Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమరావతే రాజధాని

. సీపీఐ జాతీయ మహాసభల్లో ముప్పాళ్ల తీర్మానం
. ఏకగ్రీవంగా ఆమోదించిన సభ
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి
. రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్‌ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టం చేసింది. మూడు రాజధానులను నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించింది. మూడు రాజధానుల అంశం అనవసరంగా ప్రాంతీయ విబేధాలను సృష్టించేందుకు కారణమవుతోందని పేర్కొంది. ఈ మేరకు సీపీఐ జాతీయ మహాసభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విజయవాడ నగరంలో ఈనెల 14వ తేదీ నుంచి జరుగుతున్న సీపీఐ 24వ జాతీయ మహాసభలలో ఆదివారం అమరావతి రాజధాని అంశం పై పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం పూర్తి పాఠం ఇలా ఉంది. రాష్ట్ర విభజన 2014లో జరిగిన సందర్భంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశంబీజేపీ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కూడా సంపూర్ణ మద్దతును తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 34 వేల ఎకరాల భూములను ఆ ప్రాంత రైతాంగం త్యాగం చేసింది. ఎలాంటి నష్టపరిహారం ఆశించకుండానే రైతులు తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచంలో ఇలాంటి రైతుల త్యాగం మునుపెన్నడూ జరగలేదు. అత్యంత విలువైన తమ వ్యవసాయ భూములలో కేవలం నాల్గవ వంతు మాత్రమే వారు తీసుకునేందుకు అంగీకరించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 2017 అక్టోబరు 22న ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ కూడా చేశారు. అప్పటినుంచి సుమారు రూ.10 వేల కోట్లకు పైగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందులో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఉద్యోగుల నివాస భవనాలు, రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ వంటి సౌకర్యాలు, వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఉన్నాయి. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి అమరావతి రాజధానిని విస్మరించింది. జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను అమరావతి రైతులు, మహిళలు వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. దాదాపు 1100 రోజులకు పైగా వారి ఉద్యమం మహోద్యమంగా సాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఈ వైఖరిని రాజధాని రైతాంగం తీవ్రంగా నిరసిస్తోంది. రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ ఉద్యమానికి విశేష ప్రజా స్పందన లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. శంకుస్థాపన సమయంలో గంగాజలాన్ని సైతం మోదీ తెచ్చిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తీసుకోవాలని సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని సీపీఐ జాతీయ మహాసభలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనవసరంగా ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు నెలకొనేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ తప్పుడు నిర్ణయం కారణమవుతుందని మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img