Friday, April 26, 2024
Friday, April 26, 2024

అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్రబ్యూరోఅమరావతి: రాష్ట్ర బడ్జెట్‌ ‘అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం’గా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వరుసగా ఐదోసారి అబద్దాల చిట్టాను విజయవంతంగా ప్రవేశపెట్టారని విమర్శించారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థికమంత్రి బుగ్గన గొప్పలు చెబుతుంటే, మరోవైపు సీఎం నవ్వులు విసరడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రామకృష్ణ ఓ ప్రకటనలో స్పందించారు. ‘యేటా పేరుకే లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి అందులో నాలుగో వంతు కూడా ఖర్చుపెట్టకుండా జనాన్ని మోసం చేస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్‌ ఉన్నప్పుడు ఉద్యోగులకు ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ బడ్జెట్‌ పూర్తిగా అంకెల గారడీనే. నీటి వనరుల అభివృద్ధికి కేవలం 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర జీడీపీ 7 శాతం కూడా దాటలేదు. కానీ అప్పుల కోసం 14 శాతం వరకు జీడీపీ పెరిగినట్లు చూపించుకొని ఎన్నాళ్లు మోసం చేస్తారు? అప్పుల కోసం 13 లక్షల కోట్ల జీఎస్‌డీపీని చూపించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అమ్మఒడి, ఆసరా, కళ్యాణమస్తులను ఒక ఏడాది ఎత్తేశారు. పైగా కళ్యాణమస్తు లాంటి పథకాలు షరతుల పుణ్యమా అని ఎవరికీ వర్తించడం లేదు. పైగా సగం స్కీములు స్కాములుగానే ఉన్నాయి. బడ్జెట్‌ బారెడు`ఖర్చు మూరెడులా కేటాయింపులు ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతిపాలు చేసిన సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు’ అని రామకృష్ణ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img