Friday, April 26, 2024
Friday, April 26, 2024

అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై వాడీవేిడి వాదనలు

హైకోర్టు విచారణ నేటికి వాయిదా

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా సుదీర్ఘ వాదనలు జరిగాయి. సమయం ముగియడంతో తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. అవినాశ్‌రెడ్డి, సునీతారెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు ముగియగా… సీబీఐ వాదనలు శనివారం వింటామని హైకోర్టు తెలిపింది. అవినాశ్‌రెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు దాదాపు ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. సునీత తరపు న్యాయవాది గంటసేపు వాదనలు వినిపించారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో శనివారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి అవినాశ్‌ తల్లి
కర్నూలు ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని మెరుగైన వైద్యసేవ కోసం హైదరాబాద్‌ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలోనే ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా ఉన్నారు.
అవినాశ్‌ తండ్రికి అస్వస్థత
మరోపక్క వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న భాస్కరరెడ్డికి బీపీ పెరగడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత భాస్కర్‌రెడ్డిని మళ్లీ జైలుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం నిమ్స్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై సుప్రీం స్టే
వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జూన్‌ 30వ తేదీలోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ మరుసటి రోజు జులై 1న గంగిరెడ్డికి బెయిల్‌ ఇవ్వాలని ట్రయల్‌ కోర్టును హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. జులై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని ట్రయిల్‌ కోర్టును ఆదేశిస్తూ…బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. జులై 1న బెయిల్‌ ఇవ్వాలని షరతు విధిస్తూ… హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వివేక కుమార్తె సునీత… సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు షరతులపై గతంలో విచారణ సందర్భంగా సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. బెయిల్‌ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. సునీత పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం…గంగిరెడ్డి విడుదలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img