Friday, May 3, 2024
Friday, May 3, 2024

అమరావతి భూములపై కన్ను

దశలవారీ విక్రయానికి రంగం సిద్ధం

. పేదల సంక్షేమ పథకాల పేరుతో సర్కారు కుట్ర
. తారస్థాయికి ఆర్థిక కష్టాలు, అప్పులు
. వీటిని అధిగమించేందుకే రాజధాని భూముల అమ్మకం
. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న రైతులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నాలుగేళ్లుగా ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం అన్నివైపులా తలుపులు మూసుకుపోవడంతో రాజధాని నిర్మాణానికి రైతులు ఉచితంగా ఇచ్చిన భూములపై కన్ను పడిరది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి మినహాయిస్తే, ప్రభుత్వానికి కొంత భూమి మిగులుతుంది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. వాస్తవానికి అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అయినప్పటికీ, దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని పాలక పెద్దలు దుష్ప్రచారం చేస్తూ రాజధాని నిర్మాణ పనులను సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం రోజు నుంచే పూర్తిగా నిలిపివేశారు. కనీసం రైతులకిచ్చిన ప్లాట్లను కూడా అభివృద్ధి చేయలేదు. నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో తట్ట మట్టి కూడా వేయని ప్రభుత్వం…ఇపడు పేద ప్రజల సంక్షేమ పథకాల పేరుతో ఆ భూములు తెగనమ్మి… ఆ ఖ్యాతిని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టడం కూడా కష్టంగా మారింది. ఆరు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతోంది. ప్రతి నెలా జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది. వివిధ కార్పొరేషన్‌ల పేరుతో పెద్దమొత్తంలో ప్రభుత్వం అందినకాడికి అప్పులు గుంజుకొచ్చింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో నవరత్నాల అమలు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఒకపక్క ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వాడేసుకుందని, డీఏలు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సమ్మెకు దిగుతున్నారు. నవరత్నాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు అప్పులు ఇచ్చే అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో రాజధాని నిర్మాణానికి రైతులు ఉచితంగా ఇచ్చిన భూముల అమ్మకానికి తెరతీసింది. అమరావతి నిర్మాణానికి రైతులు సుమారు 34వేల ఎకరాలు భూసమీకరణ పథకం కింద ఇవ్వగా, వాటిలో రైతులకు, రాజధాని నిర్మాణానికిపోను ప్రభుత్వానికి సుమారు 9వేల ఎకరాల భూమి మిగులుతుంది. వాస్తవానికి సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఈ భూమిని రాజధాని అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను అమ్మకానికి పెట్టింది. తొలి విడతగా 14 ఎకరాలు విక్రయించేందుకు నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-ఆక్షన్‌ పోర్టల్‌ ద్వారా వేలం వేసేందుకు ఆఫ్‌సెట్‌ ప్రైస్‌ నిర్ణయించాలని గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు అధికారులు నవులూరు గ్రామానికి ఆనుకొని ఉన్న చినకాకాని- గుండుగొలను విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ వద్ద పదెకరాల భూమి ఎకరం రూ.5,94,50,000గా నిర్ణయించారు. అమరావతి రాజధానిలోని పిచ్చుకలపాలెం గ్రామానికి ఆనుకొని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని ఒక్కో ఎకరం రూ.5,41,04,400కు విక్రయించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. పిచ్చుకలపాలెం వద్ద మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ శెట్టి సంస్థ గతంలో భూమి తీసుకొంది. అప్పట్లో సుమారు రూ.1,200కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. అయితే అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపేయడంతో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూలు చేసుకొన్న సంస్థలన్నీ వెనకడుగు వేశాయి. గతేడాది పిచ్చుకలపాలెం వద్ద భూమిని విక్రయించేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నించింది. అయితే వివిధ కారణాలతో ఆక్షన్‌ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ పిచ్చుకలపాలెంతో పాటు నవులూరు వద్ద మరో పదెకరాలను కూడా ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. కోవిడ్‌ సమయంలోనూ గుంటూరు నగరంలో పీవీకే నాయుడు మార్కెట్‌, నల్లపాడు, కాకుమానువారి తోటలో భూములు విక్రయించేందుకు ప్రభుత్వం యత్నించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు రాజధాని ప్రాంతంలో ఉచితంగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకోసం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అప్పట్లో సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం దివాలా తీసిందా అని హైకోర్టు ప్రశ్నించింది. తర్వాత ఆ భూముల విక్రయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఉగాది నాటికి ఎట్టిపరిస్థితుల్లో పరిపాలనా రాజధాని విశాఖకు మార్చాలన్న ధ్యేయంతో ఉన్న ప్రభుత్వం…ఈలోగా అమరావతి రాజధాని భూములు తెగనమ్మేందుకు కసరత్తు నిర్వహిస్తోంది. అమరావతి రాజధాని విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత చర్యలపై రైతులు మండిపడుతున్నారు. రాజధాని నిర్మాణపనులను అర్ధాంతరంగా నిలిపివేసిన ఈ ప్రభుత్వానికి రైతులిచ్చిన భూములు అమ్మే హక్కు ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కుత్సిత రాజకీయాలకు స్వస్తి పలికి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి ఆగిన అభివృద్ధి పనులను పున:ప్రారంభించాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img