Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అల్లూరి ఆశయాలకు బీజేపీ తూట్లు

ఆయనకు కులం అంటగడతారా?
విప్లవయోధుడిని స్మరించే అర్హత మోదీకి లేదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-భీమవరం: స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధంలేని బీజేపీకి ఆజాదీకా అమృత మహోత్సవం నిర్వహించే అర్హత లేదని, అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తూ గిరిజనుల సంపద దోచుకుంటున్న కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ..ఏ ముఖం పెట్టుకుని అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవ కమిటీ అధ్వర్యంలో మంగళవారం భీమవరంలో జరిగిన సభలో కె.రామకృష్ణ ప్రసంగించారు. సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, గదర్‌, అల్లూరి వంటి త్యాగమూర్తులు ప్రాణాలర్పించారని, కమ్యూనిస్టు పార్టీ ఆవిర్బావం నుంచే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నదని తెలిపారు. ఆ ఏడాదే పుట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. ఓట్ల కోసం అల్లూరిని హిందువుగా బీజేపీ చిత్రీకరిస్తున్నదని, కర్ణాటకలో భగత్‌సింగ్‌ చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించిందని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, ఈ ప్రాజెక్టుకు అల్లూరి పేరు పెట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలనూ బీజేపీ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో దళిత యువకుడి శిరోముండనం కేసు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు వెళ్లినా ఫలితం కనిపించలేదని ఆరోపించారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తెరపైకి తీసుకొచ్చారని, ఇది కూడా ఓట్ల రాజకీయమేనని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని, దేశాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి అల్లూరి స్ఫూర్తితో పునరంకితం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆ అర్హత లేదు: రాఘవులు
సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ అల్లూరిని స్మరించుకునే పేరుతో మోదీ భీమవరం రావడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. దోపిడీకి గురవుతున్న గిరిజనుల కోసం ఆయన పోరాడారని, ఓ పోరాటయోధుడిని హిందువుగా, ఒక కులానికి ప్రతినిధిగా బీజేపీ వక్రీకరించడం దారుణమన్నారు. అల్లూరి కేవలం మన్యం కోసం పోరాటం చేయలేదని, బ్రిటీష్‌పాలకులపై తిరుగుబాటు చేశారని, వారిని ముప్పుతిప్పలు పెట్టారని వివరించారు. అల్లూరిని చంపడానికి ఆ రోజుల్లోనే బ్రిటీష్‌ వారు 40 లక్షల రూపాయల రివార్డు ప్రకటిచారంటే ఆయన ఎంత పోరాటం చేశారో గ్రహించాలని కొనియాడారు. అల్లూరిని కాల్చి చంపిన రోజున స్వాతంత్య్ర ఉద్యమకారుడిని కోల్పోయామని గాంధీ నివాళులర్పించారని, ఆర్‌ఎస్‌ఎస్‌ కనీసం స్పందించలేదని, ఇదే బీజేపీ దేశభక్తని రాఘవులు ఎద్దేవా చేశారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి పీవీ సుందరరామరాజు, సీపీఐ ఎంఎల్‌ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, సంఘసేవకులు చెరుకువాడ రంగసాయి, ఎమ్మెల్సీ షేక్‌ బాబ్జీ, హోదా ఉద్యమ నాయకుడు చలసాని శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు. తొలుత ప్రకాశం చౌక్‌లో గల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారుడు తిరుమాని కామేశ్వరరావు అల్లూరి వేషధారణతో విప్లవస్ఫూర్తిని రగిలించగా, కళాకారులు ఆలపించిన గేయాలు ఆలరించాయి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నెక్కంటి సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారామ్‌, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం బాధ్యుడు కనుమూరి సత్యనారాయణ రాజు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌ కుమార్‌, భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలేటి న్యూటన్‌, కొల్లాటి శ్రీనివాస్‌, సీపీఐ నాయకులు ఎం.సీతారాం ప్రసాద్‌, చెల్లుబోయిన రంగారావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం.లక్ష్మిపతి, మండల నాగేశ్వరరావు, కళింగ లక్ష్మణరావు, నాగిడి శాంతమూర్తి, సీపీఎం నాయకులు గోపాలన్‌, జుత్తిగ నరసింహమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img