Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.800 కోట్లు గల్లంతు?

పత్తాలేని ఆర్థికశాఖాధికారులు
పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధం
ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెందిన ఉద్యోగుల భవిష్యనిధి(జీపీఎఫ్‌) ఖాతాల నుంచి రూ.800కోట్లు గల్లంతైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మంగళవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ఎదుట ఈ గల్లంతు వ్యవహారాన్ని వివరించారు. ఈ పరిణామంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు వాపసు తీసుకున్నట్లు ఆయనకు సమాచారం వచ్చింది. 90వేల ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.800కోట్లను ప్రభుత్వం వేసినట్లే వేసి, వెనక్కి తీసుకోవడంపై గందరోగళం నెలకొంది. దీనిపై ఆర్థిక శాఖాధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, వారంతా అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పీఆర్సీ డీఏ బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్నెల్లుగా ఇచ్చిన డీఏ బకాయిలను మళ్లీ వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇదే తరహా సంఘటనలు ఎదురవ్వగా, దానిపై ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే, వారి ఖాతాల్లో వేయడంతో సమస్య సద్దుమణి గింది. ఈ తరహా సంఘటనలు ప్రభుత్వానికి తెలిసిన జరుగుతున్నాయా?, ఉన్నతాధికారుల తప్పిదామా? అనేదీ అంతుపట్టడం లేదు. ఉద్యోగుల అనుమతి లేకుండా, మార్చిలో జరిగిన లావాదేవీలపై అకౌంటెంట్‌ జనరల్‌ ఇప్పటివరకు తెలపకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికశాఖలోని కాంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (సీఎఫ్‌ఎంఎస్‌) లో ఉన్న సీపీయూ యూనిట్‌ వద్ద తమ వేతన ఖాతాల నుంచి తీసుకునే సాంకేతికత ఉన్నప్పటికీ, ఇది ఎంతవరకు చట్టబద్దమంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నిధుల గల్లంతు వ్యవహారంపై ఆర్థిక శాఖాధికారులు ఇంతవరకు స్పందించలేదు.
రూ.800కోట్ల దారిమళ్లింపు దారుణం: ఎస్టీయూ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు చెందిన భవిష్యనిధి ఖాతాల నుంచి దాదాపు రూ.800కోట్లు గల్లంతైన సమాచారం బాధాకరమని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూఏపీ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఎస్టీయూ నేతలు ఒక ప్రకటన విడుదల చేస్తూ, 11వ పీఆర్సీకి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రావాల్సిన కరవు భత్యం బకాయిలను వారి ఖాతాల్లో వేసినట్లే వేసి, ఉద్యోగులకు ఎలాంటి సమాచారం లేకుండా వారి ఖాతాలో నుంచి రూ.800కోట్లు దారి మళ్లించడం తగదన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి, జీవిత బీమా, ఆర్జిత సెలవులు నగధీకరణ వంటి అంశాలకు విలువ లేకుండా పోయిందని, ఇది అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే రూ.800 కోట్లను ఉద్యోగస్తుల ఖాతాల్లోకి తిరిగి జమ చేయాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాల నుంచి రూ.800కోట్ల సొమ్ము గల్లంతుపై అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల అనుమతి లేకుండా, వారి ఖాతాల్లో నుంచి సొమ్ము తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలోనూ ఇదే తరహా సంఘటన జరిగితే, ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, గల్లంతైన సొమ్మును ఉద్యోగుల ఖాతాల్లోకి వేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img