడానికి సిద్ధమైందని పీఏసీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని వదిలేసి రాజస్థాన్‌ నుంచి సోలార్‌ విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అదానీ సంస్థ చెప్పిన రూ.2.90పైసలు ఎక్కువ ధరని, 22 నెలలనుంచీ దేశంలో ఏ రాష్ట్రమూ సదరు సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి, విద్యుత్‌ కొనడానికి గానీ ముందుకు రాలేదన్నారు. అటువంటి సంస్థతో ఏపీ ప్రభుత్వం మాత్రమే ఒప్పందం చేసుకోవడంలో మతలబు ఏంటో చెప్పాలని నిలదీశారు. సెప్టెంబర్‌ 15న తమకు టెండర్‌ వేసిన అదానీ సంస్థ రూ.2.49పైసలకే ఇవ్వాలనుకుంటోందని లేఖ రాస్తే, 16నే ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. సాయంత్రం లేఖ వస్తే, మరునాటి ఉదయానికే, కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.30వేలకోట్ల పెట్టుబడికి సంబంధించిన విషయంలో ఏమీ ఆలోచించకుండా, లోతుపాతులు పరిశీలించకుండా, ప్రభుత్వం ఎలా నిర్ణయంతీసుకుంటుందని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకుండా, ఒక్క ఉద్యోగం రాకుండా, సదరు సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోలార్‌ విద్యుత్‌ ధరలు పతనమైన 22 నెలల తర్వాత ఈ ప్రభుత్వానికి రూ.2.49 పైసలు తక్కువగా అనిపించిందా? అదానీ సంస్థ అంతచౌకగా విద్యుత్‌ ఇస్తే, ఇతర రాష్ట్రాలు ఎందుకు కొనలేదో చెప్పాలన్నారు. అవసరాలకు మించి చంద్రబాబు విద్యుత్‌ ఒప్పందాలు చేసుకోవడంవల్ల రాష్ట్ర గ్రిడ్‌ వ్యవస్థ తట్టుకోలేకపోతోందని, టీడీపీ ప్రభుత్వ హాయాంలో చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను జగన్‌ ప్రభుత్వం రద్దుచేసింది. దానిపై కోర్టుకు సైతం అబద్దాలు చెప్పింది. ఇప్పుడు 10వేల మెగావాట్లను ఈ ప్రభుత్వం బయటి రాష్ట్రాల నుంచి కొంటే, గ్రిడ్‌ వ్యవస్థ తట్టుకుంటుందా? అదానీ సంస్థకు దొడ్డిదారిన మేలు చేకూర్చడం కోసమే ఈవిధమైన ఒప్పందం చేసుకోవడమనేది నిజం కాదా? ప్రతి దానికి రివర్స్‌ టెండరింగ్‌ అనే ప్రభుత్వం, దాదాపు 30వేల కోట్ల టెండర్‌ను నామినేషన్‌ పద్ధతిలో ఎలా అప్పగిస్తారని పయ్యావుల ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img